MI vs GT: అందరికీ అప్పుడే.. సిరాజ్‌కు ఇప్పుడు! | Rohit Sharma Presents T20 WC Winner 2024 Ring To Siraj Ahead MI Vs GT, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

MI vs GT: సిరాజ్‌కు టీ20 వరల్డ్‌కప్‌ విక్టరీ రింగ్‌... వీడియో చూశారా?

Published Tue, May 6 2025 9:37 AM | Last Updated on Tue, May 6 2025 10:53 AM

Rohit Sharma Presents T20 WC Winner 2024 Ring To Siraj Ahead MI Vs GT

PC: BCCI

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj)కు... భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) టీ20 ప్రపంచకప్‌ విజేత ఉంగరాన్ని అందించాడు. గతేడాది జరిగిన పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కప్‌ గెలిచిన ఆ జట్టులోని సభ్యులకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలి వార్షిక అవార్డుల కార్యక్రమంలో ప్రత్యేక ఉంగరాలు బహుకరించింది.

అందరికీ అప్పుడే.. సిరాజ్‌కు ఇప్పుడు!
ముంబై వేదికగా జరిగిన ఈ వేడుకకు సిరాజ్‌ గైర్హాజరు కాగా... సోమవారం వాంఖడే స్టేడియంలో సిరాజ్‌కు రోహిత్‌ శర్మ ఈ బహుమతిని అందించాడు. ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం గుజరాత్‌ టైటాన్స్- ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. 

గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడుతున్న సిరాజ్‌కు ముంబై స్టార్‌ రోహిత్‌ ఈ ఉంగరాన్ని అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ రింగ్‌లో ఆటగాడి పేరు, జెర్సీ నంబర్‌తో పాటు జాతీయ చిహ్నం అశోక చక్రను పొందుపరిచారు.

ముంబైతో మ్యాచ్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్‌
ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. రిక్రియేషనల్‌ (సరదా కోసం తీసుకునే) డ్రగ్స్‌ వాడటం వల్ల అతడిపై ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) తాత్కాలిక నిషేధం విధించగా... సస్పెన్షన్‌ సమయంలో ‘సబ్‌స్టాన్స్‌ అబ్యూస్‌’ చికిత్స పూర్తి చేయడంతో అతడిపై నిషేధాన్ని తొలగించారు. దీంతో రబడ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ గుజరాత్‌ టైటాన్స్‌కు అందుబాటులోకి వచ్చాడు.

ఈ మేరకు దక్షిణాఫ్రికా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రగ్‌ ఫ్రీ స్పోర్ట్‌ (ఎస్‌ఏఐడీఎస్‌) ఒక ప్రకటనలో తెలిపింది. ‘రబడ డోపింగ్‌కు పాల్పడినట్లు ఏప్రిల్‌ 1న నిర్ధారణ అయింది. దీంతో అతడిపై తాత్కాలిక నిషేధం విధించారు. 

ఆ సమయంలో ఐపీఎల్‌ ఆడుతున్న రబడ తక్షణమే దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికా డోపింగ్‌ నిరోధక నియమాల ప్రకారం ప్రత్యేకంగా నిర్వహించే సబ్‌స్టాన్స్‌ అబ్యూస్‌ చికిత్స తీసుకున్నాడు. రెండు సెషన్‌లు పూర్తి కావడంతో అతడిపై విధించిన తాత్కాలిక నిషేధం ముగిసింది.

నా వృత్తిపై గౌరవం, భక్తితో ఉంటాను
అతడు నెల రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. రబడ ఇప్పుడు నిరభ్యంతరంగా మ్యాచ్‌లు ఆడోచ్చు’ అని ఎస్‌ఏఐడీఎస్‌ వెల్లడించింది. ‘ఈ సంఘటనతో కుంగిపోను. ముందుకు సాగడమే నా లక్ష్యం. నిరంతరం కష్టపడుతూ నా వృత్తిపై గౌరవం, భక్తితో ఉంటాను’అని రబడ అన్నాడు.  క్రీడల్లో మెరుగైన ప్రదర్శనకు ఉపయోగపడే డ్రగ్స్‌ తరహాలో కాకుండా కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి వాటిని రిక్రియేషనల్‌ డ్రగ్స్‌గా వ్యవహరిస్తారు.

ఆటగాళ్లు వీటిని వాడితే నిబంధనల ప్రకారం గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం పడే అవకాశం ఉన్నా... సరదా కోసమే వాటిని వాడినట్లు... ఆ సమయంలో ఎలాంటి మ్యాచ్‌లు లేకపోవడంతోనే అలా చేసినట్లు ప్లేయర్‌ నిరూపించగలిగితే స్వల్ప నిషేధంతో తప్పించుకోవచ్చు. 

ఇక ముప్పై ఏళ్ల రబడ ఈ ఏడాది జనవరిలో ఎస్‌ఏ20 సందర్భంగా ఈ డ్రగ్‌ తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది. ఇప్పుడు సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు రబడ అందుబాటులో ఉండనున్నాడు.   

చదవండి: వయసుతో పనేంటి?.. అతడు మరో ఆరేళ్లపాటు ఐపీఎల్‌ ఆడతాడు: వరుణ్‌ చక్రవర్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement