ఫలితమివ్వని ‘సంపూర్ణ పారిశుద్ధ్యం’


సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా జనాభాలో ముప్పావు వంతు జనం మరుగుదొడ్లను ఉపయోగించడం లేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పథకం కూడా ఆచరణలో ముందుకు సాగడం లేదు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో నిర్మల్ భారత్ అభియాన్ చేపట్టిన ‘బేస్‌లైన్’ సర్వే ఫలితాలు మరుగుదొడ్ల వినియోగం తీరుకు అద్దం పడుతున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా లో 4.75 లక్షల గృహాలు ఉన్నాయి.

 

 వీటిలో 4.38 లక్షలు అంటే 92.27 శాతం గృహాలను బేస్‌లైన్ సర్వే బృం దాలు సందర్శించాయి. 1.45 లక్షల గృహాలు అంటే 33.21 శాతం కుటుంబాలు మాత్రమే మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నాయి. 6.79 శాతం గృహాలకు మరుగుదొడ్డి సౌకర్యం అందుబాటులో లేదు. మరుగుదొడ్లు వున్నచోట కూడా శిథిలావస్థకు చేరుకోవడమో, కమ్యూనిటీ టాయిలెట్లతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు తేలిం ది. మరోవైపు సంపూర్ణ పారిశుద్ధ్య సాధన దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పూర్తి ఫలితాన్ని ఇవ్వడంలేదు. నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద 2013-14లో రూ.49.71 కోట్లతో  54,628 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆరు నెలలు గడుస్తున్నా రూ.2.80 కోట్లు ఖర్చు చేసి 3,363 వ్యక్తిగత మరుగుదొడ్లు మాత్రమే నిర్మించారు. మరో 8 వేలకు పైగా నిర్మాణాలు పురోగతిలో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.

 

 ‘నిర్మల్’ గ్రామాల్లోనూ సమస్య

సంపూర్ణ పారిశుద్ధ్య ప్రచారోద్యమంలో భాగంగా 2005 నుంచి 2011 మధ్యకాలంలో జిల్లాలో 99 గ్రామ పంచాయతీలకు ‘నిర్మల్ పురస్కార్’ లభించింది. నిర్మల్ పురస్కార్ అందుకున్న గ్రామాల్లోనూ మరుగుదొడ్ల వినియోగం తీరు అధ్వానంగా వున్నట్లు సర్వేలో వెల్లడైంది. నిర్మల్ భారత్ అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అయితే పథకం పురోగతిపై సమీక్ష లేకపోవడంతో నిధులున్నా నిర్మాణం ముందుకు సాగడం లేదు. మరోవైపు అంగన్‌వాడీలు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపైనా అధ్యయనం జరుగుతోంది. మరో పక్షం రోజుల్లో గ్రామాల వారీగా పారిశుద్ధ్య నిర్వహణ, మరుగుదొడ్ల వినియోగం వంటి అంశాలపై పూర్తి సమాచారం క్రోడీకరించే దిశ గా బేస్‌లైన్ సర్వే సాగుతోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top