
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కొందరు టీడీపీ అభ్యర్థుల ఎన్నికను సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన ఎన్నికల పిటీషన్ల (ఈపీ)పై హైకోర్టు స్పందించింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.గంగారావు, జస్టిస్ మఠం వెంకటరమణ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
మోదుగుల అభ్యర్థన ఇదీ...
గుంటూరు నుంచి గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి హైకోర్టులో ఈపీ దాఖలు చేశారు. తాను కేవలం 4,200 ఓట్ల తేడాతో ఓడిపోయానని, ఓట్లను సరిగ్గా లెక్కించకపోవడమే ఇందుకు కారణమని తన పిటీషన్‌లో పేర్కొన్నారు. 15,084 పోస్టల్ ఓట్లలో 9,782 ఓట్లను కవర్లపై సీరియల్ నంబర్ సరిగా వేయలేదన్న కారణంతో అధికారులు తిరస్కరించారని తెలిపారు. ఇది పూర్తిగా సాంకేతికపరమైన కారణమని, తిరస్కరించిన ఓట్లన్నీ తనకు వచ్చినవేనని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని జయదేవ్ ఎన్నికను రద్దు చేయాలని కోర్టును కోరారు.
ఇద్దరు ఎమ్మెల్యేలపై..
విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఎన్నికను సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్ తరఫున ఆయన ఎన్నికల ఏజెంట్ వి.శ్రీనివాసరెడ్డి ఈపీ దాఖలు చేశారు. రామానాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ పాలకొల్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ సీహెచ్.సత్యనారాయణమూర్తి తరఫున ఆయన ఎన్నికల ఏజెంట్ ఎ.వాసుదేవరావు ఈపీ దాఖలు చేశారు. వీరిద్దరూ ఎన్నికల అఫిడవిట్లలో ఆదాయ వివరాలను దాచిపెట్టారని వివరించారు.