నా కుమారుడిది ఆత్మహత్య కాదు..హత్యే! | Sakshi
Sakshi News home page

నా కుమారుడిది ఆత్మహత్య కాదు..హత్యే!

Published Fri, Dec 2 2016 10:57 PM

నా కుమారుడిది ఆత్మహత్య కాదు..హత్యే! - Sakshi

మార్చురీ వద్ద పల్లె శివారెడ్డి తండ్రి, బంధువుల ఆందోళన
 
గుంటూరు ఈస్ట్‌: తన కుమారుడిది ఆత్మహత్య కాదని... హత్యే అని, ఈ దిశగా పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని ఆటోనగర్‌ సమీపంలో రైలుపట్టాల వద్ద మృతుడై పడి ఉన్న  పల్లె శివారెడ్డి తండ్రి నారాయణరెడ్డి, బంధువులు శుక్రవారం రాత్రి మార్చురీ వద్ద ఆందోళన చేశారు. నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన పల్లె శివారెడ్డి గుంటూరులోని మిర్చి యార్డులో మిరపకాయలు కొని ఏసీలో నిల్వ ఉంచి విక్రయిస్తుంటాడు. ఈ నెల 26వ తేదీన తమ గ్రామానికి చెందిన చలమయ్యకు మిర్చి కమీషన్‌ కొట్లో డబ్బులు ఇప్పించేందుకు అతనితో కలిసి గుంటూరుకు వచ్చాడు. లాలాపేటలోని మున్నంగి రామిరెడ్డికి చెందిన సత్యశ్రీ మిర్చి కమీషన్‌ షాపునకు వెళ్లాడు. అనంతరం కొత్తపేటలో ఓ సినిమా హాలులో మ్యాట్నీ సినిమా చూస్తుండగా ఫోన్‌ రావడంతో చలమయ్యతో ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వచ్చాడు.రాత్రి వరకు ఫోన్‌ కూడా పనిచేయలేదు. చలమయ్య ద్వారా విషయం తెలుసుకున్న బంధువులు 27వ తేదీ ఉదయం తెల్లవారుజామున లాలాçపేటలోని సత్యశ్రీ మిర్చి కమీషన్‌ షాపునకు వెళ్లారు. శివారెడ్డి ఆచూకీ తెలియరాలేదు.అయితే షాపు వెలుపల, మెట్ల మీద రక్తపు మరకలు కనిపించాయి. ఈ విషయమై షాపు యజమాని మున్నంగి రామిరెడ్డిని ప్రశ్నించారు. కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు శివారెడ్డి తప్పిపోయినట్టుగా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం శివారెడ్డి మృతదేహాన్ని కాకాని పోలీస్టేషన్‌ పరిధిలోని ఆటోనగర్‌ సమీపంలో రైలు పట్టాల వద్ద గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే తన కుమారుడిది ఆత్మహత్య కాదని హత్యేనని మిర్చి కమీషన్‌ షాపు వద్ద రక్తపు మరకలు ఉన్న విషయాన్ని ఎస్‌హెచ్‌ఓకు తెలియచేసినా పట్టించుకోలేదని మృతుడి తండ్రి నారాయణరెడ్డి ఆరోపించారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మార్చురీ వద్దకు వచ్చి నారాయణరెడ్డిని, మృతుడి బంధువులను పరామర్శించారు.

Advertisement
Advertisement