
రైతుల కోసం స్నాప్‌డీల్ అగ్రి స్టోర్
ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్‌డాట్‌కామ్ సంస్థ రైతుల కోసం ది ఆగ్రి స్టోర్‌ను..
విత్తనాలు, ఎరువులు, పరికరాలు లభ్యం
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్‌డాట్‌కామ్ సంస్థ రైతుల కోసం ది ఆగ్రి స్టోర్‌ను ప్రారంభించింది. రైతు దినోత్సవం సందర్భంగా ఈ అగ్రి స్టోర్‌ను అందుబాటులోకి తెస్తున్నామని స్నాప్‌డీల్‌డాట్‌కామ్ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరు అయిన కునాల్ బహాల్ మంగళవారం తెలిపారు. ఈ అగ్రి స్టోర్‌లో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు విక్రయిస్తామని వివరించారు.
త్వరలో ఈ స్టోర్ హిందీ వెర్షన్‌ను కూడా ప్రారంభిస్తామని, తగిన సూచనలు, సలహాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ స్టోర్‌ను మొబైల్ ఫోన్ల ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామని వివరించారు. నాణ్యమైన ఉత్పత్తులకు, విశ్వసనీయమైన సేవలకు మారుపేరుగా ది అగ్రి స్టోర్‌ను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.