ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోంగుబాటు వైఖరే ఏపీకి ప్రత్యేక హోదా అమలు కాకపోవడానికి కారణమని కాంగ్రెస్ మండిపడింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోంగుబాటు వైఖరే ఏపీకి ప్రత్యేక హోదా అమలు కాకపోవడానికి కారణమని కాంగ్రెస్ మండిపడింది. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ మొదటి నుంచి అబద్దాలను ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తింది. ఈ మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా సిఫారసు చేయలేదని, రాజ్యాంగ సవరణ అవసరమని, హోదా చట్టంలో లేదంటూ బీజేపీ నేతలు చెప్పడం ఆంధ్రుల ఆత్మగౌరవం, హక్కును వంచన చేయడమేనని విమర్శించింది. రాష్ట్ర బీజేపీ నాయకులు హరిబాబు, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ ఇందులో భాగస్వాములు కావడం విచారకరమని పేర్కొంది.
చంద్రబాబు ప్రత్యేక హోదా కోరలేదంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్దార్థసింగ్ చెప్పిన విషయంపై చంద్రబాబు తక్షణమే స్పష్టత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వద్దని 14 వ ఆర్థిక సంఘం ఎక్కడ చెప్పిందో బీజేపీ, టీడీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. రాజ్యాంగ సవరణ అవసరమని చెబుతున్న బీజేపీ నేతలు గతంలో 11 రాష్ట్రాలకు ఏ చట్టం, రాజ్యాంగ సవరణ ద్వారా ప్రత్యేక హోదా అమలు చేశారో స్పష్టం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హోదా అమలుకు రాజకీయ కుట్రలు తప్ప రాజ్యాంగ అడ్డంకులు లేవని తెలిపింది.
ఏపీకి యూపీఏ ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇచ్చిందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం దాన్ని యథావిధిగా అమలు చేయాల్సందిగా డిమాండ్ చేసింది. చంద్రబాబు ఇప్పటికైనా రాజకీయ కుట్రలను ఆపి రాష్ట్ర ప్రయోజనాల కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి హోదాపై అనుసరించాల్సిన కార్యచరణపై చర్చించాల్సిందిగా కాంగ్రెస్ డిమాండ్ చేసింది.