
‘‘నేను తమిళ డైరెక్టర్‌ని కావడంతో ‘సింగిల్’ సినిమాకు తెలుగు నేటివిటీ ఉండాలని ‘సామజ వరగమన’ సినిమాకు పని చేసిన భాను–నందు తెలుగు డైలాగ్స్ రాశారు. ఈ మూవీ ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్స్‌పై అభ్యంతరాలు ఎదురయ్యాయి. అయితే ఆ డైలాగులు కేవలం వినోదం కోసం పెట్టినవే.. కావాలని అలా చేయలేదు.. ట్రోల్ అవ్వాలని కాదు’’ అని డైరెక్టర్ కార్తీక్ రాజు అన్నారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘సింగిల్’. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్ కీలకపాత్ర చేశారు.
అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ–‘‘వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌గా పోకిరి, ఒక్కడు, వర్షం, అతడు’ సినిమాలకు పని చేశాను. దర్శకత్వంపై ఆసక్తితో సూపర్ వైజర్‌గా రాజీనామా చేశాను. దర్శకుడిగా నా తొలి సినిమా ‘తిరు డాన్ పొలీస్’ను ఎస్పీ చరణ్‌గారు నిర్మించారు.
తెలుగులో సందీప్ కిషన్‌తో నా తొలి మూవీ ‘నిను వీడని నీడను నేనే’. శ్రీవిష్ణుగారికి ‘సింగిల్’ కథను 2022 వినిపించగా ఓకే అన్నారు. 2023లో గీతా ఆర్ట్స్ వారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. స్కూల్ డేస్ నుంచి లవ్‌లో పడాలనుకునే అబ్బాయికి, 28 ఏళ్ల వయసు వచ్చినా లవ్‌లో పడలేకపోతాడు. దీంతో తన చుట్టూ ఉన్నవాళ్లు ఎవరూ ప్రేమలో పడకూడదనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ. అల్లు అరవింద్‌గారితో వర్క్ చేయడం నా అదృష్టం. విశాల్ చంద్రశేఖర్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. శ్రీవిష్ణుగారి కోసం నా వద్ద మరో రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అని తెలిపారు.