Kakinada: నల్ల తామరకు ‘ఉల్లి’ కళ్లెం! ఆదర్శంగా దుర్గాడ రైతులు.. | Kakinada: Gollaprolu Durgada Farmers Uses Ulli Kashayam For Mirchi Crop | Sakshi
Sakshi News home page

Kakinada: నల్ల తామరకు ‘ఉల్లి’ కళ్లెం! ఆదర్శంగా దుర్గాడ రైతులు..

May 3 2022 10:25 AM | Updated on May 3 2022 10:30 AM

Kakinada: Gollaprolu Durgada Farmers Uses Ulli Kashayam For Mirchi Crop - Sakshi

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. అలాంటి ఉల్లి రైతులకు తల్లిగా మారింది. కుళ్లిన ఉల్లిపాయలతో తయారు చేసిన కషాయం పొట్టి మిర్చి మొదలు అనేక ఇతర పంటలకూ సంజీవినిగా మారింది. అనుకోని ఉపద్రవాలకు పకృతి వ్యవసాయమే ధీటుగా సమాధానం చెబుతుందని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన రైతులు నిరూపించారు. 

దుర్గాడ గ్రామంలో సుమారు వెయ్యి మంది చిన్నా, పెద్దా రైతులు ఉంటారు. పొట్టి మిర్చి అనే అరుదైన దేశవాళీ రకం రౌండ్‌ మిర్చికి దుర్గాడ పెట్టింది పేరు. వందలాది మంది రైతులు ఈ రకం మిర్చిని ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే సాగు చేశారు.

ఈ ఏడాది మిర్చి తోటలను నల్ల తామర (త్రిప్స్‌ పార్విస్పైనస్‌) సర్వనాశనం చేసింది. దుర్గాడలో సుమారు 300 ఎకరాల వరకు ఉల్లి సాగవుతోంది. కుళ్లిపోయిన ఉల్లి పాయలతో తయారు చేసిన కషాయం మిరప తోటలను, ఇతర తోటలను రసంపీల్చే పురుగుల నుంచి రక్షించడానికి ఉపయోగపడటం విశేషం.   

‘ఉల్లి కషాయంతో ముడత విడిపోతుండటంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా రైతులోకంలో పాకిపోయింది. గత డిసెంబర్‌లో అనేక జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి కూడా రైతులు దుర్గాడ వచ్చి ఉల్లి కషాయాన్ని తీసుకెళ్లి పంటలను రక్షించుకున్నారు. లీటరు రూ.30కి విక్రయిస్తున్నాం. అప్పట్లో రోజుకు 500–600 లీటర్ల వరకు అమ్మాం. మిర్చితోపాటు అనేక ఇతర పంటల్లోనూ రసం పీల్చే పురుగులన్నిటినీ ఉల్లి కషాయం కంట్రోల్‌ చేసింది.

దుర్గాడలో ఉల్లి కషాయం వాడని రైతు లేరు. ఈ ఏడాది ఆ గ్రామానికి చెందిన వెయ్యి మందికి పైగా రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తామంటున్నారు..’ అని ఏపీ ప్రకృతి వ్యవసాయ విభాగం ఎంసీఆర్పీ వెంకట రమణ ‘సాక్షి’తో చెప్పారు. మిరప, మామిడి, పత్తి, మునగ, దోస, సొర, క్యాప్సికం, బంతి, చామంతి, టమాటా, దొండ వంటి అనేక పంటలపై దాడి చేస్తున్న రసంపీల్చే పురుగుల నియంత్రణకు ఉల్లి కషాయం చాలా ఉపయోగపడిందని ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది చెబుతున్నారు.

ఉల్లి కషాయంతో పాటు, కుళ్లిన చేపలతో మీనామృతం, అల్లం వెల్లుల్లితో తయారైన అగ్నిఅస్త్రం, దేశవాళీ ఆవు పెరుగుతో తయారైన పులిసిన మజ్జిగతో ప్రకృతి వ్యవసాయంలో చక్కని ఫలితాలు సాధిస్తూ దుర్గాడ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

రసాయనిక వ్యవసాయం చేస్తున్న ముర్రె మన్నెయ్య అనే మిర్చి రైతు నల్ల తామర తాకిడికి పంటను పీకేద్దామనుకున్నాడు. పక్క పొలానికి చెందిన రైతు సూచన మేరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మారి అనేక దశపర్ణి కషాయం, ఉల్లి కషాయం, పుల్లమజ్జిగ, పంచగవ్య పిచికారీ చేసి పంటను పూర్తిగా రక్షించుకున్నారు. అసలేమీ రాదనుకున్న ఎకరంన్నర పొలంలో సుమారు పది క్వింటాళ్ల మిర్చి దిగుబడి పొందారు. నష్టాలపాలయ్యే దశలో సాగు పద్ధతి మార్చుకొని లాభాలు పొందాడు. 

ప్రతి ఇల్లూ కషాయ విక్రయ కేంద్రమే!
దుర్గాడలో పంట సీజన్‌లో సుమారు 15 టన్నుల వరకు ఉల్లిపాయలు పాడైపోతూ ఉంటాయి. గతంలో వీటిని పారేసే వారు. కానీ ప్రస్తుతం ఉల్లి కషాయం తయారీలో కుళ్లిన ఉల్లి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో దానికీ ఆర్థిక విలువ వచ్చింది. మామూలు ఉల్లి కేజీ రూ. 20 ఉంటే పనికి రాని ఉల్లి కేజీ రూ. 3–5 వరకు పలుకుతోంది.

ఇళ్ల దగ్గర పూల మొక్కలకు బదులుగా సీతాఫలం, ఉమ్మెత్త, వేప తదితర ఔషధ మొక్కలను పెంచటం ప్రారంభించారు. ప్రతీ ఇంటి వద్దా దేశవాళీ ఆవులు దర్శనమిస్తున్నాయి. గ్రామం మొత్తంలో సుమారు 70 మంది రైతులు తమ ఇళ్ల వద్ద ఉల్లి కషాయం తయారు చేసి అమ్మటం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. 

ప్రతి రైతూ ఉల్లి కషాయం వాడారు
ప్రకృతి వ్యవసాయంలో ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు పొట్టి మిర్చి దిగుబడి వచ్చేది. అయితే, ఈ ఏడాది నల్లతామర విరుచుకు పడటంతో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడే రైతులు చాలా మంది పూర్తిగా నష్టపోయి తోటలు పీకేసి నువ్వులు వేశారు. ప్రకృతి వ్యవసాయంలో ఉన్న మిరప చేలు ఉల్లి కషాయం వల్ల తట్టుకున్నాయి.

దిగుబడి 15 క్వింటాళ్లకు తగ్గింది. దుగ్గాడలో రసాయన సేద్యం చేసే రైతులు సహా ప్రతి రైతూ ఏపీ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం తయారు చేసి ఇచ్చిన ఉల్లి కషాయం వాడి ఉపశమనం పొందారు. తోటలు తీసేద్దామనుకున్న రసాయన రైతులు కొందరు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించి తోటలను నిలబెట్టుకున్నారు.
– ఎలియాజర్‌(94416 56083), ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్టు మేనేజర్, కాకినాడ జిల్లా  

ఉల్లి కషాయం బాగా పని చేస్తోంది
ఉల్లి కషాయం పంటలను ఆశించే రసంపీల్చే పురుగులను బాగా కట్టడి చేస్తోంది. పకృతి వ్యవసాయం డీపీఎం గారు ఉల్లి కషాయం తయారీ విధానాన్ని వివరించగా ప్రయోగాత్మకంగా తయారు చేసి చూసాను. మొదట్లో నా పొలంలో పిచికారీ చేస్తే పురుగుల తీవ్రత తగ్గి పంట నిలబడింది. దీంతో ఎక్కువ మోతాదులో తయారీ ప్రారంభించా. ప్రతి రోజూ 20–50 లీటర్ల ఉల్లి కషాయం తయారు చేస్తున్నాను.

ఇప్పటి వరకు సుమారు 80 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుచేసిన మిర్చి పంట నల్ల తామర పురుగును తట్టుకుని నిలబడడంతో మిగిలిన రైతులు కూడా వాడడం ప్రారంభించారు. సొంతంగా దేశవాళీ ఆవులను పెంచుతూ భారీగా ఉల్లి కషాయం, జీవామృతం, మీనామృతం, అగ్ని అస్త్రం వంటి మందులు తయారు చేసి స్థానిక రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఇతర ప్రాంతాల రైతులు కూడా వచ్చి ఉల్లి కషాయం కొనుక్కెళ్తున్నారు. 
– గుండ్ర శివ చక్రం (95537 31023), రైతు, ఉల్లి కషాయం తయారీదారుడు, దుర్గాడ, కాకినాడ జిల్లా  

ఉల్లి కషాయం తయారీ, వాడకం ఇలా..
ఉల్లి కషాయానికి కావాల్సినవి:
ఉల్లి పాయలు (కుళ్లినవైనా పర్వాలేదు) – 20 కేజీలు,
వేపాకు  – 5 కేజీలు,
సీతాఫలం ఆకు  – 2 కేజీలు,
ఉమ్మెత్తాకు  – 1 కేజీ,
గోమూత్రం  – 20 లీటర్లు,
గోవు పేడ    – 2 కేజీలు.

తయారు చేసే విధానం:
ఉల్లి పాయలు, వేపాకులు, సీతాఫలం ఆకులు, ఉమ్మెత్తాకులను మెత్తగా దంచి ముద్దగా చేసి దానికి ఆవు పేడ కలిపి సిద్ధం చేసుకోవాలి. ఒక పొయ్యిపై పెద్ద పాత్రను పెట్టి 20 లీటర్ల గోమూత్రాన్ని పోసి, దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఆకులు, ఉల్లి మిశ్రమాన్ని దానిలో కలుపుకోవాలి. మూడు పొంగులు వచ్చే వరకు అర గంట పాటు మరగబెట్టాలి. తరువాత చల్లారనిచ్చి, వడకట్టి ఒక పరిశుభ్రమైన డ్రమ్ములో భద్రపరచుకోవాలి. ఇలా దాదాపు 20 లీటర్ల ఉల్లి కషాయం తయారవుతుంది. మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. 

ఉల్లి కషాయాన్ని వారానికి ఒకసారి చొప్పున మూడు వారాల పాటు పిచికారీ చేయడం వల్ల చీడపీడల నుంచి పంటకు ఉపశమనం లభిస్తుంది. 
వాడే విధానం: 4 లీటర్ల ఉల్లి కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి చేలల్లో పిచికారీ చేసుకోవాలి. ఉల్లి కషాయం కలిపిన సుమారు 150 లీటర్ల ద్రావణం ఎకరానికి అవసరమవుతుంది. 

ఉద్యానవన పంటలకు ఆకులు మొదళ్లు తడిచేలా పిచికారీ చేసుకోవడం వల్ల అన్ని రకాల పురుగులు నశిస్తాయని రైతులు చెబుతున్నారు. దుర్గాడలో ఉల్లి కషాయాన్ని పకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు లీటరు రూ. 30లకు విక్రయిస్తున్నారు.  
 – వీఎస్‌వీఎస్‌ వరప్రసాద్, సాక్షి, పిఠాపురం, కాకినాడ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement