టీడీపీలో రాజధాని ప్రకంపనలు!

టీడీపీలో రాజధాని ప్రకంపనలు! - Sakshi


రాజధాని అంశం అధికార టీడీపీలో చిచ్చు రాజేసింది. నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై మంత్రులు చేస్తున్న ప్రకటనలు సైకిల్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిపుణుల కమిటీ నివేదిక రాకుండానే రాజధాని ఇక్కడ అని ఒకరు, అక్కడొద్దని మరొకరు అంటూ సిగపట్లు పడుతున్నారు. మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తమ ప్రాంతంలోనే పెట్టాలని ఒకరు, కాదు మా ప్రాంతంలోనే పెట్టాలని మరొకరు డిమాండ్ చేస్తున్నారు.  విజయవాడ-గుంటూరులో రాజధాని ఉండొచ్చని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ప్రకటించడంతో అధికార పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేగాయి. రాయలసీమ నాయకులు నారాయణ ప్రకటనను తప్పుబట్టారు. ఆయన తొందరపాటు ప్రకటన వల్ల ఆ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమి విజయవాడ, గుంటూరు మధ్య లేదని తెలిపారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వ ధర ప్రకారమే సేకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.విజయవాడలో రాజధాని ఏర్పాటు సమస్యాత్మకం అవుతుందని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ వాసులంతా తమ ప్రాంతంలో రాజధాని నగరం ఉంటే బాగుంటుందని భావిస్తున్నారని జేసీ చెప్పారు. మాచర్లను రాజధాని చేస్తే బాగుంటుందని సూచించారు. అయితే, తమ మాట నెగ్గదని ఆయన వాపోయారు. తమ పెరట్లోనే రాజధాని ఉండాలనుకోవడం సరికాదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సహచరులకు చురక అంటించారు. భూములు, నీటి లభ్యత ఉన్న చోటే రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిపై తలో మాట మాటాడొద్దని అధినేత వారించినా మంత్రులు పట్టించుకోకపోవడం గమనార్హం. రాజధాని అంశం టీడీపీ ఇంకా ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తోందో చూడాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top