కరోనా కల్లోలం.. ఆర్థిక ఉపశమనం!

Extension Of Tax Returns And GST Returns Says Nirmal Sitarama - Sakshi

పన్ను రిటర్నులు, జీఎస్‌టీ రిటర్నుల గడువు పొడిగింపు

ఏ బ్యాంకు ఏటీఎం అయినా చార్జీ ఉండదు

సేవింగ్స్‌ ఖాతా బ్యాలెన్స్‌ చార్జీల ఎత్తివేత

ఇన్‌సాల్వెన్సీ నిబంధనల సడలింపు...

ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ : కోవిడ్‌–19 వైరస్‌ కారణంగా ప్రజలు, వ్యాపారస్తులు ఇళ్లకే పరిమితమవుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు ఉపశమన చర్యలను ప్రకటించింది. ఆదాయపన్ను రిటర్నులు, జీఎస్‌టీ రిటర్నుల దాఖలు గడువులను పెంచింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో లావాదేవీల చార్జీలు, బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్‌ నిర్వహణ చార్జీలను మూడు నెలల పాటు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ప్రకటించారు.  

►2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసే గడువును జూన్‌ 30 వరకు పొడిగించింది.  
►అలాగే, గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్‌టీ వార్షిక రిటర్నుల దాఖలు గడువు ఈ నెలాఖరు వరకే ఉండగా, ఇది సైతం జూన్‌ 30 వరకు పెరిగింది.  
►మార్చి, ఏప్రిల్, మే నెలల జీఎస్‌టీ రిటర్నులను ఎటువంటి జరిమానాలు లేకుండా జూన్‌ నెలాఖరు వరకు దాఖలు చేసుకోవచ్చు. దీంతో ఆలస్యపు రిటర్నులపై రూ.5 కోట్ల వరకు టర్నోవర్‌ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు పెనాల్టీ, ఆలస్యపు రుసుములు ఉండవు. రూ.5 కోట్ల టర్నోవర్‌ దాటిన వారు సైతం జూన్‌ నెలాఖరు వరకు రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కానీ, గడువు దాటిన తర్వాత కాలానికి 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.  
►ఆధార్, పాన్‌ అనుసంధాన గడువు  జూన్‌ 30 వరకు పెరిగింది. 
►ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో డెబిట్‌కార్డు లావాదేవీలపై ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. ఇది మూడు నెలల పాటు అమల్లో ఉంటుంది. మెట్రోల్లో ఇతర బ్యాంకు ఏటీఎంల్లో లావాదేవీలు మూడు మించితే, నాన్‌ మెట్రోలో ఐదు లావాదేవీల తర్వాత ప్రస్తుతం చార్జీ విధిస్తున్నారు. 
►సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ నిర్వహణలో విఫలమైతే వసూలు చేసే చార్జీలను తాత్కాలికంగా ఎత్తివేసింది.  
►డిజిటల్‌ రూపంలో చేసే వాణిజ్య లావాదేవీల చార్జీలతగ్గింపు. 
►ఆదాయపన్ను వివాదాల పరిష్కారానికి తీసుకొచ్చిన వివాద్‌సే విశ్వాస్‌ పథకం గడువు జూన్‌ 30 వరకు పొడిగింపు. దీనివల్ల జూన్‌ నాటికి చేసే చెల్లింపులపై అదనంగా 10 శాతం చార్జీ ఉండదు.  
►పొదుపు సాధనాల్లో పెట్టుబడులు లేదా మూలధన లాభాల పన్ను ఆదా కోసం చేసే పెట్టుబడుల గడువు, నోటీసుల జారీ గడువును కూడా మూడు నెలలు పొడిగించారు.  
►ముందస్తు పన్ను చెల్లింపులు, స్వీయ పన్ను మదింపు, రెగ్యులర్‌ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, ఎస్‌టీటీ ఆలస్యపు చెల్లింపులపై వడ్డీ రేటు 12/18 శాతానికి బదులు 9 శాతం వసూలు చేస్తారు.  
►కంపెనీల డైరెక్టర్ల బోర్డులు చట్ట ప్రకారం 120 రోజులకోసారి సమావేశం కావాల్సి ఉండగా, ఈ గడువును  కూడా మరో 60 రోజులు పొడిగించారు.

దివాలా చర్యల సడలింపు 
ప్రస్తుతం రూ.లక్ష మేర రుణ చెల్లింపుల్లో విఫలమైతే దివాలా చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చేది. దీన్ని రూ.కోటికి పెంచినట్టు మంత్రి సీతారామన్‌ తెలిపారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్‌ఎంఈ) పెద్ద ఎత్తున దివాలా చర్యలు ఆగిపోతాయని మంత్రి చెప్పారు. ‘‘ప్రస్తుత పరిస్థితే ఏప్రిల్‌ 30 తర్వాత కూడా కొనసాగితే ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) 2016 చట్టంలోని సెక్షన్‌ 7, 9, 10లను ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేయడాన్ని పరిశీలిస్తాము. దీనివల్ల కంపెనీలు పెద్ద సంఖ్యలో దివాలా చర్యల బారిన పడకుండా నిరోధించినట్టు అవుతుంది’’ అని మంత్రి తెలిపారు.

అతి త్వరలో ప్యాకేజీ 
ఆర్థిక ఉపశమన ప్యాకేజీ ముగింపు దశలో ఉందని, దీన్ని అతి త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి సీతారామన్‌ తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రతీ దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. ప్రధానమంత్రి సైతం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని ప్రకటించిన కోవిడ్‌–19 ఎకనమిక్‌ టాస్క్‌ఫోర్స్‌ కూడా పని ప్రారంభించింది. టాస్క్‌ఫోర్స్‌ పని ఎన్నో అంచనాలతో కూడుకుని ఉంటుంది. దాదాపుగా ఇది ముగింపు దశలో ఉంది’’ అని మంత్రి వివరించారు.

స్టాక్‌ మార్కెట్లను గమనిస్తున్నాం
ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ, సెబీ తదితర అన్ని ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు కలసి కట్టుగా పనిచేస్తూ.. కోవిడ్‌–19 కారణంగా స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న అస్థిర పరిస్థితులను, పరిణామాలను గమనిస్తున్నట్టు మంత్రి సీతారామన్‌ తెలిపారు. రోజులో మూడు పర్యాయాలు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే సెబీ కొన్ని చర్యలను ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కోవిడ్‌–19 మన దేశంలోకి ప్రవేశించిన నెల రోజుల్లోనే సెన్సెక్స్‌ 15 వేల పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 4 వేల పాయింట్లకు పైగా పడిపోయిన విషయం తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top