ఇక తాడో పేడో..!

ఇక తాడో పేడో..! - Sakshi


పరాకాష్టకు చేరిన అయ్యన్న-గంటా విభేదాలు

కొణతాల, గండి చేరికకు చంద్రబాబు ఓకే

పట్టుబట్టి సాధించిన మంత్రి అయ్యన్న

తాజా పరిణామాలతో రగిలిపోతున్న గంటా వర్గం

భగ్గుమంటున్న బండారు, పీలా

అనూహ్య పరిణామాల దిశగా జిల్లా టీడీపీ రాజకీయాలు


 

 

విశాఖపట్నం  జిల్లా టీడీపీ విభేదాల కథ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. మంత్రి గంటా వర్గం అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీల చేరికకు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. సంక్రాంతి తరువాత ముహూర్తమని మంత్రి అయ్యన్న ప్రకటించేశారు. దీనిపై కనీస సమాచారం కూడా ఇవ్వకుండా గంటా వర్గానికి సీఎం చంద్రబాబు తేరుకోలేని దెబ్బకొట్టారు. తాజా పరిణామాలపై గంటా వర్గం రగిలిపోతోంది. భగ్గుమన్న ఎమ్మెల్యే బండారు ఫోన్ స్విచ్ఛాప్ చేసేసి భవిష్యత్ నిర్ణయంపై సంకేతాలు ఇచ్చారు. సందిగ్ధంలో పడిన ఎమ్మెల్యే పీలా తీవ్ర నిర్ణయం దిశగా సమాచాలోచనలు జరుపుతున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి గంటావర్గం సమాయత్తమవుతోంది.

 

గంటాకు అయ్యన్న షాక్

 జిల్లా టీడీపీపై ఆధిపత్య పోరులో మంత్రి అయ్యన్నపాత్రుడు పైచేయి సాధించారు. టీడీపీలో కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీల చేరికకు మార్గం సుగమం చేశారు. వారిద్దరు మంగళవారం చంద్రబాబుతో భేటీ కావడంతో గంటా వర్గం షాక్‌కు గురైంది. అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్‌లోనే ఉన్న గంటాతోపాటు పెందుర్తి, అనకాపల్లి, గాజువాక, చోడవరం, యలమంచిలి ఎమ్మెల్యేలకు దీనిపై కనీస సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. సంక్రాంతి తరువాత కొణతాల, గండి బాబ్జీలు టీడీపీలో చేరుతారని చంద్రబాబుతో భేటీ అనంతరం మంత్రి అయ్యన్న ప్రకటించేశారు. గంటా వర్గాన్ని దెబ్బతీసేందుకే కొణతాల, గండి బాబ్జీలను అయ్యన్న  పట్టుబట్టి టీడీపీలోకి తీసుకువస్తున్నారన్నది స్పష్టమైంది. వారిద్దరూ టీడీపీలో చేరతారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయ్యన్న ఏకంగా పెందుర్తిలో గండి బాబ్జీతో కలసి పర్యటించారు. ఈ ప్రయత్నాలను గంటా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలకు వేర్వేరు బ్యాలెట్లతో పోలింగ్ నిర్వహిస్తారని స్పష్టం కావడంతో కొణతాల, గండి బాబ్జీల చేరిక ప్రతిపాదన అప్పట్లో నిలిచిపోయింది. అయ్యన్న మాత్రం తన ప్రయత్నాలను చాపకింద నీరులా కొనసాగించి అనుకున్నది సాధించారు.  గంటా వర్గం గరం గరం

కొణతాల, గండి బాబ్జీల చేరికకు చంద్రబాబు పచ్చజెండా ఊపడాన్ని గంటా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. మంత్రి గంటా తన వర్గీయులతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా  సమావేశమై కార్యాచరణపై చర్చించారు. ఢిల్లీలో ఉన్న ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా మాట్లాడారు.  కొణతాల, గండి బాబ్జీల చేరికను అడ్డుకోవడానికి ఎంతవరకైనా వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఈ పరిణామాలపై రగిలిపోతున్నారు.  విషయం తెలిసిన వెంటనే అసెంబ్లీ సమావేశాల నుంచి ఆయన అర్ధాంతరంగా నిష్ర్కమించారు. నియోజకవర్గంలోని ఒకరిద్దరు ముఖ్య నేతలతో ఫోన్‌లో మాట్లడిన అనంతరం ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయారు.  ఆయన తీవ్రమైన నిర్ణయం తీసుకోవచ్చని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బాబ్జీ చేరికను వ్యతిరేకిస్తూ విమర్శలు గుప్పించడం ద్వారా పెందుర్తి టీడీపీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై సంకేతాలు ఇచ్చారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కూడా కొణతాల చేరికకు సమ్మతించేది లేదని తేల్చి చెప్పారు.సమష్టిగా నిర్ణయం తీసుకుందామా... లేక తమ దారి తాము చూసుకోవాలా అని ఎమ్మెల్యేలు బండారు, పీలా మంత్రి గంటాను నిలదీసినట్లు సమాచారం. తమ అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేసి ఫలితం లేకపోతే భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దామని గంటా వర్గం భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ విభేదాలు తాడోపేడో తేలిపోనుండటం ఖాయమని స్పష్టమవుతోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top