ప్రధాని కీలక ప్రసంగం

Sakshi Editorial on Narendra Modi's Independence Day Speech

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ప్రధానమైన అంశాలెన్నిటినీ స్పృశించింది. అందులో త్రివిధ దళాలను సమన్వయం చేయడానికుద్దేశించిన రక్షణ దళాల ప్రధానాధికారి(సీడీఎస్‌) పదవిని సృష్టించబోతున్నట్టు చేసిన ప్రకటన, దాంతోపాటు జనాభా విస్ఫోటాన్ని అరికట్టడానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనాల్లో మాత్రమే సీడీఎస్‌ పదవి ఉంది. రాష్ట్రపతులుగా ఉన్న వారు సాయుధ దళాలకు సుప్రీం కమాండర్‌గా కూడా వ్యవహరిస్తారు. అయితే అది గౌరవనీయ పదవి మాత్రమే. ప్రధాని నేతృత్వంలో కేంద్రమంత్రి వర్గం సిఫార్సుల ఆధారంగా ఏదైనా దేశంపై యుద్ధం ప్రకటించడం ఈ పదవీ బాధ్యతల్లో ఒకటి. అలాగే విదేశాలతో కుదుర్చుకునే కీలక రక్షణ ఒప్పందాలన్నీ రాష్ట్రపతి పేరిటే ఉంటాయి. రక్షణ రంగానికి సంబంధించిన ఏ కీలక నిర్ణయం తీసు కోవాలన్నా, ఆ రంగానికి సంబంధించిన ఎలాంటి సమస్యల గురించి చర్చించాలన్నా సైన్యం, నావి కాదళం, వైమానిక దళం అధిపతులతో ప్రధాని సమావేశం కాక తప్పేది కాదు. ఆ మూడు రంగాల అధిపతులతో ప్రధాని సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. మొత్తంగా రక్షణరంగ వ్యూహాలను, దాని అవసరాలను సీడీఎస్‌ ఆధ్వర్యంలో ఆ దళాలే ఖరారు చేసుకుంటాయి. ఇకమీదట త్రివిధ దళాలకు సంబంధించిన సమస్త అంశాలపైనా ప్రధానికి సీడీఎస్‌ సలహాదారుగా ఉంటారు. అవసరమైనప్పుడల్లా ప్రధాని ఆయనతోనే సమావేశమవుతారు. ఆ దళా లమధ్య మెరుగైన సమన్వయానికి, కలిసికట్టు నిర్ణయాలకు, అవసరం ముంచుకొచ్చినప్పుడు మూడు దళాలూ సత్వరం కదలడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుంది. పైస్థాయిలో సమన్వయం ఉంటేనే క్షేత్రస్థాయిలో అది ప్రతిబింబిస్తుందని రక్షణ రంగ నిపుణులంటారు.

 వాస్తవానికి 1999లో కార్గిల్‌ యుద్ధ సమయంలో త్రివిధ దళాలు ఎదుర్కొన్న కొన్ని సమ స్యలను అనంతరకాలంలో అప్పటి యుద్ధ తంత్ర వ్యవహారాల నిపుణుడు కె. సుబ్రహ్మణ్యం ఆధ్వ ర్యంలోని ఉన్నతస్థాయి కమిటీ సమీక్షించించినప్పుడు సీడీఎస్‌ వ్యవస్థ ఉంటే వాటిని సత్వరం పరిహరించడం సాధ్యమయ్యేదన్న అభిప్రాయం కలిగింది. అప్పటి ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీ నేతృత్వంలోని మంత్రుల బృందం కూడా 2001లో దీన్ని సూత్రప్రాయంగా అంగీకరించింది. అటుపై 2012లో నరేష్‌ చంద్ర ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్‌ సైతం ఈ తరహా కమిటీ అవసరమన్న సూచన చేసింది. త్రివిధ దళాధిపతుల్లో అత్యంత సీనియర్‌ను ఈ పదవికి నియమించాలని ఆ కమిటీ ప్రతిపాదించింది. కానీ ఆ వ్యవస్థ సాకారం కావడానికి రెండు దశాబ్దాల సుదీర్ఘ సమయం పట్టింది. త్రివిధ దళాలకు ఏకీకృత వ్యవస్థ, సమన్వయం అవసరమని అధికారంలోకొచ్చినప్పటి నుంచి నరేంద్ర మోదీ చెబుతూనే ఉన్నారు. గతంలో ఎర్రకోట బురుజులపైనుంచి స్వచ్ఛభారత్, ఆయుష్మాన్‌ భారత్‌ వంటివి ప్రకటించిన మోదీ... ఈసారి జనాభా నియంత్రణను ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే ప్లాస్టిక్‌ వాడకం తగ్గించడం, మౌలిక సదుపాయాల రంగంలో రానున్న రోజుల్లో వంద లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. మూడున్నర లక్షల కోట్లతో చేపట్టబోయే ‘జల్‌ శక్తి మిషన్‌’ ద్వారా అన్ని ఇళ్లకూ కుళాయి నీరు ఇవ్వనున్నట్టు తెలిరు.  జనాభా అపరిమితంగా పెరిగితే దేశానికెదురయ్యే సమస్యలను ప్రస్తావించడంతోపాటు పరిమిత కుటుం బాల అవసరాన్ని కూడా చెప్పారు. తక్కువమంది పిల్లలున్నవారిని అనుకరించి చూడండని హితవు పలికారు. దీన్ని చర్చించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇది కేవలం ప్రస్తావన మాత్రమేనా లేక దీనికి సంబంధించి మున్ముందు కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన కార్యాచరణను ప్రకటిస్తుందా అన్నది చూడాలి. దేశంలో ఒకప్పుడు జనాభా నియంత్రణ మార్మోగేది. ‘ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు’ అనే నినాదం అప్పటి ప్రధాన ప్రసార మాధ్యమం ఆకాశవాణితోపాటు సినిమా థియేటర్లలో కూడా హోరెత్తేది. వివిధ కళారూపాల్లో దర్శనమిచ్చేది. కానీ అత్యవసర పరిస్థితి ప్రక టించిన కాలంలో ఇందిరాగాంధీ తనయుడు, అప్పటి యువనేత సంజయ్‌ గాంధీ బలవంతపు ఆపరేషన్లతో దాన్ని భ్రష్టుపట్టించారు. లక్ష్యాల సాధన కోసం పెళ్లికాని యువకులకు సైతం అప్పట్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారని అనంతరకాలంలో వెల్లడైంది. అటుపై అది ‘కుటుంబ సంక్షేమ పథకం’గా పేరు మార్చుకుని ఉందా లేదా అన్నట్టు మిగిలిపోయింది.

సమస్యల పరిష్కారాన్ని వాయిదా వేయడంగానీ, వాటిని తప్పించుకు తిరగడంగానీ తమ విధానం కాదని చెప్పడం ప్రభుత్వ కఠినవైఖరికి అద్దం పడుతుంది. 70 ఏళ్లలో ఎన్నిసార్లు చర్చించినా, ఎంత కృషి చేసినా సాధ్యంకాని 370, 35ఏ అధికరణల రద్దు 70 రోజుల్లో సాధ్య పడిందని ఆయన గుర్తు చేయడం ఇందుకోసమే. అయితే అన్ని అంశాల్లోనూ పట్టువిడుపుల్లేని విధానం ఎటువంటి ఫలితాలనిస్తుందో రాగలకాలంలో జమ్మూ–కశ్మీర్‌ పరిణామాలు రుజువు చేస్తాయి. ఈచర్య కశ్మీర్‌లో అటు ఉగ్రవాదాన్ని, ఇటు అవినీతిని అంతమొందిస్తుందన్నది ఆయన దృఢవిశ్వాసం. ప్రధాని ప్రసంగంలో ప్రస్తావనకొచ్చిన మరో ప్రధానాంశం అవినీతి. తన తొలి దశ పాలనలోనూ, ఇప్పుడూ ఉన్నతస్థాయి అధికార యంత్రాంగంలో అవినీతిని పారదోలడానికి అనుసరించిన విధానాలను ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉంటూ అవినీతి తిమింగలాలుగా అపకీర్తి గడించినవారిని సర్వీసు నుంచి వెళ్లగొట్టిన వైనాన్ని ఆయన ప్రస్తావిం చారు. ఈ జాబితాకెక్కిన 312మంది ఉన్నతాధికారులను బలవంతంగా రిటైర్‌ చేసినట్టు ఈమధ్యే పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది ఉద్యోగిస్వామ్యానికి మాత్రమే కాదు... రాజ కీయ రంగంతోసహా అన్ని రంగాలకూ విస్తరింపజేసినప్పుడే సత్ఫలితాలనిస్తుంది. అటువంటి చర్య నిష్పాక్షికతకు కూడా అద్దం పడుతుంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top