‘రాజధాని’ పేరుతో భారీ కుంభకోణం

విజయవాడలో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు - Sakshi


భూ మార్పిడిలో రైతులకంటే రాజకీయ, కార్పొరేట్ శక్తులే లాభపడ్డారు: రాఘవులు

ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలి

 సీఆర్‌డీఏ చట్టంలో లొసుగులు..

నిబంధనలపై ప్రజలతో చర్చించాలి

సింగపూర్ బ్యాంకులో ఉన్న డబ్బును రీసైకిల్ చేయడానికే అక్కడి నిపుణులకు రాజధాని నిర్మాణం అప్పగించారా?

చంద్రబాబుకు రాష్ట్రంలోని మేధావులు, నిపుణులు కనిపించడంలేదా?



 సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని పేరుతో గ్రామాల్లో జరిగిన భూముల క్రయవిక్రయాల్లో భారీ కుంభకోణం ఉందని, దానిపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని జోన్‌లో భూములు అమ్ముకున్న రైతులకు దక్కింది అతి తక్కువ ధర అని చెప్పారు. మధ్యవర్తులు, రాజకీయ నేతలు, కార్పొరేట్ శక్తులకు మాత్రం భారీ లాభం కలిగిందన్నారు. సీపీఎం నేత మాకినేని బసవపున్నయ్య శత జయంతి సందర్భంగా ఆదివారం ఇక్కడ ‘రాజధాని నిర్మాణం పాలన కోసమా? ప్రతిష్ట కోసమా?’ అనే అంశంపై జరిగిన సదస్సులో రాఘవులు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చట్టాన్ని అనేక లొసుగులతోనే అసెంబ్లీలో ఆమోదించారని అన్నారు. ఇది కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా, ఈ ప్రాంత ప్రజలు, రైతులకు నష్టం కలిగించేలా ఉందన్నారు. ప్రజల నుంచి డెవలప్‌మెంట్ చార్జీలు వసూలు చేస్తామని ఆ చట్టంలో తెలిపారన్నారు. దీనివల్ల ఇక్కడి ప్రజలు పన్నులు చెల్లిస్తే వాటి ద్వారా జరిగే అభివృద్ధి ఫలాలను పెద్దలు అనుభస్తారని తెలిపారు.


ఈ చట్టం వల్ల గ్రామ పంచాయతీలు హక్కులు కోల్పోతాయన్నారు. కనీసం నిబంధనలనైనా ప్రజల్లో చర్చకు పెట్టి లోపాలు సవరించాలని కోరారు. ప్రపంచంలో విఫలమైన ల్యాండ్ పూలింగ్ విధానాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారని, ఆ పేరుతో భూస్వాములకు మేలు చేసి చిన్న రైతులు చితికిపోయేలా చేస్తున్నారని అన్నారు. రాజధాని ప్రాంతంలోని పేద, మధ్య తరగతి ప్రజల జీవనానికి భరోసా ఇవ్వాలని చెప్పారు. భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మాజీ టెక్నికల్ డెరైక్టర్  ప్రొఫెసర్ కేఎం లక్ష్మణరావు మాట్లాడుతూ అవినీతి, ఆశ్రీత పక్షపాతానికి తావివ్వకుండా అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం జరగాలని చెప్పారు. రాజధానికి మహానగరం అవసరం లేదన్నారు. అన్ని మౌలిక సౌకర్యాలు ఉండే పాలన కేంద్రం సరిపోతుందన్నారు. డాక్టర్ ఎస్.సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎంవీ ఆంజనేయులు, కేఎస్‌సీ బోస్, జి.విజయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


  సింగపూర్‌లో ఉన్న నల్ల డబ్బును రీసైకిల్ చేయడానికేనా?

 సింగపూర్ బ్యాంకులో ఉన్న నల్ల డబ్బును రీ సైకిల్ చేసుకోవడానికే ఆ దేశ నిపుణులకు రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నారా అంటూ చంద్రబాబును రాఘవులు ప్రశ్నించారు. సింగపూర్, జపాన్ నిపుణుల సహకారంతో రాజధాని నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబుకు మన రాష్ట్రంలోని మేథావులు, నిపుణులు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో, దేశంలోని నిపుణులతో కూడా రాజధాని బ్లూప్రింట్‌ను తయారు చేయాలని చెప్పారు. ఈ నిపుణులు, సింగపూర్ నిపుణుల ప్లాన్లను పరిశీలించి, ఏది మంచిదైతే దానిని అమలు చేయాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top