రికార్డ్‌ల ర్యాలీకి బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ల ర్యాలీకి బ్రేక్‌

Published Sat, Aug 11 2018 1:22 AM

Sensex dives 155 points, Nifty settles at 11429 - Sakshi

స్టాక్‌ సూచీల రికార్డ్‌ల ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌ పడింది. టర్కిష్‌ కరెన్సీ లీరా 12 శాతం మేర క్షీణించడంతో  ప్రపంచ మార్కెట్లు పతనం కావడం... ఇటీవల బాగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం... ఎస్‌బీఐ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం... రూపాయి బలహీనపడటం... ఈ కారణాలన్నిటితో లోహ, ఫార్మా, ఇంధన షేర్లు క్షీణించాయి. ఫలితంగా స్టాక్‌ సూచీలు నష్టపోయాయి.

ఈ ప్రతికూలాంశాలతో ఐదు రోజుల రికార్డ్‌ల ర్యాలీకి బ్రేక్‌ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 155 పాయింట్లు నష్టపోయి 37,869 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 11,430 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, స్టాక్‌ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. స్టాక్‌ మార్కెట్‌ లాభపడడం ఇది వరుసగా మూడో వారం. ఈ వారంలో సెన్సెక్స్‌ 313 పాయింట్లు, నిఫ్టీ 69 పాయింట్లు చొప్పున పెరిగాయి.

ఆల్‌టైమ్‌ కనిష్ఠం.. టర్కీ లీరా!
టర్కీ అధ్యక్షునిగా ఎన్నికైన ఎర్డోగన్‌ ఆర్థిక మంత్రిగా తన అల్లుడైన బెరట్‌ అల్‌బేరాక్‌ను ఇటీవలే నియమించారు. అధిక వడ్డీరేట్లకు విముఖుడైన ఎర్డోగన్‌ కనుసన్నల్లోనే టర్కీ కేంద్ర బ్యాంక్‌ నిర్ణయాలుంటాయనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు అమెరికాకు చెందిన పాస్టర్‌ అండ్రూ బ్రూన్‌సన్‌ను టర్కీ అధికారులు ఉగ్రవాద ఆరోపణలతో అరెస్ట్‌ చేయడంతో అమెరికా, టర్కీల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి.

ఈ నేపథ్యంలో డాలర్‌తో టర్కీ కరెన్సీ లీరా మారకం శుక్రవారం జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోయింది. లీరాఇంట్రాడేలో 14.6 శాతం క్షీణించింది. 2001 తర్వాత లీరా ఈ స్థాయిలో క్షీణించడం ఇదే మొదటిసారి. ఇది ఆసియా మార్కెట్లతో పాటు యూరప్‌ మార్కెట్లపై కూడా తీవ్రమైన ప్రభావమే చూపించింది.

235 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌..
బలహీనంగా ఆరంభమైన సెన్సెక్స్‌ ఆ తర్వాత స్వల్పంగా లాభపడినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత భారీగా నష్టపోయింది. రోజంతా తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనైంది. ఒక దశలో 27 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మరొక దశలో 208 పాయింట్ల వరకూ నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 235 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.

Advertisement
Advertisement