గుడ్‌... నైట్‌ 

Night Duties Are Causing Health Problems - Sakshi

రాత్రి నిద్ర లేకపోతే మబ్బుగా ఉంటుంది. మంచి నిద్ర గొప్ప వేకువకు వేకప్‌ కాల్‌. నిద్రలేమి జీవితానికి ఒక శాపంలా మారింది. లైఫ్‌లో స్పీడ్‌ ఎక్కువై నిద్రను మింగేస్తోంది. ఇక కొందరు పిల్లలకు రాత్రి అనేది నిజంగా కాళరాత్రి. ఈ చిన్నారుల సమస్యలు వేరు. పీడకలలతో నైట్‌ అంటేనే వాళ్లకు టెర్రర్‌. ఇటు పెద్దలు... అటు పిల్లలు వీళ్లందరిపైనా ప్రభావం చూపే  అనేక రాత్రి సమస్యలూ, వాటి పరిష్కారాల సమాహారమే ఈ కథనం.

రాక్సీలో నార్మాషేరర్‌... బ్రాడ్వేలో కాంచనమాలా అని సంధ్యాసమస్యల మీద కవిత రాశాడు శ్రీశ్రీ. అందులో మలిసందె వేళ రకరకాల వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలను ప్రస్తావిస్తాడు. అచ్చం అలాగే రాత్రి డ్యూటీలు చేసేవారికి కొన్ని సమస్యలుంటాయి. చీకట్లో చిన్నపిల్లలకు మరికొన్ని ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం కోసం ఎన్‌ఐజీహెచ్‌టీ ‘నైట్‌’ తీసుకోవాల్సిన జాగ్రత్తలు... రాత్రిళ్లు చిన్నపిల్లలు ఎదుర్కొనే సమస్యలూ వంటివాటిని అధిగమిస్తే హెల్త్‌ పరంగానూ వాళ్లు ‘కెఎన్‌ఐజీహెచ్‌టీ’ నైట్స్‌ అంటే ఆరోగ్యవీరులవుతారు. అలాంటి కొన్ని ‘నైట్‌’ అంశాలపై అవగాహన కల్పించడం కోసమే ఈ కథనం. 

మీది నైట్‌ డ్యూటీయా... 
ఇటీవల నైట్‌ డ్యూటీలు చేసే వారి సంఖ్య చాలా ఎక్కువ. అమెరికా లాంటి దేశాల పనివేళలు మనకు రాత్రివేళల్లో నడుస్తుంటాయి. మన రాత్రి వాళ్లకు పగలు కావడమే దీనికి కారణం. అందుకే చాలా మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు రాత్రంతా పనిచేయాల్సి వస్తుంటుంది. వాళ్లు మాత్రమే కాదు... మన దేశంలోనూ నైట్‌షిఫ్ట్‌ల్లో హాస్పిటల్స్‌లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతరత్రా సిబ్బంది మొదలుకొని సెక్యూరిటీ గార్డుల వరకు రాత్రంతా పనిచేయాలి. పనికి సంబంధించి రాత్రిపగలు వంటి తేడాలు క్రమంగా చెరిగిపోతుండటంతో నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసేవారికి వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలు ఇలా ఉంటాయి. 

సర్కాడియన్‌ రిథమ్‌లో మార్పులు : మెదడులో నిద్రకు కారణమయ్యే ప్రత్యేకమైన కణసముదాయాలను ఒక స్విచ్‌లాంటి దానితో పోల్చవచ్చు. రాత్రి నిద్ర వచ్చేందుకు ‘స్లీప్‌ స్విచ్‌’ ఆన్‌ కావడం, మళ్లీ నిద్ర పూర్తయ్యాక మెలకువ వచ్చే స్విచ్‌ ఆన్‌ కావడం ఒక సైకిల్‌లా జరుగుతుంది. దీనికి మెదడులోపల  హైపోథెలామస్‌లో ఉండే ‘సూప్రా కయాస్మాటిక్‌ న్యూక్లియస్‌’ అనే భాగం తోడ్పడుతుంది. ఇది రాత్రికాగానే నిద్ర వచ్చేలా, మళ్లీ ఉదయం మెలకువ వచ్చేలా చేస్తుంది. ఇలా ఈ రెండు కార్యకలాపాలు వరసగా, క్రమబద్ధంగా జరగడాన్ని ‘సర్కాడియన్‌ రిథమ్‌’ అంటారు. దీన్నే ఇంగ్లిష్‌లో బయలాజికల్‌ క్లాక్‌ అనీ, తెలుగులో జీవగడియారం అంటారు. ఈ గడియారం కారణంగానే మనకు నిర్ణీత వేళల్లో నిద్రరావడం, మెలకువ రావడం జరుగుతుంది. నైట్‌షిఫ్ట్‌ కారణంగా ఈ రిథమ్‌ దెబ్బతిని అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్ర నాణ్యతా లోపిస్తుంది. ఫలితంగా తీవ్రమైన అలసట (ఫెటీగ్‌) కలుగుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. ఇది తాము పనిచేసే ప్రదేశాల్లో ప్రమాదాలకూ కారణం కావచ్చు. 

గుండెజబ్బుల ప్రమాదం : రాత్రివేళల్లో పనిచేసేవారిలో గుండెజబ్బులు వచ్చే ముప్పు పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. కరొనరీ ఆర్టరీ డిసీజ్‌ వచ్చే ముప్పూ ఉంటుంది. ఛాతీ నొప్పి (యాంజైనా) రావచ్చు. హైబీపీ (హైపర్‌టెన్షన్‌) కూడా రావచ్చు. 

డయాబెటిస్‌ ముప్పు: నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసే వారిలో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు 50% ఎక్కువ. 

మహిళల్లో: నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళల్లో కాస్త అరుదుగానే అయినా కొన్ని గర్భధారణ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. పిల్లలు చాలా తక్కువ బరువుతో పుట్టడం, గర్భస్రావం అయ్యే అవకాశాలు పెరగడం వంటి ముప్పులు ఉంటాయి. 

జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు: నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసేవారు పగలు మేల్కొని ఉండేవారికి భిన్నంగా తింటూ ఉంటారు. ఉద్యోగాల్లో చేరిన తొలిరోజుల్లో ఇలా తినాల్సి రావడంతో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. తిన్నది జీర్ణం కాదు. కడుపులో మంట రావచ్చు. తినే వేళలు మారడంతో శానిటరీ అలవాట్లు అంటే మలవిసర్జనకు వెళ్లే వేళలూ మారే అవకాశం ఉంది. దాంతో కొందరికి మలబద్దకం వంటి సమస్యలు రావచ్చు.  రాత్రివేళ పనిచేసే ఉద్యోగుల్లో సాధారణంగా శారీరక శ్రమ తక్కువగా ఉండటంతో పాటు ఆహారం తీసుకోవడంలో మార్పుల వల్ల స్థూలకాయం వస్తుంది.  అందుకే నైట్‌ షిఫ్ట్‌లలో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లను కాస్తంత  మార్చుకోవడం మంచిది. దాంతో చాలా  సమస్యలు తగ్గుతాయి. అలాగే పైన పేర్కొన్న గుండెజబ్బులు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌ వంటి ముప్పులూ చాలావరకు తొలగుతాయి.  వారి ఆహార నియమాలు ఇలా ఉంటే మంచిది. 

వీలైనంత తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. దాంతో ఆహారం జీర్ణమవ్వడం తేలికవుతుంది.  ∙సాధారణంగా నైట్‌షిఫ్ట్‌ వాళ్లు ఆఫీస్‌ కేఫటేరియాలోనే ఎక్కువగా తింటుంటారు. దీనికి బదులు ఇంట్లో నుంచే ఆహారాన్ని తీసుకెళ్లడం మంచిది. ఇంటి భోజనంలోనూ కొవ్వులు ఎక్కువగా లేకుండా, పీచుపదార్థాలు, కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ∙ఒకవేళ తప్పనిసరిగా కాఫెటేరియాలోనే తినాల్సివస్తే...  పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే...  సలాడ్స్, పళ్లు, మొలకెత్తిన గింజలు, పొట్టుతో ఉన్న పప్పుధాన్యాలు, గింజధాన్యాలు (అంటే... పొట్టుతోనే ఉన్న గోధుమలతో చేసిన రోటీలు, మొక్కజొన్నలతో చేసిన పదార్థాలు, బ్రౌన్‌బ్రెడ్‌ శాండ్‌విచ్‌లు) వంటివి తీసుకోండి. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా ఎక్కువగా వేయించిన వేపుళ్లకు (ఫ్రెంచ్‌ ఫ్రైస్, సమోసాలు, చిప్స్‌ వంటివి) దూరంగా ఉండండి. తీపి పదార్థాలు, రిఫైన్డ్‌ ఫుడ్స్‌ (అంటే... క్యాండీలు, చాక్లెట్‌లు, వైట్‌ బ్రెడ్స్, బన్స్, పాస్తాస్, పిజ్జాలు, కూల్‌డ్రింక్స్‌) వంటిని చాలా తక్కువగా తీసుకోవాలి. 

నైట్‌డ్యూటీలు చేసే చాలామంది రాత్రిళ్లు కాఫీ, టీ ఎక్కువగా తీసుకుంటుంటారు. కాఫీ, టీ కంటే నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండటమే మేలు.

రోజూ 30–40 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరి. నైట్‌షిఫ్టుల్లో ఉండేవారి డ్యూటీల్లో వారి శారీరక కదలికలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వారికి వ్యాయామం చాలా అవసరం. దాంతో బరువు పెరగదు. 

డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులు తీసుకోవాలి. ఆ మందుల వేళలు నిర్ణయించడంలో డాక్టర్‌ సూచనలు తప్పక తీసుకోవాలి. 

ఇటీవల మామూలుగానే ప్రజల్లో విటమిన్‌–డి పాళ్లు చాలా ఎక్కువగా తగ్గిపోతున్నాయి. అలాంటిది ఇక నైట్‌–డ్యూటీలు చేసేవారి విషయంలో సూర్యరశ్మికి అస్సలు ఎక్స్‌పోజ్‌ కాకపోవడం వల్ల విటమిన్‌–డి మోతాదులు  తగ్గే అవకాశం తప్పక ఉంటుంది. అందుకే నైట్‌–డ్యూటీలు చేసేవారు ఒకసారి తమ విటమిన్‌–డి మోతాదులు పరీక్ష చేయించుకొని, అవసరమైతే డాక్టర్‌ సలహా మీద సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుంది. 

నైట్‌డ్యూటీల వల్ల కుటుంబసభ్యులతో గడిపే క్వాలిటీ సమయం తగ్గడంతో కుటుంబ బంధాలు ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటాయి. 

నైట్‌డ్యూటీల్లో పనిచేసేవారిలో చిరాకు, పరాకు కూడా పెరగవచ్చు. ఫలితంగా కుంగుబాటుకు లోనయ్యే అవకాశాలూ పెరుగుతాయి. కుటుంబ సంబంధాల్లో విఘాతం కూడా ఒత్తిడికి మరో కారణమయ్యేందుకు అవకాశం ఉంది. అందుకే నైట్‌డ్యూటీల వారు ఈ ఒత్తిడిని అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. ధ్యానం వంటి రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ పాటిస్తే... రాత్రిళ్లు డ్యూటీ చేసేవారికి అవి మరింతగా ఉపయోగపడతాయి. 

ఇక్కడ పేర్కొన్న సూచనలు/జాగ్రత్తలు పాటించాక కూడా సమస్యలు తగ్గకపోతే సంబంధిత నిపుణులను కలవాలి. మహిళలైనా,  పురుషులైనా నైట్‌షిఫ్టుల్లో పనిచేసేవారు ప్రతి ఆర్నెల్లకో లేదా ఏడాదికోసారో వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

నిద్రలేమి సమస్యను అధిగమించడం ఇలా...
నిద్రలేమితో బాధపడుతున్నవాళ్లు ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే మంచి నిద్రపట్టేందుకు అవకాశాలెక్కువ. 
రాత్రి ఒకే వేళకు నిద్రపోవాలి, ఉదయం మళ్లీ వేళకు నిద్రలేవాలి.  
బెడ్‌రూమ్‌ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మరీ చల్లగానూ, మరీ వేడిగా కాకుండా ఉండాలి. నిద్రపోతున్న సమయంలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. ఈ మసక చీకట్లోనే నిద్ర వచ్చేందుకు తోడ్పడే మెలటోనిన్‌ రసాయనం విడుదల అవుతుంది. 
పొగతాగడం, ఆల్కహాల్‌ పూర్తిగా మానేయాలి. 
సాయంత్రం ఏడు దాటాక కాఫీలు, టీలను, కెఫిన్‌ ఉండే కూల్‌డ్రింక్స్‌ తీసుకోకూడదు. 
రాత్రి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. 
పెందళాడే రాత్రి భోజనం పూర్తి చేయండి. కడుపు నిండుగా తినకండి. 
నిద్రకు వుుందు టీవీలో ఉద్విగ్నత, ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినివూలూ, సీరియళ్లు చూడొద్దు. బెడ్‌రూమ్‌లో టీవీ లేకుండా చూసుకోండి. బెడ్‌రూమ్‌ను వర్క్‌ప్లేస్‌గా మార్చవద్దు. 
రాత్రి వుంచి నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పూర్తిస్థాయి పగటి వెలుగులో గడపాలి. 
నిద్రకు వుుందు ఆహ్లాదకరమైన మ్యూజిక్‌ను వినండి. 
నిద్రకు వుుందు పుస్తకాలు చదివితే నిద్ర వస్తుంది కానీ... అందులో ఉత్కంఠకు గురిచేసే ఆసక్తికరమైన విషయాలున్న పుస్తకాలు చదవద్దు. కేవలం నిద్రపట్టడానికి ఉపకరించేలా మాత్రమే మీ పుస్తకపఠనం ఉండాలి. 
ఊపిరితిత్తులు, కిడ్నీల జబ్బులుండి వాటికోసం మందులు ఉపయోగించేవాళ్లు డాక్టర్‌ సలహామేరకు వాటిని పగటి పూట వాడేలాగా మార్పు చేసుకోవచ్చు. ఇక నొప్పుల సమస్యలు (పెయిన్‌ డిజార్డర్స్‌) ఉన్నవాళ్లు డాక్టర్‌ను సంప్రదించి వాటికి సంబంధించిన మందులు వాడాలి. 
వాకింగ్‌ వంటి వ్యాయమాలు చేయాలి. అయితే వాటిని ఉదయం వేళ చేయడం మంచిది. ఒకవేళ ఉదయం వీలుకాకపోతే రాత్రి నిద్రపోయే ముందర మాత్రం కఠినమైన వ్యాయామాలు చేయవద్దు. నిద్రకు ముందు చేసే కఠిన వ్యాయామాలు ఒక్కోసారి నిద్రపట్టకుండా చేయవచ్చు. 
మంచి నిద్ర పట్టడానికి చేసే పైన పేర్కొన్న మంచి అలవాట్లను ‘స్లీప్‌ హైజీన్‌’ నిర్వహణగా పేర్కొంటారు. ఈ ‘స్లీప్‌ హైజీన్‌’ను నిత్యం ఆచరించడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

పిల్లల్లో పక్క తడిపే అలవాటు
పిల్లల్లో రాత్రి ఇబ్బందుల్లో ముఖ్యమైనది పక్క తడిపే అలవాటు. దీంతో వారు చాలా ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ఇతర పిల్లలతో కలిసి బంధువుల ఇంటికీ, ఫంక్షన్లకూ వెళ్లలేరు. కనీసం కంబైన్‌డ్‌ స్టడీస్‌ కూడా చేయలేరు. 

పిల్లలు రాత్రిపూట నిద్రలో మూత్రవిసర్జన చేసే సమస్యను వైద్యపరిభాషలో నాక్టర్నల్‌ అన్యురిసిస్‌ అంటారు. సాధారణంగా 95 శాతం మంది పిల్లల్లో ఐదారేళ్లు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్‌ కంట్రోల్‌) సాధిస్తారు. కానీ 4 శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా కొద్దిమందిలో అంటే 1 శాతం మందిలో పెద్దయ్యాక కూడా నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం చూస్తుంటాం. అయితే ఇది అబ్బాయిల్లో ఎక్కువ. 

ఇలాంటి సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో సాధారణంగా యూరినరీ ట్రాక్‌ అబ్‌నార్మాలిటీస్‌ దీనికి కారణం కావచ్చు. ఇంకా నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్‌ డిజార్డర్స్‌), యాంటీ డైయూరెటిక్‌ హార్మోన్‌ (ఏడీహెచ్‌) లోపాలు, మానసికమైన కారణాలు, కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్‌ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్‌ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు. 

పిల్లల్లో ఈ సమస్య ఉంటే మూత్రపరీక్షలతో పాటు హార్మోనల్‌ ఎస్సే చేయించడం అవసరం. వాటిని బట్టి ఇది హార్మోన్లకు సంబంధించిన సమస్యా, కాదా అని తెలుసుకోవచ్చు. 

ఈ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిద్రలో మూత్రవిసర్జన చేసే పిల్లలను కించపరచడం, శిక్షించడం వంటివి అస్సలు చేయకూడదు. 
సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వడం, నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు పూర్తిగా ఇవ్వకపోవడం అవసరం. 
పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయించాలి. 

చికిత్స: ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్‌పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్‌ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమె ప్రమిన్‌ వంటి కొన్ని మందులు బాగా పనిచేస్తాయి. 
అలాంటి పిల్లలను కొన్ని స్ప్రేల సహాయంతో సామాజిక ఉత్సవాలకు నిర్భయంగా తీసుకెళ్లవచ్చు. అలాంటి చర్యల వల్ల పిల్లల్లో ఆత్మసై్థర్యం పెరుగుతుంది. 
ఈ సమస్యకు హార్మోన్‌ లోపాలు కారణం అయితే  3–6 నెలలపాటు మందులు వాడటం వల్ల ఈ సమస్యను 50 శాతం మందిలో సమర్థంగా అదుపు చేయవచ్చు. 
సమస్య అదుపులోకి రాకపోతే పిల్లల డాక్టర్ల ఆధ్వర్యంలో చికిత్స చేయించాలి. 

ఒకింత పెద్ద పిల్లల్లో రాత్రి సమస్యలు... 
ఇక కాస్తంత పెద్ద పిల్లల అంటే టీనేజ్‌లో ఉండే కౌమార బాలబాలికల్లో నైట్‌స్లీప్‌  సమస్యలు మరోలా ఉంటాయి. వాళ్లలో చాలామంది పిల్లలు రాత్రివేళ అకస్మాత్తుగా ఉలిక్కిపడి నిద్రలేస్తుంటారు. లేచాక చాలా భయపడుతుంటారు. ఈ సమస్యను నైట్‌ టెర్రర్స్‌ అంటారు.
నైట్‌ టెర్రర్స్‌కు కారణాలు: సాధారణంగా మనకు కనుపాపలు వేగంగా కదలని (ఎన్‌ఆర్‌ఈఎమ్‌) దశలోని స్టేజ్‌ 3, స్టేజ్‌ 4 లలో మనసులో కలిగే కలల వంటి భావనలు గుర్తుండవు. కానీ ఆ సమయంలో అత్యంత భయంకరమైన కలలు వచ్చి, వాటికి భయపడి మెలకువ వచ్చినందున అవి గుర్తొచ్చి మరింత భయం వేస్తుంది. దీన్ని నైట్‌ టెర్రర్‌గా పేర్కొనవచ్చు. ఇది ఎన్‌ఆర్‌ఈఎమ్‌ స్టేజ్‌3, స్టేజ్‌4 లలో వచ్చే సమస్య. 

భయంకరమైన కలలు రావడం (నైట్‌మేర్‌) : ఇది కూడా ఎన్‌ఆర్‌ఈఎమ్‌ స్టేజ్‌3, స్టేజ్‌4లో వచ్చే సమస్య. గుర్తుకు రాని భయంకరమైన కలలు రావడం ఈ జబ్బు ప్రత్యేకత. నైట్‌ టెర్రర్స్‌ లేదా నైట్‌మేర్స్‌ సమస్యతో బాధపడే పిల్లల్లో చాలామందిలో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. అందుకే ఈ సమస్యలు ఉన్నవారిని అటు సైకియాట్రిస్ట్‌లతో పాటు ఇటు స్లీప్‌ స్పెషలిస్ట్‌లకు చూపించి, తగిన చికిత్స తీసుకోవాలి.

నైట్‌ స్లీప్‌ డిప్రవేషన్‌ (రాత్రివేళల్లో నిద్రలేమి) 
నైట్‌డ్యూటీలు చేసేవారిలో నిద్రలేమి సమస్య అంతకంతకూ పెరుగుతోంది. తగినంత నిద్రలేకపోవడంతో అనేక శారీరక, మానసిక సమస్యలొస్తాయి. 

నిద్రలేమి వల్ల కలిగే తక్షణ నష్టాలు  
ఏకాగ్రత లోపించడం
అలసట / నిస్సత్తువ                   
గుండె వేగం / గతిలో మార్పు
తక్షణం స్పందించలేకపోవడం
హుషారు తగ్గడం lమబ్బుగా / దిగులుగా ఉండటం
చిరాకు, కోపం
మానవ సంబంధాలు దెబ్బతినడం, కుటుంబ కలహాలు పెరగడం
ఒళ్లునొప్పులు... ఇలాంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. 

దీర్ఘకాలిక నష్టాలు
మతిమరపు
మెదడు ఎదుగుదలలో లోపం            
పిల్లల ఎదుగుదలలో లోపం
అధిక రక్తపోటు
గుండెజబ్బులు
స్థూలకాయం 
డయాబెటిస్‌
జీర్ణకోశ సమస్యలు
రోగనిరోధక శక్తి తగ్గడం
గాయాలు మానే ప్రక్రియ ఆలస్యం కావడం
జీవన వ్యవధి (లైఫ్‌ స్పాన్‌) తగ్గడం. 

నిద్రలేమి వల్ల కలిగే / పెరిగే  మానసిక సమస్యల్లో కొన్ని... 
నిద్రలేమి వల్ల మానసిక సమస్యలు పెరుగతాయి. చాలా మానసిక సమస్యల్లో కనిపించే ముఖ్యమైన లక్షణం నిద్రలేమి. ముఖ్యంగా మూడ్‌ డిజార్డర్స్, యాంగై్జటీ డిజార్డర్స్, సైకోసిస్, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ) సమస్యల్లో నిద్రలేమి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 
పిల్లల్లో... అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) వంటి లక్షణాలు ∙మెదడు ఎదుగుదలలో లోపం, ∙జ్ఞాపకశక్తి లోపించడం 
పెద్దల్లో... ∙యాంక్సైటీ డిజార్డర్స్‌  ∙ డిప్రెషన్‌ ∙సైకోసిస్‌ ∙మాదక ద్రవ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రావడం. 
నిద్రలేమి సమస్య తగ్గడానికి తగినంత నిద్రపట్టేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలతో తగ్గకపోతే వైద్యనిపుణులను సంప్రదించాలి.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top