
● నెలన్నరలో రెండుసార్లు ఉత్తర్వులు ● ‘ఎంఎల్‌ఎస్’ పాయిం
అంతా ఆన్‌లైన్‌లోనే అయినా..
స్టేజ్–1నుంచే అధికారులు, డీలర్లు, లబ్ధిదారుల దాక అంతా బయోమెట్రిక్‌గా వేలిముద్రలతోనే బియ్యం పంపిణీ సాగుతోంది. అయితే ఎంఎల్‌ఎస్ పాయింట్లలో రికార్డుల్లో ఓ తీరు, ఫిజికల్‌గా మరోతీరు అన్నట్లుగా మారింది. నెలవారీగా స్టాక్ రాక, స్టేజ్–1 నుంచి వస్తే స్టేజ్–2లో భద్రపర్చి ఆపై డీలర్లకు రవాణా చేయాలి. అయితే స్టేజ్–1నుంచే బియ్యం తక్కువగా వస్తున్నాయని, డీలర్లకు కోత వేస్తున్నారు. కొన్నిసార్లు స్టేజ్–1 లారీ నుంచి నేరుగా స్టేజ్–2కి హమాలీలతో ఎక్కించేస్తున్నారు. గోదాంలో వేసినట్లు బిల్లులు తీసుకుంటున్నారు. గతంలో కొందరు నేరుగా రైస్‌మిల్లర్లతోనే కుమ్మకై ్క బియ్యం రీ సైక్లింగ్ చేసిన ఘటనలు ఉన్నాయి. తర్వాత కఠిన చర్యలతో గోదాంల్లో విధులు నిర్వర్తించేందుకు జంకుతున్నారు. కానీ ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన కొందరు మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌లో అధికారులను బదిలీ చేసినా కదలడం లేదు. మండల స్థాయి స్టాక్ పాయింట్ల(ఎంఎల్‌ఎస్) ఇన్‌చార్జీలకు గత నెలన్నరలో రెండుసార్లు బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. గత మార్చి 19న జిల్లా మేనేజర్ శ్రీకళ గోదాముల పాయింట్ల ఇన్‌చార్జీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాండూర్, చెన్నూర్, కోటపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి ఇన్‌చార్జీలను బదిలీ చేశారు. ఉత్తర్వులు వచ్చినా స్థానాలు మారలేదు. కొందరు దూర భారం, వ్యక్తిగత కారణంతో ఆయ స్థానాల్లోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. గత నెల 10న మరోసారి బదిలీల ఉత్తర్వులు సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికీ మంచిర్యాలలో ఒక్కరే చేరారు. మరోవైపు గోదాముల్లో బియ్యం నిల్వల్లో తేడాలతోనూ విధుల్లో చేరేందుకు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఎందుకీ జాప్యం?
ప్రజాపంపిణీ వ్యవస్థలో స్టేజ్–1(బఫర్ స్టాక్) నుంచి స్టేజ్–2(ఎంఎల్‌ఎస్) పాయింట్లకు ఆపై డీలర్లకు బియ్యం సరఫరా అవుతాయి. జిల్లాలో మంచిర్యాల, లక్సెట్టిపేట, చెన్నూరు, కోటపల్లి, బెల్లంపల్లి, తాండూరు ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. ప్రతీ నెల 423 రేషన్‌దుకాణాలకు సగటున నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రవాణా జరగాలి. ఇక స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, వసతిగృహాలు, ఇతర అవసరాలకు ఇక్కడి నుంచే రవాణా అవుతాయి. ఈ సరఫరాలో పెద్దయెత్తున బియ్యం గోల్‌మాల్ జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మంచిర్యాల ఎంఎల్‌ఎస్ పాయింటులో క్వింటాళ్ల కొద్దీ తేడా వచ్చింది. నమ్మకస్తులైన డీలర్లకే ఎక్కువ మొత్తంలో బియ్యం పంపిస్తూ.. కొందరికీ తక్కువగా ఇస్తూ నల్లబజారుకు తరలింపుపై విచారణలు, సస్పెండ్‌లు జరిగాయి. మరోవైపు ఆయా కేసుల్లో పట్టుబడిన బియ్యం నిల్వల్లోనూ అక్రమాలు చేస్తున్నారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు సైతం కీలకంగా మారారు. ఈ కారణంగా బియ్యం నిల్వల తేడాతోనూ కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే అధికారులు జాయిన్ కావడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. గోదాం పర్సన్ ఇన్చార్జీగా బాధ్యతలు చెపట్టేముందు క్లోజింగ్ బ్యాలన్స్(మిగులు బియ్యం) లెక్క అప్పగించాలి. దీంతో కొత్తగా బాధ్యతలు చేపట్టే వారు ఆ నిల్వల తేడా తమపై పడితే అనే భయం పట్టుకుంది. తక్కువగా ఉంటే జేబుల్లో నుంచి డబ్బులు పెట్టుకుని బియ్యం నిల్వ చేయాల్సి వస్తుంది. దొడ్డు బియ్యం స్టాక్ నుంచి గత నెల సన్న బియ్యం దాకా సర్దుబాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

● నెలన్నరలో రెండుసార్లు ఉత్తర్వులు ● ‘ఎంఎల్‌ఎస్’ పాయిం