
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మనసు మార్చుకున్నాడు. దేశవాలీ క్రికెట్‌లో గోవాకు ఆడాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. జైస్వాల్ కొద్ది రోజుల కిందట ముంబై నుంచి గోవాకు వలస వెళ్లాలని (దేశవాలీ క్రికెట్) నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా అతను ముంబై క్రికెట్ అసోసియేషన్‌పై (MCA) ఒత్తిడి తెచ్చి మరీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) పొందాడు.
తాజాగా ఈ విషయంలో జైస్వాల్ యూ టర్న్ తీసుకున్నాడు. తిరిగి తాను ముంబైకే ఆడాలని నిర్ణయించుకున్నట్లు ఎంసీఏకు ఈ-మెయిల్ ద్వారా సందేశాన్ని పంపాడు. వారు జారీ చేసిన ఎన్‌వోసీని వెనక్కు తీసుకోవాలని కోరాడు. గోవాకు వలస వెళ్లాలనుకున్న తన ప్రణాళికను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపాడు.
ఈ దేశవాలీ సీజన్‌లో సెలెక్షన్‌కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఎంసీఏ తిరిగి తనను ముంబైకి ఆడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు. ఎంసీఏ ఇచ్చిన ఎన్‌వోసీని బీసీసీఐకి కానీ గోవా క్రికెట్ అసోసియేషన్‌కు కాని సమర్పించలేదని తెలిపాడు.
కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టిన జైస్వాల్.. ముంబై తరఫున దేశవాలీ క్రికెట్ ఆడి టీమిండియాలో, ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్నాడు. వ్యక్తిగత కారణాల చేత తనకు జీవితాన్ని ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌నే వదిలి వెళ్లాలనుకున్న జైస్వాల్ ఎందుకో తిరిగి మనసు మార్చుకున్నాడు. వాస్తవానికి గోవా క్రికెట్ అసోసియేషన్ జైస్వాల్‌కు కెప్టెన్సీ ఆశ చూపి తమవైపు మళ్లేలా చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, అతను తిరిగి పాత జట్టు ముంబైకే ఆడాలనుకుంటున్నాడు.
జైస్వాల్‌కు ముంబై తరఫున ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆ జట్టు తరఫున ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. 2018-19 రంజీ సీజన్‌లో తొలిసారి ముంబైకు ప్రాతినిథ్యం వహించిన జైస్వాల్.. అతి తక్కువ వ్యవధిలో చాలా పాపులర్ అయ్యాడు. ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 60కి పైగా సగటుతో 13 సెంచరీలు, 12 అర్ద సెంచరీల సాయంతో 3712 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.
2019-20 సీజన్‌లో ముంబై తరఫున లిస్ట్-ఏ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జైస్వాల్.. విజయ్ హజారే ట్రోఫీలో జరిగిన ఓ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే జైస్వాల్‌కు ఐపీఎల్ ఛాన్స్ దక్కింది. 2020 సీజన్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జైస్వాల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోని జైస్వాల్ ఫార్మాట్లకతీతంగా దేశవాలీ క్రికెట్‌లో, అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో చెలరేగిపోతున్నాడు.