
మా ఆయన సెక్స్ వర్కర్ల దగ్గరకి వెళ్లి...
మేడమ్, రెండున్నర సంవత్సరాల క్రితం మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. పెద్దలను ఎదిరించి,
విడిగా ఉంటారు కానీ... వివాహ బంధం రద్దు కాదు!
లీగల్ కౌన్సెలింగ్
మేడమ్, రెండున్నర సంవత్సరాల క్రితం మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. పెద్దలను ఎదిరించి, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగి, మా పెళ్లికి ఆటంకాలను కల్పించిన వారు పెట్టిన కేసుల నుండి బయటపడి, రిజిస్టర్ వివాహం చేసుకున్నాం. ఇద్దరం ఉద్యోగస్తుల కావడంతో ఆర్థిక సమస్యలు రాలేదు. నేను హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాను. నా భర్త కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తుండేవారు. ప్రమోషన్ మీద ఆయనకు ముంబాయికి ట్రాన్స్‌ఫర్ అయింది. నేను కూడా కంపెనీ వారు పంపిస్తే, ఒక సంవత్సరం పాటు విదేశాల్లో ఉద్యోగం చేశాను. దాదాపు ఒకటిన్నర సంవత్సరాలపాటు మేము దూరంగా ఉన్నాము. మొన్ననే నేను ఇండియా వచ్చాను. ఆయన కూడా బాంబే నుండి హైదరాబాద్ వచ్చారు. ఎయిర్‌పోర్టులోనే నేను సిక్ అయితే అటునుండి అటే హాస్పిటల్‌కు వెళ్లాము. నేను మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. ఎందుకయినా మంచిదని నా భర్తకు కూడా హెల్త్ చెకప్ చేయించాను. నా గుండె పగిలే విషయం తెలిసింది. నా భర్తకు హెచ్.ఐ.వి సోకినట్లు తెలిసింది. నేను దూరంగా ఉన్న సమయంలో ఆయన సెక్స్ వర్కర్ల దగ్గరకి వెళ్లి, విచ్చలవిడిగా అనైతిక కార్యాలు జరిపినట్టు తెలిసింది, నా మనసు ఇది జీర్ణించుకోలేకపోతోంది. నేను తీవ్రమైన ఆవేదనలో ఉన్నాను. నా నమ్మకం, విశ్వాసాలపై ఆయన దెబ్బకొట్టారు. నాకు అతని ముఖం చూడాలన్నా మనస్కరించడం లేదు. కొంతకాలం అతనికి దూరంగా ఉండాలనుకున్నాను. అదీ కూడా కోర్టు ద్వారా. దయచేసి ఎలాగో తెలియజేయండి. - గీత, హైదరాబాద్
మీ మనోవేదన అర్థం చేసుకున్నాను. మీ భర్త మీ నమ్మకంపై దెబ్బ తీశారు. మీ నిర్ణయం సరైనదే. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 10 ప్రకారం మీరు జుడీషియల్ సెపరేషన్ తీసుకోవచ్చు. అంటే మీ వివాహబంధం రద్దు కాకుండా విడిగా జీవించే అవకాశం అన్నమాట. సెక్షన్ 13 (1) గ ప్రకారం సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ వెనీరల్ డిసీజెస్ విడాకులకు ఒక కారణం అవుతుంది. హెచ్.ఐ.వి. కూడా ఆ కోవలోకి వస్తుంది. ఒకరినుంచి మరొకరికి సంక్రమించే సుఖవ్యాధులతో భార్యాభర్తల్లో ఎవరైనా బాధపడుతుంటే ఆ కారణం వల్ల రెండవవారు జుడీషియల్ సెపరేషన్ కేసు వేసి ఆర్డర్లు పొందవచ్చు. ఈ సెపరేషన్ కాలంలో మీరు అన్ని విషయాలూ క్షుణ్ణంగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అతన్ని క్షమించి కలిసి ఉండాలని అనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లవచ్చు. లేకుంటే విడాకులు తీసుకోవచ్చు.
మేడమ్, మా గల్లీలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఇటీవలే వెలిసింది. దానిలో దాదాపు 20 మంది దాకా మానసిక అస్వస్థులు ఉన్నట్లు సమాచారం. ఆ సెంటర్ నుంచి రోజూ అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయి. మేము నిశితంగా గమనిస్తే, అక్కడ పనిచేసే వాళ్లు రోగులను బంధించి బాగా కొడుతున్నారని, వారికి సరిగా ఆహారం ఇవ్వక మాడుస్తున్నారని తెలిసింది. మాకు వారి పరిస్థితి చూస్తే గుండె ద్రవించిపోతోంది. ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయమంటారు? - సంకా కోటేశ్వరరావు, తెనాలి
ముందుగా సునిశిత పరిశీలనా దృష్టికి, మీ సోషల్ రెస్పాన్సిబిలిటీకి అభినందనలు. మీరు చెబుతున్న వివరాల ప్రకారం బహుశ అది కొందరు ప్రైవేటు వ్యక్తులు కేవలం ధనార్జన కోసం పెట్టుకున్న మానసిక రోగుల చికిత్సాలయమో లేదా డ్రగ్స్, డ్రింక్స్‌కు బానిసలైన వారికోసం స్థాపించిన డీ అడిక్షన్ సెంటరో అయి ఉంటుంది. ఇలాంటివారిని హింసిస్తే అది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. చికిత్స జరిగే సమయంలో మానసిక రోగులను కాని, మత్తుపదార్థాలకు అలవాటుపడి చికిత్సకు వచ్చిన వారిని కానీ శారీరకంగా లేదా మానసికంగా హింసించ కూడదు. అవమానించ కూడదు. ముందు ఆ సెంటర్‌కు లెసైన్స్ ఉందో లేదో కనుక్కోండి. ఆ రోదనలు, ఆక్రందనలను రికార్డు చేయండి. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయండి. లేదంటే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించండి.
మా పెళ్లయి పన్నెండేళ్లయింది. మా ఇద్దరి మధ్య అన్యోన్యత ఏమాత్రం లేదు. దాంతో చట్టప్రకారం విడాకులు తీసుకోలేదు కానీ నేను, నా భర్త చాలా ఏళ్లనుంచి విడివిడిగా జీవిస్తున్నాం. నా ఇద్దరు ఆడపిల్లలూ నా దగ్గరే ఉంటున్నారు. ఈ మధ్యే నా భర్త, పిల్లల కష్టడీ కోసం కోర్టులో కేసు వేశారు. నాకేమో పిల్లల కష్టడీ ఆయనకు ఇవ్వడం ఇష్టం లేదు. నేను ఏం చేయాలి? - రమ, జహీరాబాద్
పిల్లలు మీ ఇద్దరికీ పుట్టిన వారు. మీరింకా లీగల్‌గా డైవోర్స్ తీసుకోలేదు. చట్టప్రకారం మైనర్ పిల్లల సంరక్షణ బాధ్యత తండ్రికే ఉంటుంది. అయితే మైనర్లయిన మీ పిల్లలు ఎన్నో ఏళ్లుగా మీతోనే కలిసి ఉంటున్నారు, అదీగాక మైనర్ పిల్లలకు తల్లి అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల జడ్జిగారు పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, దాని ప్రకారం నిర్ణయం తీసుకుని, తీర్పు ఇస్తారు. మీ పిల్లలిద్దరూ ఆడపిల్లలంటున్నారు కాబట్టి తండ్రికి కష్టడీ ఇచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే ఎదిగే ఆడపిల్లలకు తల్లి అవసరం ఎంతో ఉంటుంది కాబట్టి కష్టడీ మీకే ఇస్తారు. అయితే తండ్రికి వారానికో పదిహేను రోజులకో ఒకసారి పిల్లలను చూసేందుకు విజిటేషన్ రైట్స్ ఇస్తారు. మీరు అందుకు అంగీకరించక తప్పదు.
ఇ.పార్వతి
అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com
కేస్ స్టడీ
తగిన మూల్యం చెల్లించక తప్పదు!
లక్ష్మి, వెంకట్రావులు భార్యాభర్తలు. పెళ్లయిన నెలరోజులనుండే భర్త వేధింపులు ప్రారంభమయ్యాయి లక్ష్మికి. వెంకట్రావుది విపరీత మనస్తత్త్వం. లక్ష్మి మంచి చీరకట్టుకున్నా, పువ్వులు పెట్టుకున్నా అనుమానంతో వేధించేవాడు. రోజూ ఆఫీస్‌కు వెళుతుంది కాబట్టి అక్కడివారిని ఆకర్షించడానికే ఆ ముస్తాబులని చీటికిమాటికీ గొడవ పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు కొట్టేవాడు. ప్రతి రోజూ ఆఫీస్ నుంచి రాగానే ఆమె సెల్‌ఫోన్ చెక్ చేసేవాడు. తన సంపాదన అంతా తాగుడుకి, జల్సాలకి ఖర్చు చేసి లక్ష్మి జీతం మొత్తం లాక్కునేవాడు. ఈ హింసకు తోడు అతని తమ్ముడి పెళ్లయింది మొదలుకొని లక్ష్మిపై వరకట్న వేధింపులు మొదలుపెట్టాడు. తమ్ముడు పాతిక లక్షల కట్నం తెచ్చుకున్నాడని, తనకేమో దరిద్రపుగొట్టు సంబంధం దొరికింది అడ్డూ అదుపు లేకుండా తిడుతూ కట్నం తెమ్మని గొడ్డును బాదినట్లు బాదసాగాడు. తన పెళ్లికి చేసిన అప్పులకే చితికిపోయిన పుట్టిల్లు గుర్తొచ్చి వారికి ఈ వేధింపుల గురించి ఎప్పుడూ చెప్పలేదు లక్ష్మి. ఒకరోజు విపరీతంగా తాగి వచ్చి లక్ష్మిపైకి కర్ర విసిరాడు వెంకట్రావు. అది తగిలి తలపగిలింది లక్ష్మికి. వెంటనే ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని చికిత్స చేసి నాలుగు రోజుల్లో పంపించి వేశారు. మెడికల్ బిల్లు తడిసి మోపెడైంది. డిశ్చార్జ్ అయి వచ్చినప్పటినుంచి రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చి నెలరోజులు రెస్ట్ తీసుకోవలసి వచ్చింది. ప్రైవేటు ఉద్యోగం కావడం వల్ల ఉద్యోగం నుంచి తీసివేశారు యాజమాన్యం. వెంకట్రావ్ నిమ్మకు నీరెత్తినట్లున్నాడు. పైగా తనకు మనశ్శాంతి లేదని, కావాలనే మంచం దిగకుండా వేధిస్తోందనీ కొత్తవేధింపులు.
ఒకవైపు ఉద్యోగం పోయింది. మరోవైపు మోయలేని మందుల ఖర్చులు. ఇంకోవైపు గాయాల నొప్పులు, అనారోగ్యం. ఇక లాభం లేదనుకుని 478 ఎ కేసు వేసింది లక్ష్మి. తను ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎంతో బాధలు అనుభవిస్తున్నాననీ, ఇందుకు కారణమైన భర్తనుంచి నష్టపరిహారం ఇప్పించాలంటే ఏం చేయాలో సలహా ఇమ్మంటూ న్యాయవాదిని సంప్రదించింది లక్ష్మి. గృహ హింస చట్టం సెక్షన్ 22 ప్రకారం బాధితురాలు తాను అనుభవించిన పెయిన్, ట్రామా, ఆర్థిక నష్టం, శారీరక గాయాలు, సంపాదన నష్టం, మనోవ్యధలకు సరిపడా నష్టపరిహారం భర్త నుంచి పొందవచ్చునని న్యాయవాది తెలిపారు. వెంటనే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్‌కు వెళ్లింది లక్ష్మి. గృహ హింస చట్టం కింద వారు కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలిసిన వెంకట్రావు, పరిహారం చెల్లించకపోతే తనకు శిక్ష తప్పదని తెలుసుకుని హతాశుడయ్యాడు. వెంటనే లక్ష్మితో కాళ్లబేరానికి దిగాడు.
డి.వి. కేసు