
మేం మళ్లీ రాలేం..
రెవెన్యూ శాఖపై ఆసక్తి చూపని పూర్వపు వీఆర్వో, వీఆర్‌ఏలు
● ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 3,386 మంది ● జీపీవోలుగా వెళ్లేందుకు 562 మంది దరఖాస్తు ● అర్హత సాధించింది 481 మంది ● పాత సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్
సాక్షి, సిద్దిపేట: గ్రామాల్లో రెవెన్యూ అధికారుల పాలనను మళ్లీ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో పని చేసిన వీఆర్వోలు, వీఆర్‌ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కానీ అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదు. పూర్వపు వీఆర్వో, వీఆర్‌ఏలు తిరిగి మాతృశాఖలోని వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి గత నెల 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో, ఫిజికల్‌గా కలెక్టరేట్లలో దరఖాస్తులను స్వీకరించారు. పాత సర్వీసును పరిగణలోకి తీసుకోకపోవడం, జాబ్ ప్రమోషన్ చాట్‌ను ప్రకటించకపోవడంతో జీపీవోలుగా వచ్చేందుకు చాలా మంది ఆసక్తి చూపడం లేదు.
562 మంది దరఖాస్తు
ఉమ్మడి మెదక్ జిల్లాలో పూర్వపు వీఆర్వోలు, వీఆర్‌ఏలు 3,386 మంది విధులు నిర్వర్తించేవారు. గత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టంను తీసుకొచ్చింది. అందుకోసం క్షేత్రస్థాయిలో రెవెన్యూ గ్రామానికి ఒకటి చొప్పున జీపీవో పోస్టును మంజూరు చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,365 రెవెన్యూ గ్రామాలున్నాయి. తిరిగి రెవెన్యూ శాఖలోకి వెళ్లేందుకు 562 మందే దరఖాస్తు చేశారు. వీఆర్‌ఏలు అయితే ఇంటర్ పాసై ఉండటంతోపాటు ఐదేళ్ల సర్వీస్/డిగ్రీ ఉంటే ఎలాంటి సర్వీస్ అవసరం లేదు. దరఖాస్తుల్లో పొందుపరిచిన అర్హతలను పరిశీలించగా 81 మందివి రిజక్ట్ కాగా 481 మంది పరీక్షకు అర్హత సాధించారు.
పాత సర్వీసు పరిగణించకపోవడంతో
వీఆర్వో, వీఆర్‌ఏగా చేసిన సర్వీసు, ప్రస్తుతం విధులు నిర్వరిస్తున్న జూనియర్ అసిస్టెంట్ సర్వీసులను పరిగణలోకి తీసుకోమని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే జీపీవోలకు జాబ్ చార్ట్ ప్రకటించారు. కానీ ప్రమోషన్ చార్ట్ ప్రకటించలేదు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలో మూడేళ్లుగా జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో ఆయా శాఖలలో ప్రమోషన్‌లు రానున్నాయి. ఈ నేపథ్యంలో జీపీవోలుగా పని చేసేందుకు తక్కువ సంఖ్యలో ముందుకు వచ్చారని తెలుస్తోంది.
సర్వీసు పరిగణలోకి తీసుకోవాలి
వీఆర్వో, వీఆర్‌ఏ పాత సర్వీసుతోపాటు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సర్వీసును పరిగణలోకి తీసుకుంటే చాలా మంది వచ్చే అవకాఽశం ఉండేది. అలాగే జీపీవోలకు సంబంధించి ప్రమోషన్ చార్ట్‌ను సైతం ప్రకటించాలి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పాత సర్వీసును పరిగణలోకి తీసుకోవాలి.
– ఆకుల రవీందర్, అధ్యక్షుడు, పూర్వపు వీఆర్వోల సంఘం
సీసీఎల్‌ఏకు పంపించాం
పాత వీఆర్వోలు, వీఆర్‌ఏలు జీపీఏలుగా వచ్చేందుకు దరఖాస్తు చేసిన వాటిని పరిశీలించాం. సీసీఎల్‌ఏ తెలిపిన ప్రకారం అర్హతలు ఉన్న వారి పేర్లను సీసీఎల్‌ఏకు పంపించాం.
– అబ్దుల్ రహమాన్, ఏవో, కలెక్టరేట్