తిండి లేదు.. గుక్కెడు నీళ్లూ లేవు

శ్రీనగర్‌లో చెక్కబల్లలనే పడవలుగా మార్చి వరద బాధితుల్ని తరలిస్తున్న దృశ్యం


* శ్రీనగర్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారి గోడు

 

ఎల్లారెడ్డిపేట/నర్మెట/భువనగిరి: ‘తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాం... తాగడానికి నీళ్లు లేక తల్లడిల్లుతున్నాం’ అంటూ జమ్మూకాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారు తమ ఇళ్లకు ఫోన్లు చేసి గోడు వెళ్లబోసుకుంటున్నారు. రాష్ర్టంలోని వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు శ్రీనగర్‌లో ఏఐఈఈఈ, ఎన్‌ఐటీలలో చదువుతున్నారు. వీరిలో ఎక్కువమంది వరదల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వీరు నాలుగురోజులుగా తిండితిప్పలు లేకుండా పస్తులున్నట్టు తమ కుటుంబసభ్యులకు అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన  వంశీకృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మిత్రులతో కలసి జమ్మూకాశ్మీర్ విహారయాత్రకు వెళ్లిన అతడు అక్కడ వరదల్లో చిక్కుకుపోయాడు. అతడితోపాటు, మరో 50 మం ది తెలుగువారిని ఆర్మీ శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌కు తరలిం చింది. అయితే తామంతా రెండు రోజులుగా అక్కడే ఉంటున్నా అధికారులు ఎలాంటి భోజన వసతులు ఏర్పాటు చేయలేదని వంశీకృష్ణ తన తల్లికి బుధవారం ఫోన్ చేసి గోడువెళ్లబోసుకున్నాడు.కనీసం తాగడానికి మంచినీరు కూడా ఇవ్వడం లేదని తెలిపాడు. కాశ్మీరుకు చెందిన వారిని అక్కడి అధికారులు వెంటవెంటనే హెలికాప్టర్లలో వారి స్వస్థలాలకు పంపిస్తుండగా తెలుగువారిని మాత్రం పట్టిం చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి చేర్చాలని వంశీకృష్ణ తల్లిదండ్రులు వనజ-రామారావు కోరుతున్నారు.

 

నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో...

వరంగల్ జిల్లా నర్మెటకు చెందిన ప్రజ్ఞాపురం రజితకుమారి, అంజయ్య కుమారుడు మారుతి శ్రీనగర్‌లోని హజరత్‌బాల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్నాడు. లడక్‌లోని హాస్టల్‌లోని మూడో అంతస్తులోని ఓ రూమంలో లగేజీని భద్రపరిచి... మిత్రులతో కలసి అతికష్టం మీద లఢక్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మారుతి మిత్రుడి ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.‘హైదరాబాద్ రావడానికి విమానం ఖర్చులు రు.18 వేలు అవుతాయని, వెంటనే టికెట్‌కు కావాల్సిన డబ్బులు పంపించాల్సిందిగా చెబితే అకౌంట్‌లో వేశామని తల్లిదండ్రులు చెప్పారు. అరుుతే, అక్కడ సహాయక చర్యలు అందడం లేదని విద్యార్థులు చెబుతున్నారని, రాజమండ్రికి చెందిన అతని స్నేహితుడు హరితో మాట్లాడేందుకు యత్నిస్తే ఫోన్ కలవడం లేదని, తమ కుమారుడు భోజనం చేయక నాలుగు రోజులు గడుస్తుందని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇదిలాఉండగా, ఎన్‌ఐటీలో చదువుతున్న తెలుగువిద్యార్థులు 52 మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారని తెలుస్తోంది.

 

అకౌంట్‌లో పదివేలు వేయండి..

భువనగిరి: ‘జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో విపరీతంగా వానలు పడుతున్నాయి. నేను ఉంటున్న క్యాంపస్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. మమ్మల్ని వేరే చోటు మారుస్తారంటా.. నా అకౌంట్‌లో పదివేలు జమ చేయి అంటూ’  నల్లగొండ జిల్లా భువనగిరి మండలం అనాజీపురానికి చెందిన మధుసూదన్ తన అక్క శ్రీవాణికి మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫోన్ చేశాడు.మధుసూదన్ శ్రీనగర్‌లోని నిట్ బ్రాంచ్‌లో ఏఐ ఈఈఈ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో శ్రీనగర్‌లోని నిట్ క్యాంపస్ కూడా వరదమయమైంది. దీంతో మధుసూదన్ ఇంటికి ఫోన్ చేసి తాను ఇంటికి చేరడానికి డబ్బులు అకౌంట్‌లో వేయాల్సిందిగా కోరాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top