అదిగో.. ఆకాశంలో సగం

Compared to males, women pilots are now 12 point 4 percent of our country - Sakshi

మగవాళ్లు నడిపితే ఒకలాగా...  ఆడవాళ్లు నడిపితే ఒకలాగా ఎగరవు విమానాలు. అయినప్పటికీ ఆడవాళ్లకు ఎప్పటికో గానీ విమానం నడిపే చాన్స్‌ రాలేదు! ఇప్పుడైతే ఉమన్‌ పైలట్‌లలో.. ఇండియానే నెంబర్‌ వన్‌. ఓసారి ఆకాశంలోకి చూడండి. అక్కడ కనిపించే ఆత్మవిశ్వాసపు రెక్కల్లో సగం భారతీయ మహిళలవే!

ముంబయికో, చెన్నైకో వెళ్లడానికి హైదరాబాద్‌లో విమానం ఎక్కి సీటు బెల్టు పెట్టుకున్న తర్వాత ఓ వాయిస్‌ వినిపిస్తుంది. ఈ విమానాన్ని నడుపుతున్న తన పేరు ఫలానా అని, ఫలానా టైమ్‌కి గమ్యస్థానంలో దింపుతానని ప్రయాణికులకు ఆత్మవిశ్వాసంతో కూడిన వినమ్రతతో చెప్తుందా గొంతు. పైలట్‌ స్త్రీ అని తెలిస్తే ‘వావ్‌... ఈ విమానాన్ని నడుపుతున్నది లేడీనా’ అనుకుంటాం.

అలా అనుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటాయి. అదే సమయంలో ముందు సీట్లోంచో వెనుక సీట్లోంచో ‘సేఫ్‌గా ల్యాండ్‌ అవుతామా’ అని పిల్లికూతలు వినిపించినా ఆశ్చర్యం లేదు. పైగా తమ జోక్‌కు తామే కిసుక్కుమంటుంటారు. ఈ కిసుక్కుమనేవాళ్లకు తెలియని సంగతి ఒకటుంది. అమ్మాయిలు ఎదిగారని, ఆ ఎదగడం అంతా ఇంతా కాదని, ఏకంగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగారని, నిన్నా నేడూ కాదు.. ఏనాడో ఎదిగారని!

మన దగ్గరే ఎక్కువమంది!
ఒకప్పుడు అమ్మాయిలు... ‘అదిగో నవలోకం... విరిసే మనకోసం’ అని ఆకాశంలోకి చూసి పాటపాడుకుని అంతటితో సంతోషపడేవాళ్లు. ఈ తరం అమ్మాయిలు... ‘ఇదిగో నవలోకం... మనమే నిర్మించాం’ అంటున్నారు. యూనిఫామ్‌ ధరించి ధీమాగా విమానం ఎక్కేసి కాక్‌పిట్‌లో కూర్చుని టోపీ సవరించుకుంటున్నారు. అష్టాచెమ్మాలో పావులు కదిపినంత సులువుగా విమానాలను కంట్రోల్‌ చేస్తున్నారు. ఆకాశంలో ఎగిరే విమానాలు అమ్మాయిల కంట్రోల్‌లోకి వచ్చేశాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల మహిళలు సాధించిన గొప్పతనానికి మనం మురిసిపోవడం కాదిది.

అచ్చంగా మన భారతీయ మహిళలు సాధించిన గొప్పతనం. పురుషులతో పోలిస్తే మనదేశంలో మహిళా పైలట్లు ప్రస్తుతం 12.4 శాతం ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కలిపి చూసుకున్నా మహిళా పైలట్‌ల పర్సంటేజ్‌ 5. 18 మాత్రమే. అయితే ఇదేదో చిన్న పెద్దా దేశాలను కలుపుకుని మనం ముందున్నాం అని చెప్పుకునే ప్రయత్నం కూడా కాదు. ‘అభివృద్ధి చెందిన దేశం’ అనే ట్యాగ్‌లైన్‌ తగిలించుకున్న అమెరికాలో మహిళా పైలట్‌లు 5.1 శాతమే ఉన్నారు. ఫ్రాన్స్‌లో 7.6 శాతం ఉంటే జపాన్‌లో 5.6 శాతం పైలట్‌ మహిళలున్నారు.

ఇండియాదే తొలి టేకాఫ్‌
మనదేశంలో తొలి పైలట్‌ మహిళ సరళాతక్రాల్‌. ఆమె 1936లో విమానం నడిపితే అప్పుడది ఒక సంచలనం అయింది. ఎనభై ఏళ్ల తర్వాత ఇప్పుడు అవనీ చతుర్వేది త్రయం (మోహనాసింగ్, భావనాకాంత్, అవని చతుర్వేది) యుద్ధ విమానాలు నడిపితే ‘ఆహా’ అంటూ దేశంలో మరొక దరహాసం. ప్రస్తుత తాజా సర్వే రిపోర్టు మనదేశానికి ఓ కిరీటం. అప్పట్లో సరళా తక్రాల్‌ జిప్సీ మోత్‌ విమానాన్ని ఎవరి సహాయం లేకుండా ఒక్కరే నడిపిన్పటికి ఆమె వయసు 21. అప్పటి సమాజం ఉన్న తీరుకు తగ్గట్లే సరళకు పదహారేళ్లకే పెళ్లయింది. ఆమె ఇంట్లో అప్పటికి తొమ్మిది మంది మగవాళ్లు పైలట్‌లుగా ఉన్నారు. ఆమె భర్త కూడా పైలటే. దాంతో అప్పట్లో పైలట్‌ కావాలనే సరళ ముచ్చట సంచలనం అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాలేదు.

ఆమె వేసిన తొలి అడుగులు... ఇన్నేళ్లకి ఓ రహదారిని నిర్మించాయి. మనదేశాన్ని మహిళా పైలట్‌ల సంఖ్యలో ముందువరుసలో నిలిపాయి. ముగ్గురమ్మాయిలకంటే ముందు మన మహిళలు ఆల్‌ ఉమన్‌ క్రూతో విమానాన్ని నడిపి రికార్డు సృష్టించారు. ఉమెన్స్‌ డే సందర్భంగా  2017, మార్చి ఎనిమిదవ తేదీన ఎయిర్‌ ఇండియా ఈ ప్రయోగాన్ని చేసింది. క్షమతా బాజ్‌పేయి ఆధ్వర్యంలోని మహిళల బృందం ఢిల్లీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోకి విమానాన్ని నడిపింది. మహిళలు ఏకబిగిన అంత ఎక్కువదూరం (12, 341 కిలోమీటర్లు) విమానం నడపడం ప్రపంచ రికార్డు. ఇలా అవనిలో సగం, ఆకాశంలో సగం అంటూ అవకాశాలను అందిపుచ్చుకుంటూనే ఉన్నారు. రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు.

– మంజీర

అవకాశమే సోపానం
విమానయాన రంగంలో మహిళల సేవలను చాలా కొద్ది దేశాలు మాత్రమే సమర్థంగా వినియోగించుకుంటున్నాయి. ఆ దేశాలు మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తూ దేశనిర్మాణంలో వారి భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నాయి. మనదేశం మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట్‌ 2017 ప్రకారం 26 వారాల జీతంతో కూడిన సెలవు ఇస్తోంది. అంతకు ముందు మెటర్నిటీ లీవ్‌ పన్నెండు వారాలు మాత్రమే ఉండేది.

అలాగే విమానయాన కంపెనీలు పైలట్‌లకు సీనియారిటీని బట్టి నెలకు మూడు నుంచి ఎనిమిది లక్షల వేతనాన్ని ఇస్తున్నాయి. వేతనం విషయంలో మహిళలకు ఎటువంటి వివక్ష ఉండదు. మహిళలకు మగవాళ్లతో సమానంగా వేతనాలిస్తున్నాయి.  రక్షణ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాయి. మహిళా పైలట్‌లను ఇంటి నుంచి పికప్‌ చేసుకుని, డ్యూటీ దిగిన తర్వాత ఇంట్లో డ్రాప్‌ చేయడంతోపాటు వారికి రక్షణగా సాయుధులైన గార్డును కూడా నియమిస్తోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top