సంచార వైద్య శాలల(104 వాహనాలు) నిర్వహణ బాధ్యత నుంచి ఏపీ ప్రభుత్వం తప్పుకోనుంది. వీటిని ప్రైవేటుకు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది.
నెలాఖరుకు కసరత్తు పూర్తి
లక్షలాదిమంది రోగుల పరిస్థితి అగమ్యగోచరమే
వీధిన పడనున్న 1,670 మంది కాంట్రాక్టు ఉద్యోగులు
ఆందోళనకు సమాయత్తం
ఫిబ్రవరి 1న చలో కమిషనరేట్ నిర్వహిస్తున్నట్టు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సంచార వైద్య శాలల(104 వాహనాలు) నిర్వహణ బాధ్యత నుంచి ఏపీ ప్రభుత్వం తప్పుకోనుంది. వీటిని ప్రైవేటుకు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే రెండుసార్లు టెండర్ల నోటిఫికేషన్‌ను ఇచ్చినప్పటికీ ఎవరూ రాలేదు. అయితే పట్టువదలని ప్రభుత్వం మరోసారి టెండర్ల ప్రక్రియను చేపట్టడమేగాక.. 104 వాహనాల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల ఐదున మళ్లీ టెండర్లను ఆహ్వానించగా ఆరు కంపెనీలు పాల్గొన్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన సాంకేతిక పరిశీలన(టెక్నికల్ ఎవాల్యుయేషన్) జరుగుతోంది. ఈ నెలాఖరుకల్లా వీటిలో ఒక కంపెనీని ఎంపిక చేసి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం దానికి అప్పజెప్పనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు.. ముఖ్యంగా పేదలకు ప్రస్తుతం 104 వాహనాల ద్వారా అందుతున్న వైద్యం అందుతోంది. నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగిస్తే.. ఇకమీదట వారికీ వైద్యం అందడం గగనమే. అదే సమయంలో 104 వాహనాల్లో పనిచేస్తున్న 1,670 మంది కాంట్రాక్టు సిబ్బంది వీధిన పడడం ఖాయంగా కనిపిస్తోంది.
పేదరోగుల పరిస్థితి అగమ్యగోచరమే!
సంచార వైద్యశాలలుగా పేరున్న 104 వాహనాల నిర్వహణ ప్రైవేటుకిస్తే పల్లెల్లోని పేద రోగుల పరిస్థితి ఏమిటన్నది అగమ్యగోచరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా లక్షలాదిమంది 104 వాహనాలద్వారా ఇచ్చే మందులపై ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వాసుపత్రులకు వెళ్లలేక, వెళ్లినా అక్కడ మందులు దొరకని పరిస్థితుల్లో వృద్ధులకు 104 వాహనాల నుంచి వచ్చే మందులు ప్రాణాధారమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వాహనాలు జిల్లా వైద్యాధికారుల సమక్షంలో నడుస్తున్నాయి. 1,670 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతినెలా వీరు 18,191 గ్రామాలకు వెళ్లి వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్యమందిస్తున్నారు. అలాంటి ఈ వాహనాల్ని నిర్వహణ కష్టసాధ్యమంటూ ప్రైవేటుకివ్వడాన్ని రోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీటిని ప్రైవేటుకిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఆందోళనలో ఉద్యోగులు
మరోవైపు 104 వాహనాల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడాన్ని వాటిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను క్రమబద్ధీకరిస్తారని ఆశతో ఎదురుచూస్తుంటే ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించడం దుర్మార్గమని వాపోతున్నారు. ఇందుకు నిరసనగా ఆందోళనలకు సమాయత్తమవుతున్నారు. దీనిపై 104 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జె.సింహాచలం మాట్లాడుతూ 104 ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏడేళ్లుగా పల్లెలకు వెళ్లి సేవలందిస్తున్నామని, ఇప్పుడు ప్రైవేటుకిస్తే తమ కుటుంబాలు ఏం కావాలన్నారు. టెన్‌మెన్ కమిటీ రిపోర్టు ఆధారంగా డేట్ ఆఫ్ జాయినింగ్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం జిల్లా ఎంపిక కమిటీ ద్వారా జేడీ ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టారని, ఈ పరిస్థితుల్లో క్రమబద్ధీకరణ చేయాల్సిందిపోయి ప్రైవేటుకివ్వడం దుర్మార్గమన్నారు. ఇందుకు నిరసనగా ఫిబ్రవరి 1న చలో కమిషనరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రకటించారు.