ప్రభుత్వానికి చూపు తెప్పిద్దాం

ప్రభుత్వానికి చూపు తెప్పిద్దాం - Sakshi


సాక్షి, విజయనగరం/విజయనగరం కంటోన్మెంట్/విజయనగరం మున్సిపాల్టీ:  ‘‘కడుపు నిండా దుఃఖాన్ని నింపుకొని ఉన్న మీరు మీ బాధలు చెప్పండి. మీ మాటలతోనైనా గుడ్డి ప్రభుత్వానికి చూపు తెప్పిద్దాం’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేస్తున్న గ్రామాల్లో ఆయన సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గూడెపువలస, కవులవాడ, ఎ.రావివలస గ్రామాల్లో నిర్వాసితులతో మాట్లాడారు. ‘‘ఇక్కడ జరుగుతున్న అన్యాయం, దౌర్జన్యం కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు తెలియాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ విధంగా గడ్డి పెట్టాలో, ఎలా బుద్ధి చెప్పాలో మీ నోటితో మీరే చెప్పండి’’ అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ ఎదుట పలువురు బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

 

 ప్రాణాలైనా ఇస్తాం.. భూములు వదులుకోం

 మాకు రెండెకరాల భూమి ఉంది. ఇద్దరం ఆడపిల్లలం, ఒక తమ్ముడు. ఎర్రబస్సు కూడా లేని ఈ ఊరిలో ఎయిర్‌పోర్టు ఎందుకు సార్? వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఇంటిలో బతుకుతున్నాం. ఇప్పుడు ఆ ఇల్లు కూడా లాక్కుంటే మేం ఎలా బతకాలి? మా పెళ్లిళ్లు ఎలా అవుతాయి? మాకు ఎయిర్‌పోర్టు వద్దు. మేం ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములు మాత్రం ఇవ్వం.     

- శిరాపు నర్సాయమ్మ, రెడ్డికంచేరు

 

 మీ విమానం పెద్దల భూముల్లో ఎగరదా?

 మాకు రెండెకరాల భూమి ఉంది. అది లాక్కుంటే కూలీలుగా మారిపోతాం. అయ్యా.. చంద్రబాబు గారూ మీ విమానం పెద్దల భూ ముల్లో ఎగరదా? పేదల భూముల్లోనే ఎగురుతుందా? మా భూములకోసం 30 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నాం. చంద్రబాబు మా భూములు లాక్కొని ముష్టి వేస్తామంటున్నారు. మీ ముష్టి మాకు వద్దు, మా  భూములుంటే చాలు.  

 - కొండపు బుజ్జి, గూడెపువలస

 

 అయ్యన్న, గంటా భూములెందుకు వదిలారు?

 నిజంగా చంద్రబాబుకు అభివృద్ధి చేయాలనుకుంటే... అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్‌రావుల భూములను తీసుకొని మా భూము లు కూడా తీసుకుంటే ఇంతగా బాధపడకపోము. కానీ వాళ్ల భూములను వదిలి మావి లాక్కుంటారా? మాలాంటి పేదల కడుపు కొడతారా? ఇదేనా న్యాయం?   

 - వంశీరెడ్డి, రెడ్డి కంచేరు

 

 అడవుల్లోకి పంపుతున్నారు

 నాకు 80 సెంట్ల భూమి ఉంది. మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాగడానికి నీరు, తినడానికి తిండి, ఉపాధి పనులు ఇచ్చారు. ఇప్పుడొచ్చిన వారు ఎయిర్‌పోర్టులంటారు. ప్రజల భూములను లాక్కొని అన్యాయం చేయాలనుకుంటున్నారు. విమానాశ్రయం పేరుతో మమ్మల్ని అడవుల్లోకి పంపించేస్తున్నారు.  

 - జె.సన్నాసిరావు

 

 శవాల మీద కడతారా?  

 మాకు అర ఎకరం భూమి ఉంది. కూలీ పనులు చేసుకొని బతుకుతున్నాం.  అర ఎకరం భూమి లాక్కొని మమ్మల్ని ఎటో తగలెయ్యాలని చూస్తున్నారు. చంద్రబాబు మా శవాల మీద ఎయిర్‌పోర్టు కట్టాలనుకుంటున్నాడు. అలా కాకుండా ఓ బాంబు వేసి మమ్మల్ని చంపేసి అప్పుడు కట్టమనండి. మా భూముల్లోకి ఎవరు వస్తారో చూస్తాం.    

- బి.నర్సయ్యమ్మ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top