మృగాడికి ఉరి.. బాధితులెందరికో ఊపిరి

Death Penalty For Rapists - Sakshi

మా ఇంటి అందాల చందమామా.. చీకట్లు చిరకాలం ఉండవమ్మా..
చిగురాకు నీ మనసు చందమామ.. చింతనిప్పులపాల పడనీకమ్మా..
అమ్మ కంటికి నీవు చందమామా.. వెన్నలూరే పెరుగు కుండవమ్మా..

విప్లవ కవి జ్వాలాముఖి ఓ కవితలో యువతులకు ఇలా జాగ్రత్తలు చెబుతాడు. కానీ చింతనిప్పులు చండ్రనిప్పులుగా మారి ఇటీవలి కాలంలో దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో పడతులపై పగపెడుతున్నాయి. చిగురుటాకుల నుంచి పండుటాకుల వరకూ ఎవ్వరినీ వదలకుండా మృగాళ్లు దుశ్శాసన పర్వానికి తెరలేపుతున్నారు. గతంలో అధికారం అండతో కొందరు బరితెగించగా.. కామాంధ గర్వంతో మరికొందరు నిత్యం బరితెగిస్తున్నారు. నిర్భయ తదితర కఠిన చట్టాలున్నా కామాంధులు వెనక్కి తగ్గడం లేదు. దివ్యాంగులని.. వృద్ధులని.. చిన్నారులని చూడటం లేదు. పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. వీరి వికృత చేష్టలకు అమాయక ఆడబిడ్డలు అన్యాయంగా బలైపోతున్నారు.

చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తుంటే భయమేస్తోంది. మనిషి కన్నా మృగమే నయమేమో అన్పిస్తోంది. ఇలాంటి అంధకారంలో ఆశాకిరణంలా.. ఈ రకమైన మృగాలకు బుద్ధి చెప్పే విధంగా వరంగల్‌ కోర్టు తీర్పునిచ్చింది. జూన్‌ 18వ తేదీన వరంగల్‌ జిల్లా హన్మకొండలో పసిపాపపై లైంగిక దాడి చేసి, హత్య చేసిన దోషి ప్రవీణ్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఎంతోమంది ఎదురు చూసిన తీర్పు వెలువడింది. ఆడపిల్లలపై ఆటవికంగా వ్యవహరిస్తే ప్రాణం తీసేస్తామని.. కామాంధులారా తస్మాత్‌ జాగ్రత్త.. అంటూ మృగాళ్లకు సంకేతాలు పంపించింది. ఈ తీర్పు జిల్లాలో చర్చనీయాంశమైంది. వరంగల్‌ కోర్టు మంచి తీర్పే ఇచ్చిందని.. ఏళ్ల తరబడి జాప్యం చేయకుండా సరైన నిర్ణయం తీసుకుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.

2017లో జిల్లాలో నమోదైన లైంగిక దాడులు

సబ్‌ డివిజన్‌ కేసుల సంఖ్య
శ్రీకాకుళం 16
పాలకొండ 14
కాశీబుగ్గ 10
మొత్తం  40

2018

సబ్‌ డివిజన్‌  కేసుల సంఖ్య
శ్రీకాకుళం 15
పాలకొండ 19
కాశీబుగ్గ  11
మొత్తం 45

2019

సబ్‌ డివిజన్‌ కేసుల సంఖ్య
శ్రీకాకుళం 14
పాలకొండ 5
కాశీబుగ్గ 11
మొత్తం 30

మాతృ దేవోభవ... పితృ దేవోభవ...ఆచార్య దేవోభవ అన్నారు. తల్లి, తండ్రి తర్వాత గురువుది అంతటి ఉన్నత స్థానం. అలాంటి గురువే తప్పుటడుగు వేస్తే... సుద్దులు చెప్పి సన్మార్గంలో పెట్టాల్సిందిపోయి బుద్ధి మాలిన పనిచేస్తే... వారి ఉన్నతిని కాంక్షించకుండా కామవాంఛతో కన్నేస్తే... ఆ విద్యార్థుల మనోవేదన వర్ణనాతీతం. గతంలో బూర్జ మండలంలో ఇదే తరహాలో ఒక ఘటన చోటు చేసుకోగా తాజాగా కొత్తూరు మండలం మెట్టూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికపై జి.ఉమామహేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఆ ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌కు కూడా గురయ్యాడు. ఈయనెవరో కాదు మండల టీడీపీ నేతకు సమీప బంధువు.

కన్న పిల్లల్లా.. మనవరాలిగా.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వయస్సులో కామాంధుడిగా కాటేయాలని చూస్తే.. అప్యాయంగా అక్కున చేర్చుకోవల్సిన పెద్దోళ్లు కర్కశంగా వాటేస్తే... గతేడాది అక్టోబర్‌లో రాజాం నగర పంచాయతీ పరిధిలో ఇదే జరిగింది. వస్త్రపురి కాలనీ చెందిన తొమ్మిదేళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. 
► ఇలాంటి ఘటనలు జిల్లాలో ఎన్నో చోటు చేసుకున్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉంటున్నాం. గత మూడేళ్లలో 115 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. రుజువుల్లేక నిర్ధారణ కాని కేసులైతే చెప్పనక్కర్లేదు. అధికారికంగా నమోదైన కేసుల్లో 86 మైనర్లపై జరిగిన లైంగిక దాడులే. దీన్నిబట్టి జిల్లాలో  మృగాళ్ల కండకావరం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.   

ఎవరికైనా ఇదే గతి
వరంగల్‌ కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. లైంగిక దాడి చేసిన వ్యక్తికి ఉరిశిక్ష విధించడం సంచలనమే. చట్టం చూస్తూ ఊరుకోదు. మహిళలపై ఆటవికంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. మహిళల పట్ల గౌరవంగా ఉండాలే తప్ప మృగంగా మారకూడదు.
–చక్రవర్తి, డీఎస్పీ, శ్రీకాకుళం

వెంటనే శిక్ష పడాలి
వరంగల్‌లోని హన్మకొండలో పసిపిల్లపై దారుణాతి దారుణానికి ఒడిగట్టిన మృగాడికి సరైన శిక్షే పడింది. మన చుట్టూ, మనతో నిత్యం తిరుగుతున్నారు. పసిపిల్లల పై తమ కామ వాంఛను తీర్చుకునే కామాం ధులకు ఉరి శిక్షే సరి. చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలి. ఘటన జరిగిన 50 రోజుల్లో దుర్మార్గుడిని శిక్షించడం సంతోషమే. అయితే ఇటువంటి హత్యాచార ఘటనల్లో బాధులకు తక్షణ న్యాయం జరగాలంటే కఠిన శిక్షలు వెంటనే అమలు జరిగేలా చూసే విధంగా ప్రభుత్వాలు చట్టాలు చేయాలని మహిళా లోకం కోరుకుంటోంది. 
–డాక్టర్‌ ఎంఆర్‌ జ్యోతి ఫ్రెడరిక్, వైస్‌ ప్రిన్సిపాల్, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల

మానసిక రోగులే ఇలా ప్రవర్తిస్తారు
ఉరి శిక్ష పడిన ప్రవీణ్‌ అనే వ్యక్తి అంతకుముందు చిన్నపిల్లలతో సెక్స్‌ చేయడం అలవాటు చేసుకున్నాడని అర్ధమైంది. ఇప్పటి వరకు రెండు సార్లు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాడని కేసు స్టడీలో నిర్ధారించారు. చిన్నపిల్లలతో సెక్స్‌ చేసే రోగాన్ని పీడో ఫీలియా అంటారు. పీడో ఫీలియాకు గురైన వ్యక్తులకు సైకియాట్రిస్ట్‌ వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లయితే ఈ పరిస్థితి ఉండేదికాదు. సదరు వ్యక్తి జీవితంలో జరగరానివి, చూడకూడనవి ఏవో జరిగాయి. వాటిని తల్లిదండ్రులు/ సంరక్షకులు తెలుసుకోలేకపోయారు. వాటి కారణంగానే ఆ వ్యక్తి అలా మారాడని చెప్పవచ్చు. రేప్‌తోపాటు చిన్నారిని మర్డర్‌ చేయడం వల్లే ప్రవీణ్‌కు కోర్టు ఉరి శిక్ష వేయడం జరిగింది.
–ఆర్‌. మల్లికార్జునరావు, మానసిక వైద్య నిపుణులు, రిమ్స్‌ ఆసుపత్రి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top