అత్యవసర కేసులే విచారణ | High Court has decided to hear only emergency cases for two weeks In the wake of Corona Virus | Sakshi
Sakshi News home page

అత్యవసర కేసులే విచారణ

Mar 17 2020 5:53 AM | Updated on Mar 17 2020 5:53 AM

High Court has decided to hear only emergency cases for two weeks In the wake of Corona Virus - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నేపథ్యంలో రెండు వారాల పాటు అత్యవసర కేసులను మాత్రమే విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది తదితరులకు వైద్యులతో థర్మల్‌ గన్‌ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. హైకోర్టు ప్రాంగణంలోకి అనుమతించే విషయంలో ఆంక్షలు విధించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే దిశగా తాము తీసుకున్న నిర్ణయానికి పూర్తిస్థాయిలో సహకరించాలని హైకోర్టు కోరింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర హైకోర్టులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి సోమవారం మధ్యాహ్నం తన సహచర న్యాయమూర్తులందరితో ఫుల్‌కోర్టు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జస్టిస్‌ జేకే మహేశ్వరి పాల్గొన్నారు. హైకోర్టు ప్రాంగణంలో అమలు చేయనున్న నిర్ణయాలను సహచర న్యాయమూర్తులతో కలిసి న్యాయవాదులకు సీజే స్వయంగా వివరించారు.

- జ్వరంతో బాధపడుతున్న న్యాయవాదులు, కక్షిదారులు, సాధారణ ప్రజానీకం హైకోర్టు ప్రాంగణంలోకి రావద్దు.  జ్వరంతో ఎవరైనా న్యాయవాది కోర్టుకు హాజరు కాలేకపోతే, ఆ విషయాన్ని న్యాయమూర్తుల దృష్టికి తెస్తే కేసును వాయిదా వేస్తారే తప్ప కొట్టివేయరు. ప్రస్తుతానికి రెండు వారాల పాటు ఈ నిర్ణయాలు అమల్లో ఉంటాయి. తరువాత పరిస్థితిని సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటారు. కింది కోర్టులకు సైతం హైకోర్టు ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది.
- బెయిళ్లు, ముందస్తు బెయిళ్లు, జైలుశిక్ష అమలు నిలుపుదల కేసులు, అధికారుల వ్యక్తిగత హాజరుకు సంబంధించిన కేసులను హైకోర్టు అత్యవసరంగా విచారిస్తుంది. ఏదైనా పిటిషన్‌ అత్యవసరంగా విచారించాల్సి ఉందని భావిస్తే దాన్ని వివరిస్తూ పిటిషన్‌ వేయాలి. న్యాయమూర్తులు ఆ పిటిషన్‌ను పరిశీలించి అత్యవసరంగా విచారించాలో లేదో నిర్ణయిస్తారు. 
- ఈ రెండు వారాల్లో మధ్యంతర ఉత్తర్వుల గడువు పూర్తయ్యే కేసులు ఏవైనా ఉంటే న్యాయవాదులు ఆ కేసుల నంబర్లను రిజిస్ట్రీ వద్ద ఇవ్వాలి. 
- మంగళవారం రోజు పాత పద్ధతిలోనే కేసుల జాబితా ఉంటుంది. తరువాత రోజు (బుధవారం) హైకోర్టు నిర్ణయించిన విధంగా అత్యవసర కేసులను విచారిస్తుంది. 
- పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ఏవైనా అత్యవసరంగా విచారించాలని భావిస్తే సంబంధిత న్యాయమూర్తికి దరఖాస్తు అందచేయాలి. 
- కేసు వాదించేందుకు న్యాయవాది అందుబాటులో లేనప్పుడు, ఆ కేసులో కక్షిదారు హాజరు తప్పనిసరని హైకోర్టు రిజిస్ట్రార్‌ సంతృప్తి చెందితే హైకోర్టులోకి అనుమతిస్తారు.
-  న్యాయవాదులు సమూహాలుగా కోర్టు ప్రాంగణంలో తిరగవద్దు.
-  పరిశుభ్రత పాటించేందుకు తగినన్ని శానిటైజర్లు, మాస్క్‌లు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్‌లకు సీజే సూచించారు. 
- న్యాయవాదుల సంఘాల కార్యాలయాలు, హైకోర్టు క్యాంటీన్‌ను కొద్ది రోజులు మూసివేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో జరిపిన సమావేశంలో ప్రతిపాదన వచ్చినా హైకోర్టు నగరానికి ఎక్కడో 30 కిలోమీటర్ల అవతల ఉన్నందున మూసివేత సాధ్యం కాదని, పరిమిత పద్ధతుల్లో కోర్టు పనిచేసేలా నిర్ణయం తీసుకున్నామని సీజే  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement