వెలివేతలో..ఎన్ని వ్యథలో 

Transgender Life Culture In Kurnool District - Sakshi

దయనీయం.. హిజ్రాల జీవనం 

వెలివేస్తున్న సమాజం, భిక్షాటనే ప్రధాన వృత్తి 

పని, ఉద్యోగం దొరకదు, అద్దె ఇల్లు కూడా ఇవ్వరు 

మా దేహాల్లో సూర్యోదయాలు వెతుక్కునే మీరు.. మాకు చీకటి ప్రపంచాన్ని మిగిల్చారు.. మేం మనుషులమే కాదన్నట్లు తప్పించుకు తిరుగుతున్నారు.. మమ్మల్ని వెలివేస్తూ మీరు నిత్యం మలిన పడుతున్నారు.. మా హృదయాలు గాయపడినా మీకు అక్కరలేదు.. మా కన్నీళ్లు మిమ్మల్ని కదిలించవు..  మగతనాన్ని వదిలేసిన మేం ఏనాడూ సిగ్గు పడలేదు.. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నాం.. మానవత్వాన్ని బతికించండీ అంటూ చప్పట్లు కొట్టి కోరుతున్నాం.. ఆకు రాలిన చెట్టు వసంతం కోసం ఎదురు చూసినట్లు.. స్నేహ హస్తం కోసం ఎదురు చూస్తున్నాం.. మేం ఎదురైతే.. పండు వెన్నెల్లా పలకరించండి! 
..ఓ హిజ్రా ఆవేదన ఇదీ 

ఎందుకిలా పుట్టారో వారికి తెలియదు.. ఎలా బతకాలనేది అర్థం కాదు. కానీ జీవితంపై ఎంతో ప్రేమ. చీదరించుకుంటున్నా.. చికాకు పడుతున్నా.. బాధను గుండెల్లో ఉంచుకుని.. తమకు తామే అనుభవాలు పంచుకుంటూ సాగే జీవితం వారిది. వారిపై సమాజం ఆంక్షలు విధిస్తుంది. బయట కనిపించగానే ముఖం చాటేస్తుంది. చీకట్లో బతికే వీరు తమకు వెలుగులు లేకపోయినా ఫర్వాలేదు.. కనీసం మనుషులుగా గుర్తిస్తే చాలంటూ మొరపెట్టుకుంటున్నారు. 

సాక్షి, కర్నూలు : మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కొంతమంది మగవాళ్లు ‘ఆడ పనులు’ చేస్తూ అందరి హేళనకు గురి అవుతుంటారు. వీరిలో కొంతమంది పెళ్లి వయసుకు ముందో, పెళ్లి కుదరంగానో ఇళ్ల నుంచి అదృశ్యమవుతారు. ఇంకొంత మంది పెళ్లికి ముందే ఆత్మహత్యలు చేసుకొంటారు. బస్సుల్లో, రైళ్లలో చప్పట్లు కొట్టుకొంటూ అడుక్కునే వారిగా మరికొంత మంది కనిపిస్తారు. ఇలాంటి దయనీయ జీవితం వారు కోరుకున్నది కాదు. క్రోమోజోముల నిష్పత్తిలో తేడాతో జరిగిందే. సాధారణంగా ఎక్స్, వై క్రోమోజోములు కలిస్తే అబ్బాయి, ఎక్స్‌ ఎక్స్‌ క్రోమోజోములు కలిస్తే అమ్మాయి పుడతారు. ఈ క్రోమోజోములు ఇతర నిష్పత్తిలో కలిస్తే రకరకాల శారీరక, మానసిక పరిస్థితులు ఏర్పడతాయి. అలా పుట్టిన వాళ్లు ఆడా మగా నమూనాల్లో ఇమడలేక  అటు ఇటు కాని లోకంతో నిత్యం యుద్ధం చేస్తున్నారు. సమాజం వారిని ఒక విధంగా దూరంగా ఉంచింది. దగ్గరకు కూడా రానీయని గీత గీసింది. వారు దగ్గరకు వస్తే ఆమడ దూరం వెళ్లడం.. పిలిస్తే పలకకపోవడం.. పలికినా ఏదో వెకిలితనం, హేళన సమాజంలో చాలా మంది చేసే పనే. వారు చదువుకోవాలన్నా స్కూల్‌లో, కళాశాలలో సీటు ఇవ్వరు. వారికి పని చేయాలన్నా దొరకదు. ఉద్యోగమూ ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాదు. దీంతో వారు సమాజంలో ప్రత్యేకంగా బతుకుతున్నారు. మా బతుకు మాది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టి మరీ చెబుతున్నారు.  

జిల్లాలో 3వేలకు పైగా హిజ్రాలు ఉన్నారు. జన్మతః జన్యులోపాల కారణంగా హిజ్రాలుగా జీవిస్తున్న వారే అధిక శాతం ఉన్నారు. వీరిని సమాజానికి భయపడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులూ వెలివేస్తున్నారు. తమ బాధ ఎవ్వరికి చెప్పుకోవాలో, ఎవరిని కలవాలో, ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాదు. ఎవ్వరూ వారిని దగ్గరకు రానీయరు. వీరికి ఆధార్‌కార్డు మినహా ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండవు. 90 శాతం మందికి ప్రభుత్వం ఇచ్చే పింఛనూ రావడం లేదు. అధికారుల చుట్టూ తిరిగినా రేషన్‌కార్డు ఇవ్వరు. హెల్త్‌కార్డు ఉండదు. రోగమొస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులూ చిన్నచూపు చూస్తారు. కనీసం తాకి కూడా పరిశీలించరు. తమకు వచ్చిన బాధలను, ఇబ్బందులను ఎవ్వరికైనా చెప్పుకోవాలన్నా వినేవారు ఉండరు. ఇంటి స్థలం రాదు. చివరకు వారు నివసించేందుకు ఎవ్వరూ ఇంటిని అద్దెకు ఇవ్వడం లేదు. కర్నూలులోని జాతీయ రహదారి పక్కన ఉండే ఐటీసీ ఎదురుగా ఉండే స్థానిక కృష్ణానగర్‌లో ఓ చిన్న ఇంట్లో 30 మంది దాకా హిజ్రాలు నివసిస్తున్నారు. సాధారణంగా అలాంటి ఇంట్లో కేవలం నలుగురు మాత్రమే నివసిస్తారు. కానీ ఎవ్వరికీ ఇల్లు అద్దెకు లభించకపోవడంతో అందరూ అక్కడే తలదాచుకుంటున్నారు. అందులోని 30 మంది ఒకరికి ఒకరై జీవిస్తున్నారు. ఒకరికి ఒకరి కుటుంబసభ్యుల్లా బతుకున్నారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కలిసి పంచుకుంటారు.

భిక్షాటనతోనే జీవనం 
హిజ్రాలకు పని ఇవ్వరు. ఉద్యోగం చేస్తామన్నా ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో వారు భిక్షాటనే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు భిక్షాటన చేయడం, వచ్చిన డబ్బులో కొంత భవిష్యత్‌ అవసరాలకు దాచుకోవడం, మరికొంత జీవనానికి ఖర్చు చేయడం చేస్తుంటారు. పట్టణాల్లోని దుకాణాలు, వ్యాపార సముదాయాలకు వెళ్లడం గట్టిగా చప్పట్లు కొట్టి భిక్షాటన చేయడం వీరి నైజం. వివాహ సమయంలో కొందరు వీరిని పిలిచి దిష్టి తీయించుకుని, దానికి ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని చేతిలో పెడతారు. తమకు ప్రభుత్వం కనీసం పారిశుధ్య పనులకైనా వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు. ఈ సమాజంలో తమనూ గుర్తించాలని వేడుకుంటున్నారు.  

అమ్మాయిగా కనిపించాలని అనిపించేది 
నా పేరు అనుశ్రీ. మాది కర్నూలు. అమ్మా నాన్న ఉన్నారు. మేము ఐదుగురు సంతానం. నేను నాల్గో దాన్ని. నాలో చిన్నతనం నుంచి ఆడలక్షణాలు ఉన్నాయి. అమ్మాయిగా కనిపించాలని, అమ్మాయిలతో ఎక్కువసేపు గడపాలని ఉబలాటపడేదాన్ని. బయటికి వెళితే సమాజం వేలెత్తి చూపించేది. సమాజంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నాను. అమ్మా నాన్న వద్ద ఉంటూ ఇంటర్‌ వరకు చదువుకున్నాను. దీంతో 12ఏళ్ల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత  అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా బీకాం డిగ్రీలో చేరాను. అక్కడ కూడా నాకు అవమానాలే ఎదురయ్యాయి. ప్రతి ఒక్కరూ నన్ను చూసి అవహేళన చేసేవారు. ఒక విధంగా ఈ సమాజం నన్ను వెలివేసింది. ఎక్కడైనా పనిచేసుకుని బతకాలన్నా పని, ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం చేయాలంటే మగవాడిగా రావాలంటున్నారు. వేషం వేసినా ఆడలక్షణాలు ఎక్కడికీ పోవు కదా! దీంతో 11 ఏళ్ల క్రితం ముంబయి వెళ్లి లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నాను.  
–అనుశ్రీ, కర్నూలు 

కూరగాయలు అమ్మినా కొనేవారు కాదు 
నా పేరు శ్వేత, కర్నూలు నగరంలోని శ్రీరామనగర్‌లో ఉండేవాళ్లం. చిన్నతనం నుంచి నాకు ఆడవారితో తిరగాలని అనిపించేది. వారితో ఉండాలని, వారితో నా భావాలు పంచుకోవాలని అనుకునేదాన్ని. నా ప్రవర్తనను ఇంట్లో వారు వ్యతిరేకించి బయటకు పంపించారు. 2014లో ఒకసారి అపెండిసైటిస్‌(కడుపునొప్పి) వస్తే చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరాను. ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్‌ అయితే చేశారు గానీ ఆ తర్వాత తాకి కూడా చూడలేదు. దూరం మాట్లాడి మందులు రాసిచ్చి వెళ్లిపోయేవారు. ఈ వివక్షతను చూసి కొంత కాలం మళ్లీ ప్యాంట్, షర్ట్‌ వేసుకుని తిరిగాను. రైతుబజార్‌లో కూరగాయలు విక్రయించేదాన్ని. కానీ నా వద్ద ఎవ్వరూ కొనేవారు కాదు. పక్కనున్న వ్యాపారస్తులు సైతం నన్ను వ్యాపారం చేసుకోనిచ్చేవారు కాదు. నువ్వు మా పక్కన ఉంటే మా వద్ద కూడా కూరగాయలు ఎవ్వరూ కొనరని తిట్టిపోసేవారు. దీంతో కూరగాయల విక్రయం మానేసి మట్టిపనికి, కూలీపనికి వెళ్లాను. అక్కడ కూడా నాకు అవమానాలే ఎదురయ్యాయి. నన్ను  హేళన చేసేవారు. దీంతో 2006లో హిజ్రాలతో కలిసిపోయాను. ఆ తర్వాత ముంబయి వెళ్లిపోయి లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నాను. 
–శ్వేత, శ్రీరామనగర్, కర్నూలు 

హేళన చేయడంతో చదువు ఆపేశాను
నా పేరు పావని. మా స్వస్థలం నందికొట్కూరు. మాది వ్యవసాయ కుటుంబం. నాకు ఒక అన్న ఉన్నాడు. చిన్నతనం నుంచి నాకు ఆడలక్షణాలు ఉండేవి. ఇంట్లో ఆడపిల్లలు చేసే పనులన్నీ నేనే చేసేదాన్ని. అంట్లు తోమడం, ముగ్గులు వేయడం, బట్టలు ఉతకడం, వంట చేయడం వంటి పనులన్నీ నేనే చేసేదాన్ని. స్కూల్‌కు వెళ్లినా హేళన చేసేవారు. దీంతో ఏడో తరగతితోనే చదువు ఆపేశాను. ఇంట్లో వాళ్లు నా ప్రవర్తనను వ్యతిరేకించడం, తిట్టడంతో నేను 12 ఏళ్ల క్రితం నేను ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత హిజ్రాలతో కలిసి జీవిస్తూ వచ్చాను. 2014లోనే విజయవాడలో లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నాను.
 –పావని, కర్నూలు 

మా లాంటి బతుకు ఎవ్వరికీ రాకూడదు 
నా పేరు మౌనిక. మా స్వస్థలం రాజమండ్రి. ప్రస్తుతం కర్నూలు. అమ్మా నాన్న ఉన్నారు. మేం  నలుగురు సంతానం. ఒక అన్న, ఇద్దరు అక్కలు, నేను చివరి దాన్ని(వాన్ని). జీన్స్‌ ప్రాబ్లమ్‌ వల్ల నాలో చిన్నతనం నుంచి ఆడలక్షణాలు ఉన్నాయి. 12 ఏళ్ల తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువైంది. ఇంట్లో వారు అలా ఉండకూడదని పలుమార్లు చెప్పారు. పలు మార్లు కొట్టారు, తిట్టారు కూడా. కానీ జన్మత వచ్చిన మార్పును వారు మార్చలేరు కదా. దీంతో ఇంట్లో నుంచి నన్ను తరిమేశారు. బయటకు వచ్చిన నాకు బయట ఎక్కడా నీడ దొరకలేదు. ఒకసారి అనారోగ్యం చేస్తే పెద్దాసుపత్రిలో చేరాను. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు డాక్టర్లు నన్ను కనీసం తాకి చూడలేదు. సమాజం వెలివేయడంతో 2009లో ఢిల్లీ వెళ్లి లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నాను. అనంతరం హిజ్రాలతో కలిసి జీవిస్తున్నాను. ప్రతిరోజూ భిక్షాటన చేయడం, ఎవ్వరైనా పెళ్లిళ్ల సమయంలో పిలిస్తే దిష్టి తీసే కార్యక్రమానికి వెళ్లి పొట్టపోసుకుంటున్నాను. నాలాంటి జీవితం శత్రువులకు కూడా రాకూడదని ఆ భగవంతున్ని వేడుకుంటున్నాను. ఒంటరితనం, మా బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ ఉండటం లేదు. మాలో మేమే కుమిలిపోవాల్సి వస్తోంది. వయస్సు మీద పడితే మా బతుకు మరింత దయనీయంగా మారుతుంది. మావైపు చూసే వారు ఎవ్వరూ ఉండరు. గుడిమెట్లపై కూర్చుని అడుక్కోవాల్సి ఉంటుంది.         
–మౌనిక, కర్నూలు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top