గాయపరుస్తున్న పాపాత్ములు

Special Story About Sexual Harrasment Towards Womens  - Sakshi

పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్లు.. కోపిష్టి కళ్లు. పాపిష్టి కళ్లల్లో పచ్చ కామెర్లు.. కోపిష్టి కళ్లల్లో కొరివి మంటలు.. అని ప్రముఖ కవి దేవులపల్లి వారు రాశారు. కవి కాంక్షించినట్టు.. పసికూనలపై కన్నెత్తి చూసే తోడేళ్లకు అలాంటి శిక్ష పడితే ఎంత బావుండును.. ముద్దులొలికే బంగారు తల్లుల నుంచి ముసలమ్మల వరకు ఆడది కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అత్యాచారాలతో మహిళలు వణికిపోతున్నారు. కిరాతకులకు కఠిన శిక్షణ పడాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు.

సాక్షి, విజయనగరం : ఇటీవలి కాలంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కలవరపరుస్తున్నాయి. అసలు వీళ్లు మనుషులేనా.. మానవత్వం లేదా.. అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇలాంటి కిరాతకుల్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఊపందుకుంటోంది.మరోవైపు స్మార్ట్‌ఫోన్‌కు బానిసైన యువత అశ్లీల చిత్రాలను చూస్తూ.. కన్నుమిన్నూ కానకుండా కామాంధులుగా తయారవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

  • వరంగల్‌ జిల్లాలో తొమ్మిది నెలల పసికందుపై హత్యాచారం మరువకముందే.. విజయనగరం జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
  • గతంలో సీతానగరం మండలం గాదెల వలస పాఠశాల పదోతరగతి విద్యార్థినిపై లైంగిక దాడి జరగడంతో కన్ను మూయడం తెలిసిందే. 
  • ఇటీవల గుర్ల మండలం దేవుణి కణపాక గ్రామానికి చెందిన ఓ యువతిపై పశువుల కాపరులు లైంగిక దాడి చేశారు. ఆ చిత్రాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి పైశాచికత్వాన్ని చాటుకున్నారు.
  • తాజాగా బొబ్బిలిలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ ఆకతాయి లైంగిక దాడికి పాల్పడటంతో తల్లిదండ్రులు తమ బిడ్డల సంరక్షణపై భయాందోళనలు చెందుతున్నారు.

సోషల్‌ మీడియా వెర్రి తలలు 
సోషల్‌ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయందోళన ప్రస్తుతం ఎక్కువైపోయింది. ముక్కూ మొహం తెలియని వారితో ఫేస్‌ బుక్‌ పరిచయాలు కుటుంబాలను చిధ్రం చేస్తున్నాయి. అన్నీ తెలిసినప్పటికీ, బానిసల్లా తయారవుతున్నారు. దీని ప్రభావం చాలా చోట్లా ఉంది. ఉదయం లేచిన వెంటనే దేవుని ముఖం చూడటం మానేసి.. సెల్‌ చూడటమనేది ఫ్యాషన్‌గా మారిపోయింది. రాత్రి పెట్టిన పోస్టులకు ఎన్ని లైక్‌లొచ్చాయన్నదే ముఖ్యం. ఇక ఆడపిల్లలు కూడా ఎక్కడ పడతే అక్కడ సెల్ఫీలు, ఎఫ్‌బీల్లో పోస్టింగ్‌లకే ప్రాధాన్యమిస్తున్నారు. అసలు ఎవరితో చాటింగ్‌ చేస్తున్నామనే అంశాలను మరిచిపోతున్నారు. చివరికి పూర్తిగా మోసపోయాక.. ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

చాపకింద నీరులా విష సంస్కృతి
మహిళలపై అకృత్యాల విష సంస్కృతి చాపకింద నీరులా పారుతోంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోవడం, లేకుంటే వారికి కావలసినంత స్వేచ్ఛ ఇవ్వడం చేస్తున్నారు. దీనివల్ల ఏది తప్పో, ఏది ఒప్పో తెలియని యుక్త వయసులో పలు రకాల తప్పిదాలకు అవకాశమిస్తున్నారు. వారి జీవితాలు అగమ్యగోచరం అయ్యేందుకు కారకులవుతున్నారు.

ప్రధానంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడం,  ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం, పిల్లలు పెద్దవాళ్లయ్యారులే అన్న ఆలోచనతో వారేం చేస్తున్నారో పట్టించుకోకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్నెట్‌ చవగ్గా లభిస్తున్న రోజులు కావడంతో యువత తప్పుటడుగులు వేస్తోంది. మొబైల్‌లో నీలిచిత్రాలు చూడటం పెరిగింది. దీంతో విచక్షణ.. వావి వరుసలు కోల్పోయి అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని  పసికందులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.   

తల్లిదండ్రులదే బాధ్యత
ఒకప్పుడు ఆడపిల్లకు యుక్తవయసు వస్తే కాస్త భయపడేవారు. జాగ్రత్తగా ఉండాలని బుద్దులు చెప్పేవారు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఆడపిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కేవలం తల్లిదండ్రులదే. బయటి వ్యక్తులే కాదు ఇంట్లోని కుటుంబ సభ్యులను కూడా నమ్మలేని దౌర్భాగ్యం చోటు చేసుకుంటోంది. ఎవరినీ నమ్మకుండా తల్లిదండ్రులే పిల్లల్ని తమ కనుసన్నల్లో ఉంచి కాపాడుకోవాలన్న విషయాన్ని ఇటీవల జరిగిన సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి.

ఇదొక మానసిక వ్యాధి
ఫీడోఫీలియా.. ఇదో మానసిక వ్యాధి. చిన్నపిల్లలతో సెక్స్‌ చేయాలనిపించడం దీని అర్థం. ఇలాంటి రోగులు పసిపిల్లలపై అకృత్యాలకు పాల్పడుతుంటారు. వ్యక్తుల వ్యక్తిత్వంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు, సమాజంలోని వికృత పోకడలకు ఆకర్షణ కావడం, వ్యక్తుల్లో విలువలు సన్నగిల్లిపోవడం జరుగుతున్నాయి. శరీరంలో అంతస్రావీ గ్రంధుల ప్రభావంతో వ్యక్తుల్లో టెస్టోస్టీరాన్‌ స్థాయిలు పెరిగిపోతాయి. ఆ సమయంలో ఎవరు కనిపిస్తే వారిపై ఆకృత్యాలకు పాల్పడతారు.

వీటిని నిరోధించేందుకు సమాజంలో విలువలు నింపాలి. తల్లిదండ్రులు ఎవరినీ నమ్మి తమ పిల్లలను వదలకూడదు. ఎక్కువమంది ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారిలో కుటుంబ సంబంధీకులే ఉన్నారు. వారిలో మేనమామలు, చిన్నాన్నలు, మధ్య వయసున్న వారు, వృద్ధులు, తాగుబోతులు ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఏకాంతంగా వదిలేయడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. మానసిక కారణాలు కూడా చాలా ఉన్నాయి. 
– డాక్టర్‌ ఎన్‌వీఎస్‌ సూర్యనారాయణ, మానసిక నిపుణుడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top