Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt Negligence Taken Lives Of 7 People At Simhachalam Tragedy1
దైవ సాక్షిగా.. 'మళ్లీ భక్తులే బలి'

‘మా పిల్లలు.. బంధువులను ప్రభుత్వమే చంపేసింది! చందనోత్సవం పుణ్యమా అంటూ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో విషాదం నింపింది...!’ ‘దగ్గరుండి బంధువులందరితో తెలుగుదేశంకు ఓటు వేయించాడు. ఆ ప్రభుత్వమే మా కొడుకు.. కోడలిని పొట్టనబెట్టుకుంది. ఇంటి దిక్కును కోల్పోయాం...!’‘చేతికి అందివచ్చిన కుమారుడికి త్వరలోనే పెళ్లి చేయాలనుకున్నా...!’ ‘నాకు పెద్ద దిక్కు అనుకున్న అన్నయ్య నన్ను వదిలి వెళ్లిపోయాడు..!’ కేజీహెచ్‌ మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆక్రోశం ఇదీ!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి సర్కారు పాపాలు భక్తులకు యమపాశాలుగా మారుతున్నాయి! తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరువక ముందే.. సింహాచలంలో మరో విషాదం చోటు చేసుకుంది. నాడు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో మృత్యువాత పడగా.. నేడు వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం సింహాచలం వచ్చిన వారు నిర్జీవులుగా మారారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఏర్పాట్లలో సర్కారు నిర్లక్ష్యం ఏడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది! అత్యంత నాసిరకంగా, కాలమ్స్‌ లేకుండా ఫ్లైయాష్‌తో కట్టిన గోడ గాలివానకు కూలిపోయి భక్తులను సజీవ సమాధి చేసింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండగా వీరిలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువ దంపతులున్నారు. చనిపోయిన వారిలో అంబాజీపేటకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు(29), పత్తి దుర్గా స్వామినాయుడు (30), విశాఖ వాసులు ఎడ్ల వెంకటరావు(58), పిల్లా ఉమా మహేశ్వరరావు(30), పిల్లా శైలజ (27), గుజ్జారి మహాలక్ష్మి, పైలా వెంకట రత్నం(45) ఉన్నారు. తమవారి ప్రాణాలు తీసేందుకే నాణ్యత లేని గోడ కట్టారని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఈ విషాదం అందరినీ కలచి వేస్తుండగా విశాఖ ఎంపీ శ్రీభరత్‌ ఏమాత్రం చలించకుండా చందనోత్సవ దర్శనం చేసుకుని చల్లగా జారుకోవడంపై ప్రజలు మండిప­డుతున్నారు. తనకేమీ పట్టనట్లుగా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ విడిచి పత్తా లేకుండా పోయారు. ప్రచారం ఘనం.. ఏర్పాట్లు శూన్యంఏడాదికోసారి జరిగే సింహాచలం చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్లు ఈసారి భక్తులకు చుక్కలు చూపించాయి. కొండపైకి వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరి­స్థితి ఏర్పడింది. ఇక దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు క్యూ­లైన్లలో నరకయాతన అనుభవించారు. చందనోత్సవం వేడుకను తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేయగా నిర్వహణ ఏర్పాట్ల కోసం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అప్పన్న నిజరూప దర్శనం వేళ.. ఏర్పాట్లలో డొల్లతనం బయట పడింది. చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్ల విషయంలో మంత్రుల కమిటీ నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఏటా చందనోత్సవం రోజు వర్షం పడడం సాధారణం అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా వారం క్రితం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుంది. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయాష్‌ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు వీలుగా గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్‌ డిజైన్‌ ఇచ్చిందెవరు? అక్కడ ఉన్న షాపులు తొలగించమని ఎవరు చెప్పారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం వెదుకుతున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపైనే దృష్టిపవిత్ర చందనోత్సవం సమయంలో సైతం సింహాచలం దేవాలయానికి ప్రభుత్వం ఈవోను నియ­మించకపోవడం గమనార్హం. కేవలం ఇన్‌చార్జి ఈవోతో ఇంత భారీ కార్యక్రమాన్ని ముగించేందుకు సిద్ధమైంది. ఇన్‌చార్జి ఈవోను డమ్మీగా మార్చి ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాసుల జారీ మొదలుకుని.. టికెట్ల అమ్మకాలు, చందనోత్సవం కోసం చేపట్టిన వివిధ కాంట్రాక్టు పనులన్నింటిలోనూ అధికార పార్టీ నేతలు జోక్యం చేసు­కున్నారు. వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపై దృష్టి సారించి సాధారణ భక్తుల భద్రతను గాలికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.హడావుడిగా తాత్కాలిక గోడకేశ ఖండనం, గాలి గోపురానికి వెళ్లే భక్తులు నడిచేందుకు ఆలయం పక్కన దారి ఉంది. అక్కడి నుంచి కిందకు వెళ్లేందుకు ఉన్న మెట్ల మార్గం పక్కనే గోడ నిర్మాణం జరుగుతోంది. వాస్తవానికి ఈ గోడకు బదులుగా గతంలో రిటైనింగ్‌ వాల్‌ ఉంది. పై నుంచి మట్టి ఊడిపడితే కింద వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ రిటైనింగ్‌ వాల్‌ కాపాడేది. అయితే, ప్రసాద్‌ స్కీమ్‌లో భాగంగా పాత రిటైనింగ్‌ వాల్‌ స్థానంలో కొత్త రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాల్సి ఉంది. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి సమయం పడు­తుందని చందనోత్సవం సందర్భంగా హడావుడిగా తాత్కాలిక గోడను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తాత్కాలిక గోడ నిర్మాణ పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేశారు. పునా­దులు, కాంక్రీట్, స్టీల్, రెయిన్‌ఫోర్స్‌మెంట్‌ స్ట్రక్చర్‌ లేకుండా కేవలం ఫ్లైయాష్‌ బ్రిక్స్‌తో భారీ గోడను నిర్మించేశారు. ఇటుకకు ఇటుకకు మధ్య కనీసం సిమెంటు లేకుండా ఇసుక ఎక్కువ పాలు వేసి అత్యంత నాసిరకంగా నిర్మించారనే విషయం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. పాత రిటైనింగ్‌ వాల్‌ ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని.. కనీసం గోడ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నాణ్యతను పరిశీలించినా ఇంత పెను ప్రమాదం జరిగి ఉండేది కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ తాత్కాలిక గోడే కదా అనే నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపంతో నాసిరకంగా నిర్మించడంతో చిన్నపాటి వర్షానికే కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు.మృతుల ఫైల్‌ ఫొటోలు ముందస్తు జాగ్రత్తలేవి?లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రమాదం జరిగిన తరువాత కూడా సహాయక చర్యలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ వైపు రూ.300 టికెట్ల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఒక్క సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచలేదు. ప్రమాదం జరిగిందన్న విషయం భక్తుల హాహాకారాలు చేస్తే గానీ అధికారుల దృష్టికి వెళ్లలేదు. భారీగా భక్తులు తరలివచ్చే కార్యక్రమాలకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అంబులెన్సులు, పారా మెడికల్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదు. దుర్ఘటన తెల్లవారుజామున సుమారు 3.05 గంటలకు జరగగా అధికారులు 3.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పించారు. అప్పటికే దారుణం జరిగిపోయింది. ఇటుకల కింద ఏడుగురు భక్తులు సమాధి అయిపోయారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్దపీట!ఒకవైపు ఆలయ ఇన్‌చార్జి ఈవోను డమ్మీని చేసి అన్ని నిర్ణయాలను కలెక్టరేట్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇంటి నుంచే ప్రభుత్వం అమలు చేసింది. ఎవరికి ఎన్ని వీఐపీ టికెట్లు ఇవ్వాలనే విషయాన్ని వారే నిర్ణయించారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలకు ఎన్ని కావాలంటే అన్ని పాస్‌లు కేటాయించారు. వారికి మాత్రమే కారు పాస్‌లు మంజూరు చేశారు. బీజేపీ నేతలకు సైతం వీఐపీ, రూ.1,500 టికెట్లు దక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణ భక్తులు రూ.300, రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, కౌంటర్ల వద్దకు వెళితే లేవని తిప్పి పంపేశారు. అప్పటికే ఆ టికెట్లను తమ వారి కోసం టీడీపీ నేతలు తీసేసుకున్నారు. సాధారణ భక్తులు దేవస్థానం బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాల్సి వచ్చింది. బస్సులు తగినంతగా లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల పాటు వేచి చూడలేక పలువురు నడక మార్గంలో ఘాట్‌ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. ఘాట్‌ రోడ్‌లో నడక దారిలో కిలోమీటరు మేర బారులు తీరి కనిపించారు. ఇన్‌చార్జి ఈవోనే దిక్కు...!ఏటా చందననోత్సవంతోపాటు గిరి ప్రదక్షి­ణకు భక్తులు పోటెత్తు­తారు. అప్పన్న నిజరూప దర్శన వేడుకను తిలకించేందుకు ఉత్త­రాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఈవోదే ప్రధాన బాధ్యత. అయితే చందనో­త్సవం వేళ రెగ్యులర్‌ ఈవోను ప్రభు­త్వం నియమించలేదు. రెగ్యులర్‌ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు 3 నెలలు సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి ఇన్‌చార్జి ఈవోగా కె.సుబ్బారావు కొనసాగుతు­న్నారు. ఏప్రిల్‌ 30న చంద­నోత్సవం ఉందని తెలిసినా రెగ్యులర్‌ ఈవోను నియమించపో­వడం ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల వివరాలు..పవిత్ర క్షేత్రాల్లో వరుస అపచారాలుపవిత్ర పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా వరుసగా చోటు చేసుకుంటున్న అపచా­రాలు, అనూహ్య ఘటనలు భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్ట బయలు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రభుత్వమే ‘కల్తీ’ ప్రచారానికి తెర తీయడం మొదలు.. వైకుంఠ ఏకాదశి ఏర్పా­ట్లలో వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం.. టీటీడీ గోశాలలో గోవుల మృతి ఘటనను కప్పిపు­చ్చుతూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించడం.. దశాబ్దాలుగా హైందవ ధర్మం, దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన కాశీ నాయన ఆశ్రమాన్ని ప్రభుత్వమే నేలమట్టం చేయడం.. శ్రీకూర్మం గుడిలో తాబేళ్లు చనిపోవడం లాంటి ఘటన­లన్నీ భక్తుల మనోభావాలను కలచి వేస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు సర్కారు కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో పలు ఆలయాలను నేల కూల్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఓ గోడ కూడా కట్టలేక అప్పన్న సాక్షిగా భక్తుల ప్రాణాలను బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలుసాక్షి, న్యూఢిల్లీ: సింహాచ­లం క్షేత్రం వద్ద చోటుచేసు­కున్న దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మనో­ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని స్పందిస్తూ ‘విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తాం’ అని ప్రకటించారు.రాహుల్‌ విచారంఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Union Minister Ashwini Vaishnaw Reveals about Caste Census2
కులగణనకు ఓకే..

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఎంతోకాలంగా డిమాండ్‌ చేస్తున్న కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో భాగంగా కులగణనను సైతం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 246 ప్రకారం ‘గణన’అనేది కేంద్ర జాబితాలో 69వ అంశంగా ఉందని, అందువల్ల జనగణన, కులగణన బాధ్యత పూర్తిగా కేంద్రం పరిధిలోనిదని స్పష్టంచేశారు. కొన్ని రాష్ట్రాలు తమకు అధికారాలు లేకపోయినా సర్వేల పేరుతో కులాల లెక్కలను అశాస్త్రీయంగా సేకరించాయని ఆరోపించారు. ఆ సర్వేల వల్ల గందరగోళం ఏర్పడి సమాజంలో చీలికలు రాకూడదన్న ఉద్దేశంతోనే పక్కా శాస్త్రీయంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కులగణనకు కాంగ్రెస్‌ ఎప్పుడూ వ్యతిరేకమే కులగణనకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమేనని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆరోపించారు. గతంలో కులగణనను కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ వచ్చాయని తెలిపారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎప్పుడూ కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చాయి. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి నిర్వహించిన ఏ జనాభా గణనలోనూ కులగణనను చేర్చలేదు. 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ కులగణన అంశాన్ని కేబినెట్‌లో పరిశీలిస్తామని లోక్‌సభకు హామీ ఇచ్చారు. ఈ అంశంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేస్తే చాలా రాజకీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా అభిప్రాయాలు తెలిపాయి. అయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణనకు బదులుగా సోషియో ఎకనామిక్‌ అండ్‌ క్యాస్ట్‌ సెన్సెస్‌ (ఎస్‌ఈసీసీ) సర్వే నిర్వహించాలని నిర్ణయించింది’అని మండిపడ్డారు. రాజకీయ సాధనంగా వాడుతున్నారు.. కులగణనను ప్రతిపక్ష ఇండియా కూటమి రాజకీయ సాధనంగా వాడుకుంటోందని అశి్వనీవైష్ణవ్‌ ఆరోపించారు. ‘కొన్ని రాష్ట్రాలు కుల సర్వేలను బాగానే నిర్వహించాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం పారదర్శకత లేకుండా పూర్తిగా రాజకీయ కోణంలో నిర్వహించాయి. ఇటువంటి సర్వేలు సమాజంలో సందేహాలను లేవనెత్తాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దేశంలోని సున్నితమైన సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల చెదిరిపోకుండా కాపాడటానికే సర్వేలకు బదులుగా కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని సీసీపీఏ నిర్ణయించింది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ వర్గానికి ఇబ్బంది కలిగించకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది’అని మంత్రి గుర్తుచేశారు. దేశంలో ఏ కులం జనాభా ఎంత ఉందో తెలుసుకునేందుకు కులగణన నిర్వహించాలని కాంగ్రెస్‌సహా పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌చేస్తూ వస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ అంశం ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఒకటిగా నిలిచింది. తమ ఒత్తిడి కారణంగానే కేంద్రం కులగణనకు నిర్ణయం తీసుకుందని, ఇది సంపూర్ణంగా తమ విజయమని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు పేర్కొన్నాయి. మొదట్లో అన్ని కులాల డేటా.. మనదేశంలో జనాభా లెక్కల సేకరణ బ్రిటీష్‌ పాలనాకాలంలో 1881లో మొదలైంది. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా ప్రభుత్వం నియమించే ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. ఈ జనగణనలో ప్రజల సంఖ్యతోపాటు వారి ఆర్థిక స్థితి, జనాభా పెరుగుదల రేటు, మహిళలు– పురుషుల సంఖ్య, లింగ నిష్పత్తి, జనన– మరణాల రేటు వంటి సకల వివరాలను రికార్డు చేస్తున్నారు. నిజానికి మొదటి జనగణనతోపాటే.. అంటే 1881లో తొలిసారి నిర్వహించిన జనగణనలో కులగణన కూడా నిర్వహించారు. 1931 వరకు ఈ విధానం కొనసాగింది. ఆ తర్వాత జనగణన నుంచి కులగణనను తప్పించారు. కానీ, ఎస్సీ, ఎస్టీల సంఖ్యను మాత్రం లెక్కిస్తూ వస్తున్నారు. దీంతో ఓబీసీ, ఓసీల జనాభా ఎంత ఉందన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. దేశంలో చివరి జనగణన 2011లో జరిగింది. 2020లో నిర్వహించాల్సిన జనగణనను కోవిడ్‌–19 కారణంగా వాయిదా వేశారు. త్వరలోనే జనగణన నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అందులోనే కులగణనను చేర్చాలని తాజాగా నిర్ణయించింది. మనదేశంలో జనగణన సుదీర్ఘ ప్రక్రియ. ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ మొదలు.. పూర్తి డేటాను ప్రకటించటానికి దాదాపు 18 నెలల సమయం పడుతుంది.

YS Jagan anger over Simhachalam incident3
చంద్రబాబే బాధ్యుడు: వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. దాదాపు ఏడాది కాలంగా గుడులు, గోపురాల్లో జరుగుతున్న ఘటనలన్నింటిలో చంద్రబాబే అసలు దోషి అని మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి, చందనోత్సవం ఎప్పుడు జరుగుతాయో ముందే తెలిసినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ధ్వజమెత్తారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు, ఇప్పుడు ఇక్కడ చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు చనిపోవడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కళ్లకు కడుతోందని చెప్పారు. సింహాచలం ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. మొత్తం ఏడుగురు చనిపోగా, ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. మృతులు పిల్లా ఉమామహేశ్వరరావు, పిల్లా శైలజ కుటుంబ సభ్యులను చంద్రంపాలెం వద్ద ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింహాచలంలో చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో.. ఎంత మంది భక్తులు వస్తారో తెలిసినా కనీస ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ముఖ్యమైన గోడను ముందే ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. 70 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తున గోడను నాలుగు రోజుల్లో నిర్మాణం పూర్తి చేశారని, ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ధ్వజమెత్తారు. గాలికి ఫ్లెక్సీ ఊగినట్లు ఈ గోడ కూలిపోయే ముందు ఊగిందని భక్తులు చెబుతున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం అవుతోందన్నారు. ‘ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? మంత్రుల పర్యవేక్షణ ఏమైంది? ఐదుగురు సభ్యుల కమిటీ ఏం చేసింది? టెండర్లు పిలవకుండానే ఇంత పెద్ద గోడ ఎలా నిర్మించారు? కాంక్రీట్‌ గోడ (రీ ఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ వాల్‌) కట్టాల్సిన చోట ఫ్లైయాష్‌ ఇటుకలతో నిర్మించారు. ఎక్కడా కాలమ్స్‌ లేవు. ఏ మాత్రం నాణ్యత పాటించ లేదు. ఇలాగైతే ఆ గోడ ఎలా నిలబడుతుంది? రెండు రోజుల క్రితం పూర్తయిన ఈ గోడ పక్కనే అంత మంది భక్తులను ఎలా నిలబెట్టారు? ఫలితంగా ఆ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం దారుణం’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. బాబు పాలనలో అన్నీ దారుణాలే.. చంద్రబాబు పాలన ప్రారంభమైనప్పటి నుంచి అన్నీ దారుణాలే జరుగుతున్నాయి. రాజకీయాల కోసం తిరుమల శ్రీవారి ప్రసాదంపై దు్రష్పచారం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడం వల్లే తిరుపతి­లో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయారు. భద్రతా సిబ్బందిని చంద్రబాబు పర్యటనకు కుప్పం పంపారు. అదే సమయంలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వచి్చన భక్తులందరినీ ఓ పార్కులోకి పంపారు. వారందరినీ ఒక్కసారిగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగింది. గోశా­లలో ఆవులు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. వైఎస్సార్‌ జిల్లా కాశినాయన క్షేత్రాన్ని కలెక్టర్‌ సమక్షంలోనే బుల్డోజర్లతో కూల్చి వేశారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. చంద్రబాబు గత పాలనలో గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన ప్రచార ఆర్భాటం కోసం భక్తులను గుంపుగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు వస్తారు.. ఎంక్వైరీ వేస్తున్నామంటారు. తీరా ఎలాంటి చర్యలూ ఉండవు. ఎందుకంటే ఆయా ఘటనలన్నింటికీ చంద్రబాబే బాధ్యుడు కాబట్టి. తిరుపతి క్యూలైన్లలో తొక్కిసలాట ఘటనలో తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యలు తీసుకున్నారు. పైగా వాటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన ఏ అధికారికైనా ఉద్యోగాలు పోతాయి.. యూనిఫాం పోతుందని ఒంట్లో భయం ఉండాలి. అప్పుడే క్రమశిక్షణ ఉంటుంది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం ఆగిపోతుంది. పశ్చాత్తాపం ఉండాలి» ఈ ఫొటో చూడండి.. ఎక్కడైనా కాల­మ్స్‌ కనిపిస్తున్నాయా చెప్పండి? 10 అడుగుల ఎత్తు.. 70 అడుగుల పొడవున్న గోడ కూలిపోయేటప్పుడు ఫ్లెక్సీ మాదిరిగా ఊగిందని చెబుతున్నారు. ఏం నిర్మాణం చేశారు? ఏ రకంగా పని చేయిస్తున్నారు? జగన్‌ ఇచ్చే లోపే ఆ కుటుంబాలకు రూ.కోటి ఇచ్చి ఆదు­కోవాలని కోరుతున్నా. బాధ్యులపై, బాధ్య­త తీసుకున్న మంత్రులపై, ఆల­యాన్ని నడిపే బాధ్యతలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పు­డే ఇటువంటివి పునరావృతం కావు.» ప్రతీదీ డైవర్షన్‌ పాలిటిక్సే.. ఎక్కడా కూడా తప్పు చేశామన్న పశ్చాత్తాపం వీళ్లలో కనిపించడం లేదు. చంద్రబాబులో అది ఎక్కడా కనిపించదు. నేను ఇక్కడకు వ­స్తున్నానని తెలుసుకుని మృతుల కుటుంబాలకు రూ.­25 లక్షల చొప్పున పరిహారం, ఒక ఉద్యోగం ప్రకటించారు. ప్రభుత్వం అనేది ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలి. ప్రజలకు తోడు­గా ఉండాలి.» ఏదైనా ప్రమా­దం జరిగి ప్రజలు చనిపోతే.. ప్రభుత్వంలో ఉన్నవారు పశ్చాత్తాపం చె­ందాలి. మనం ఆ కుటు­ంబానికి ఏం చేస్తున్నామనేది మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. మన ప్రభుత్వంలో ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో ఒక్కొ­క్క కుటుంబానికి రూ.కోటి ఇచ్చి ఆదుకున్నాం. ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈ ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తున్నావ్‌ చంద్రబాబూ? నేను ఒకటే చెబుతున్నా.. మీరు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. ఈ కుటుంబాల్ని గుర్తు పెట్టుకు­ంటున్నాను. మేం మళ్లీ అధికారంలోకి వచి్చన తర్వాత రూ.కోటికి మిగిలిన బ్యాలెన్స్‌ నేను ఇప్పిస్తాను. » ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్‌నాథ్, భీమిలి ఇన్‌చార్జ్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మె­ల్సీలు వరుదు కళ్యాణి, తలశిల రఘురాం, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, మాజీ ఎంపీ బొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్ కుమార్‌ పాల్గొన్నారు.ఈ గోడ ఎవరు కట్టారో తెలియదట! ప్రతి చోటా నిర్లక్ష్యమే. ప్రతిచోటా డైవర్షన్‌ పాలిటిక్సే. డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఏ స్థాయిలో దిగజారిపోయాయో మంత్రుల ప్రకటనలు చూస్తేనే అర్థమవుతోంది. సింహాచలం ఘటనలో మంత్రులు మొదటగా ఏమన్నారంటే.. ఈ గోడ ఎవరి హయాంలో.. ఎవరు కట్టారో చూడాలని మాట్లాడారు. వారి తీరు చూస్తే.. వేరే వాళ్లపై నెట్టేసేందుకేనని అర్థమవుతోంది. వాళ్ల హయాంలోనే వారం రోజుల క్రితమే గోడ కట్టారని ఎప్పుడైతే తెలుసుకున్నారో.. గోడ పిల్లర్లతో కట్టారో.. సిమెంట్‌తో కట్టారో.. బ్రిక్స్‌తో కట్టారో అనేది మాకు తెలీదని మాట్లాడుతున్నారు.ఏమీ తెలుసుకోకపోతే.. ముందస్తు ఏర్పాట్ల పేరుతో మంత్రుల కమిటీ పేరుతో ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీ సమక్షంలోనే ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ గోడ ఎందుకు కట్టారు? 70 అడుగుల పొడవు.. 10 అడుగుల ఎత్తుతో ఒక్క కాంక్రీట్‌ పిల్లర్‌ కూడా లేకుండా గోడ ఎందుకు కట్టించారు? చందనోత్సవం జరిగిన ప్రతిసారీ వర్షం పడింది. కొత్త గోడ అని తెలిసి.. వర్షం పడుతుందని తెలిసినప్పుడు ఈ గోడ పక్కన ఎందుకు భక్తుల్ని ఉంచారు?అండగా ఉంటాం..మృతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ భరోసా రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని హామీమధురవాడ (విశాఖ): చందనోత్సవంలో గోడ కూలి మృతి చెందిన ఉమా మహేశ్వరరావు, శైలజ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం మధురవాడ చంద్రంపాలెం ఎన్‌జీవోస్‌ కాలనీ శ్మశాన వాటిక వద్ద పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైఎస్‌ జగన్‌ను చూసి మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన బాధితులతో మాట్లాడారు. వారు ఎన్ని గంటలకు దేవస్థానానికి వెళ్లారు.. ప్రమాదం ఎలా జరిగింది.. పిల్లలు ఎంత మంది.. పరిహారం ఎంత ఇస్తున్నారు.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.తాము రూ.కోటి అడిగామని, రూ.25 లక్షలు, ఉద్యోగం ఇస్తామని మంత్రులు చెప్పారన్నారు. అది ప్రభుత్వ ఉద్యోగమా.. ప్రైవేటు ఉద్యోగమా అని అడగ్గా.. ప్రభుత్వ ఉద్యోగమేనని చెప్పారు. తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా పోషించే వ్యక్తి చని పోయాడని, మూడేళ్ల క్రితం అల్లుడు కూడా చనిపోయాడని, చెల్లి పిల్లలను కూడా తమ కొడుకే సాకుతున్నాడని ఇప్పుడు అతడు కూడా చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు అప్పలనాయుడు, శాంతి గుండెలవిసేలా రోదిస్తూ చెప్పారు. తాము అండగా ఉంటామని, రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. బాధితుల తరఫున గట్టిగా మాట్లాడతామని పేర్కొన్నారు.

Sakshi Editorial On Modi Govt Strategy for Pakistan4
పదునైన వ్యూహంతో...

ప్రతీకారం దిశగా ఒక్కో అడుగే పడుతోంది. పహల్గాం సమీపంలో వారం రోజుల క్రితం 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల వేటకు రంగం సిద్ధమవుతోంది. దాడి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరగాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను త్రివిధ దళాధిపతులకు ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం తీసుకున్న నిర్ణయం అసాధారణమైనది. దాంతోపాటు జాతీయ భద్రతా సలహా బోర్డు(ఎన్‌ఎస్‌ఏబీ)ను బుధవారం పునర్వ్యవస్థీకరించటం కూడా కీలక పరిణామం. ‘రా’ మాజీ చీఫ్‌ అలోక్‌ జోషి సారథ్యంలో ఏర్పాటైన ఈ బోర్డు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌కు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తుందంటు న్నారు. పదునైన వ్యూహం, పక్కా ప్రణాళిక, మెరికల్లాంటి దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించటం వగైరాలన్నీ ఇలాంటి సమయాల్లో అత్యంత అవసరం. ఇప్పటికే పహల్గాం మారణకాండను తక్కువ చేసి చూపటానికి పాకిస్తాన్‌ చేయాల్సిందంతా చేస్తోంది. దాదాపు 45 యేళ్లుగా దాని వ్యూహం ఇదే. ఒకపక్క ఎల్‌ఓసీలో వరసగా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ, సరిహద్దుల్లో నిఘా రాడార్లు, యుద్ధ సామగ్రి తరలిస్తూ మరోపక్క అమెరికా తదితర దేశాలముందు తన అమాయ కత్వాన్ని చాటుకోవటానికి ప్రయత్నిస్తోంది. మారణకాండ గురించి ‘నమ్మదగ్గ సమాచారం’ ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పటం ఇప్పటి షెహబాజ్‌ సర్కార్‌కి మాత్రమే కాదు... కుట్రపూరితంగానో, ఎన్నికల మాటున సైన్యం ప్రాపకంతోనో అధికారాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్న పాక్‌ అధినేతలందరికీ అలవాటైన విద్య. దీనికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట పడటం తప్పనిసరి. అందుకే ప్రభుత్వ తాజా నిర్ణయం అన్నివిధాలా ఆహ్వానించదగ్గది. మన సహనాన్ని చేతగానితనంగా, మన సుహృద్భావాన్ని అశక్తతగా భావించటం పాకిస్తాన్‌కు అలవాటైంది. మొన్న జరిగిన మారణకాండ అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రతీకారేచ్ఛతో రగులుతున్నారు. కేవలం దాన్ని సంతృప్తిపరచటమే అంతిమ లక్ష్యం కారాదు. తాజా దాడిలో పాకి స్తాన్‌ సైన్యంలో పారా కమాండోగా పనిచేసిన హషీం మూసా అనే ఉగ్రవాది పాల్గొనటాన్నిబట్టి చూస్తే ఐఎస్‌ఐ పాత్రవుందని అర్థమవుతోంది. ఇలాంటివి నివారించాలంటే సరిహద్దుల్లో పటిష్టమైన నిఘావుండాలి. దాంతోపాటు వేర్వేరు సమయాల్లో జరిగిన దాడుల స్వభావాన్ని అధ్యయనం చేయాలి. నిరుడు అక్టోబర్‌లో మధ్య కశ్మీర్‌లో ఏడుగురు కార్మికులను పొట్టనబెట్టుకున్నది మొదలు మొన్నటి పహల్గాం మారణకాండ వరకూ జరిగిన నాలుగు ఉదంతాల్లో కీలకపాత్ర పోషించింది మూసాయే అంటున్నారు. అదే నిజమైతే మన నిఘా వ్యవస్థ సక్రమంగా లేదని భావించాలి. మొన్న విపక్షాలతో జరిగిన సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిఘా వైఫల్యం ఉన్నదని అంగీకరించింది. కనుక పాకిస్తాన్‌ ప్రాపకంతో చెలరేగుతున్న ఉగ్రవాదులను గురిచూసి కొట్టటానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టే మన నిఘా వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేయాలి. జవాబుదారీ తనాన్ని నిర్ధారించాలి. ఉగ్రవాదులు మన లోటుపాట్లేమున్నాయో చూసుకునే దాడులకు దిగుతారు. ఆ పని మన నిఘా వర్గాలు చేయగలిగితే ఉగ్రవాదుల్ని నిరోధించటంతోపాటు వారిని చాకచక్యంగా పట్టి బంధించటానికి కూడా వీలవుతుంది. అప్రమత్తత లోపించటంవల్ల నిరాయుధ పౌరుల ప్రాణాలు మాత్రమేకాదు... స్థానికుల జీవిక కూడా దెబ్బతింటుంది. తాజాగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కశ్మీర్‌లోని 50కి పైగా పర్యాటక స్థలాలను మూసివేసినట్టు అధికారులు ప్రకటిస్తున్నారు. అంటే కొన్ని వేల కుటుంబాల ఉపాధి దెబ్బతింటుంది. మున్ముందు తెరిచినా అటువైపు వెళ్లేందుకు పర్యాటకులు జంకుతారు గనుక ఆ రంగం కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. అన్నిటికన్నా మన నేతలు మాటలూ, చేతలూ అదుపులో పెట్టుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం. రెండు పక్షాలు పరస్పరం తలపడుతున్నప్పుడు ఎవరి బలం ఎక్కువన్న దాన్నిబట్టి ఫలితం ఆధారపడి వుండదు. ఎవరు కలిసికట్టుగా ఉన్నారో, ఎవరు మెరుగైన వ్యూహం పన్ను తున్నారో, ఎవరి ఎత్తుగడలు సరైనవో వారినే విజయం వరిస్తుంది. జరిగిన భద్రతాలోపాలకు బాధ్యులెవరో నిర్ణయించాలని అనటం, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరటం వరకూ ఎవరికీ అభ్యంతరం ఉండదు. నిర్మాణాత్మకమైన విమర్శలూ ఆహ్వానించదగ్గవే. కానీ ప్రధాని చిత్రాన్ని ఒక పార్టీ తప్పుడుగా చిత్రిస్తే, మరొకరు దానికి జవాబుగా విపక్షనేత వెన్నుపోటుకు సిద్ధంగా వున్నట్టు మరో చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కాంగ్రెస్‌ నేతల్ని పాకిస్తాన్‌ పొమ్మంటూ ఉచిత సలహా ఇచ్చారు. 26 మంది అమాయకుల ఉసురు తీసిన ఉగ్రవాదులను ఏరిపారేయటానికి ఏం చేయాలన్న అంశంలో మన భద్రతా వ్యవస్థ తలమునకలై వుంది. ఈ పరిస్థితుల్లో ఐక్యతను చాటి ఆదర్శంగా వుండాల్సిన నాయకులు దిగజారుడు పోస్టులతో అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా దేశభక్తి అనే భ్రమలో వీరు కాలక్షేపం చేస్తున్నారు. వీరిని చూసి అనుచరగణాలు మరింత రెచ్చిపోతున్నాయి. మతం పేరిట, ప్రాంతం పేరిట విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఫలితంగా వేర్వేరు ప్రాంతాల్లోని కశ్మీరీ చిరువ్యాపారుల పైనా, విద్యార్థుల పైనా దాడులు జరుగుతున్నాయి. ఇదంతా మనపై మనమే యుద్ధం చేసుకోవటం. శత్రువుపై సమష్టిగా పోరాడాల్సిన సమయంలో బాధ్యత మరిచి అంతర్గత కలహాలకు దారితీసేలా ప్రవర్తించటం, పైస్థాయి నేతల ప్రాపకానికి వెంపర్లాడటం అత్యంత హీనం. పాపం. సక్రమంగా మాట్లాడటంరాని నేతలు కొన్నాళ్లయినా నోరుమూసుకోవటం ఉత్తమం.

State Home Minister Anitha reached out to the victims for signatures5
జగన్‌ వస్తున్నారని తెలిసి ప్రభుత్వంలో వణుకు

ఆరిలోవ/డాబాగార్డెన్స్‌: సింహాచలం ఘటన గురించి తెలిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖకు బయలుదేరారన్న సమాచారం అందుకున్న ప్రభుత్వం కలవరపాటుకు గురైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని వణికిపోయింది. వైఎస్‌ జగన్‌ కేజీహెచ్‌ మార్చురీకి చేరుకునేలోపే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించేందుకు రాష్ట్ర హోం మంత్రి అనిత పడరాని పాట్లు పడ్డారు. పోస్టుమార్టంకు అంగీకరిస్తూ సంతకాలు చేయాలంటూ బాధిత కుటుంబాల కాళ్లావేళ్లాపడ్డారు.శవపంచనామాకు సహకరించాలని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంతోపాటు రూ.కోటి పరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మొరపెట్టుకున్నారు. తమను నమ్మాలని ప్రాధేయపడ్డారు. అయినా మృతుల కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వారం రోజుల్లోనే నాణ్యత లేకుండా గోడ నిర్మించి తమ కుటుంబీకుల మరణానికి కారణమైన ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదంటూ భీష్మించారు. రాతపూర్వకంగా ఇవ్వాలని, లేదా మీడియా ముందు స్పష్టంగా ప్రకటించాలని తేల్చిచెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని హోంమంత్రి అనిత వైఎస్‌ జగన్‌ వచ్చేలోపే పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించాలని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.శివానంద్‌తోపాటు పోలీసు అధికారులను ఆదేశించారు. వారి చేత మృతుల కుటుంబాలపై తీవ్ర ఒత్తిడి చేయించారు. మృతులు భీమిలి నియోజకవర్గం వారు కావడంతో వారిని ఒప్పించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుయాయులనూ బతిమిలాడారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు కూడా మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా యత్నించారు. చివరకు సంతకాలు లేకుండానే మృతదేహాలకు పోస్టుమా­ర్టం పూర్తిచేయించారు. సింహాచలం ఘటన గురించి విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌ పట్టించుకోలేదు. సింహాచలం దేవస్థానం వైపు కన్నెత్తి చూడలేదు.

Sakshi Guest Column On Origins of the Hindi language6
హిందీ భాష మూలాలు ఏమిటి?

ఇండియా అనే పేరు వెనుక చాలా చరిత్ర ఉంది. ఈ పదం ఇండస్‌ నుంచి వచ్చింది. ప్రాచీన పర్షియన్‌ పదం అయిన హిందుష్‌ నుంచి ఇండస్‌ ఆవిర్భవించింది. ఇది సంస్కృత పదం సింధుకు రూపాంతరం. అయితే, ప్రాచీన గ్రీకులు ఇండియన్స్‌ను ఇండోయి అని వ్యవహరించేవారు. ఇండోయి అంటే వారి భాషలో ఇండస్‌ ప్రజలు అని అర్థం. ఇండస్‌ రివర్‌ అంటే స్థానికులు ఎప్పటి నుంచో పిలుచుకునే సింధూ నదే. మన దేశానికి భారత్‌ అనేది రాజ్యాంగ గుర్తింపు పొందిన అధికారిక నామం. ఈ భౌగోళిక పదం అనేక భారతీయ భాషల్లో కొద్ది మార్పులు చేర్పులతో వ్యవహారంలో ఉంది. హిందూ ధర్మ గ్రంథాలు చెప్పే పౌరాణిక చక్రవర్తి భరతుడి పేరు నుంచి భారత్‌ వచ్చింది.అధికార భాషగా పర్షియన్‌హిందుస్థాన్‌ వాస్తవంగా పర్షియన్‌ పదం. అంటే ‘హిందువుల భూమి’ అని అర్థం. 1947 వరకూ ఉత్తర భారతం, పాకిస్తాన్‌ వ్యాపించి ఉన్న ప్రాంతాన్ని ఈ పేరుతో పిలిచేవారు. ఇండియా మొత్తాన్నీ కలిపి చెప్పేందుకు కూడా అప్పుడప్పుడూ ఈ పదం ఇప్పటికీ వాడతారు.ఢిల్లీ సుల్తానుల, మొఘలుల సామ్రాజ్యాల్లో, వారి వారసత్వపు రాజ్యాల్లో పర్షియన్‌ అధికారిక భాషగా ఉండేది. కవిత్వం, సాహిత్యం కూడా ఈ భాషలోనే ఉండేవి. చాలా మంది సుల్తానులు, నాటి కులీనులు పర్షియన్‌ ప్రభావిత తురుష్కులే. మధ్య ఆసియా నుంచి వచ్చిన వీరి మాతృభాషలు తురుష్క భాషలు. మొఘలులు కూడా పర్షియన్‌ ప్రభావిత మధ్య ఆసియా నుంచే వచ్చారు. కాకుంటే వీరు తొలినాళ్లలో ప్రధానంగా చగతాయి తురుష్క భాష మాట్లాడేవారు. తర్వాత్తర్వాత పర్షియన్‌కు పరివర్తనం చెందారు.నార్త్‌ ఇండియాలోని ముస్లిం ఉన్నత వర్గాలకు పర్షియన్‌ ప్రాధాన్య భాష అయ్యింది. మొఘల్, ఇండో–పర్షియన్‌ చరిత్ర కారుడైన ప్రముఖ పండితుడు ముజఫర్‌ ఆలమ్‌ చెప్పే ప్రకారం, ఈ పర్షియన్‌ భాష అక్బర్‌ సామ్రాజ్యంలో సామాన్యుల భాషగా మారింది. ఎందుకంటే, అన్ని మతాల వారు దీన్ని మాట్లాడేవారు. భాష సరళంగా ఉండేది. దీంతో, పలు రాజకీయ సామాజిక ప్రయోజనాలు ఆశించి అక్బర్‌ దీన్ని విశేషంగా అభివృద్ధి చేశాడు. పరాయి భాషల భారతీయ అపభ్రంశాల కలయికతో నాడు ఏర్పడిన ఒక మాండలికమే ఇవ్వాళ్టి ఉర్దూ, హిందీ, హిందుస్థానీ భాషలకు మూలం. బ్రిటిష్‌ వారి రాకతో...మొఘలుల కాలం నుంచి బ్రిటిష్‌ పాలన వరకు పర్షియన్‌ భాష మనుగడలో ఉంది. ‘గొప్ప మొఘలుల’లో చిట్టచివరి వాడుగా చరిత్రకారులు భావించే ఔరంగజేబ్‌ చక్రవర్తి 1707లో చనిపోయే వరకు కూడా ఈ ప్రాభవం కొనసాగింది. ఆ తర్వాత మొఘల్‌ సామ్రాజ్యం బలహీనపడింది. 1739లో ఢిల్లీపై నాదిర్‌ షా దండ యాత్ర చేయడం, దక్షిణ ఆసియాలో క్రమేపీ యూరప్‌ పట్టు బిగియటం... ఈ పరిణామాల నేపథ్యంలో పర్షియన్‌ భాష,సంస్కృతి క్షీణదశలోకి ప్రవేశించాయి. ఏమైనప్పటికీ, ఆ తర్వాత కూడా సిక్కు మహారాజా రంజిత్‌ సింగ్‌ (పాలనా కాలం 1799– 1837) సహా దక్షిణ ఆసియాలోని అనేక మంది పాలకుల ప్రాంతీయ ‘సామ్రాజ్యాల్లో’ దీనికి రాజాదరణ లభించింది. చిట్టచివరకు, 1839లో ఈ భాషకు మృత్యు ఘంటికలు మోగాయి. బ్రిటిష్‌ పాలకులు పర్షియన్‌ భాషను పరిపాలన, విద్యా బోధన వ్యవస్థల నుంచి తొలగించారు. నామమాత్రపు చిట్టచివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ను బ్రిటిష్‌ వారు అధికారపీఠం నుంచి కూలదోశారు.మూలాలు ఏవైనప్పటికీ ఆర్య ద్రావిడ కలయిక నుంచి పుట్టిన సంస్కృతం స్థానాన్ని అలా పర్షియన్‌ ఆక్రమించింది. ఇక్కడ విశేష మేమిటంటే, లేత వర్ణ చర్మం (లైట్‌ స్కిన్‌) కలిగిన ఒక ఉన్నత వర్గం భాషను మరో ‘లైట్‌ స్కిన్‌’ ఉన్నత వర్గం భాష తోసి రాజంది. ఉత్తర భారత దేశంలో ఈ కులీన భాషలు చివరకు ప్రాంతీయ మాండలీ కాలతో కలిసిపోయి హిందావి లేదా ఉర్దూ అనే ఒక సామాజిక భాషగా రూపొందాయి. నిజానికి విభిన్న భాషలేనా?హిందీ, ఉర్దూలు రెండు విభిన్న భాషలు అన్న భావనకు 19వ శతాబ్దపు ప్రథమార్ధంలో ఫోర్ట్‌ విలియం కాలేజ్‌ అధ్యయనాల్లో స్పష్టత వచ్చిందని ‘ఇండియాలో భాష గురించిన సత్యం’ (ట్రూత్‌ అబౌట్‌ లాంగ్వేజ్‌ ఇన్‌ ఇండియా) అనే వ్యాసం (ఈపీడబ్ల్యూ, డిసెంబర్‌ 14, 2002)లో సంతోష్‌ కుమార్‌ ఖారే పేర్కొన్నారు. పర్షియన్‌/అరబిక్‌ నుంచి ఉర్దూ... సంస్కృతం నుంచి హిందీ తమ భాషా సాహిత్యాలను అరువు తెచ్చుకున్నాయని హిందీ పుట్టుక గురించి వివరించారు. కొత్తగా పుట్టుకొచ్చిన మధ్యతరగతి పట్టణ హిందూ, ముస్లిం/కాయస్థ వర్గాల సంకుచిత ప్రయోజనాల పోటీని అవి ప్రతిబింబించాయి. అసలైన బాధాకరమైన విషయం వ్యాసం ముగింపులో ఉంటుంది. అదేమిటంటే, ‘‘ఆధునిక హిందీ (లేదా ప్రామాణిక భాష) అనేది ఈస్ట్‌ ఇండియా కంపెనీ సృష్టి. ఉర్దూ వ్యాకరణం,శైలిని పరిరక్షిస్తూనే దాన్ని విదేశీ పదాల నుంచి, గ్రామ్యాల నుంచి ప్రక్షాళన చేసి, వాటి స్థానంలో సంస్కృత సమానార్థకాలను చేర్చింది.’’హిందీకి ప్రధాన ప్రచారకర్త పాత్ర పోషిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేడు ఇండియాలో ఇంగ్లిష్‌ మాట్లాడేవారిని ‘మెకాలే పిల్లలు’ అంటూ ఎగతాళి చేసి ఆనందం పొందుతోంది. ఇదొక విషాదం!మోహన్‌ గురుస్వామి వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com

Officials not informing family members about Simhachalam incident7
మృతదేహాల వెలికితీతలోనూ నిర్లక్ష్యమే

సాక్షి, విశాఖపట్నం: సింహగిరిపై ఊహకందని విషాదం సంభవించింది. గోడ కూలిన విషయం సింహగిరి మొత్తం దావానలంలా వ్యాపించింది. అదే సమయంలో ఆలయ అనువంశి­క ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు, మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శనాల కోసం బారులుతీరారు. శిథిలాల కింద భక్తులు చిక్కుకున్న విషయం తెలిసినా.. తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. తమ వారు రూ.300 టికెట్‌ తీసుకుని దర్శనం కోసం వెళ్లారని, వారి సమాచారం కావాలంటూ భక్తులు కోరుతున్నా సమాధానం చెప్పే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఈ ఘటన బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తపడేందుకు యత్నించారే తప్ప.. వీలైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేసి పరిస్థితి చక్కదిద్దుదామన్న ఆలోచన అధికా­రులు, ప్రజాప్రతినిధులకు రాలేదు. వీఐపీ దర్శన మార్గానికి 50 మీటర్ల దూరంలో గాలిగోపురానికి సమీపంలో దుర్ఘటన జరిగింది. ప్రజాప్రతినిధులు వెళ్తున్న సమయంలోనే పోలీసు­లు, వైద్య సిబ్బంది అటుగా పరుగులు తీశారు. దాన్ని చూ­సిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం జరిగిందని వాకబు చేశారు. విషయం తెలుసుకుని ఆగకుండా దర్శనానికి వెళ్లిపోయారు.కంట్రోల్‌ రూమ్‌ ఎక్కడ? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధిత కుటుంబాల వారు సమాచారం కోసం ఎదురు చూస్తుంటారు. ఇందుకోసం వెంటనే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తుంటారు. కానీ.. ప్రమాదం సంభవించి ఏడుగురు మృత్యువాతపడినా అధికారుల్లో కనీస చలనం లేదు. తమ వారు ఎక్కడున్నారో.. ఏమైపోయారో తెలీక.. చాలామంది భక్తులు నానాఅవస్థలు పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రూ.300 టికెట్‌ క్యూలైన్‌లో ఉన్న వారంతా చెల్లాచెదురయ్యారు. కొండపై మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యుల జాడ తెలియక ఆందోళన చెందారు. కొందరు భక్తులు కంట్రోల్‌ రూమ్‌ ఏమైనా ఏర్పాటు చేశారా? అని అడిగితే.. జిల్లా అధికారులు స్పందించలేదు. అక్కడున్న అధికారుల్ని తమ వారి జాడ గురించి అడిగితే.. తమకేమీ సంబంధం లేదన్నట్లు సమాధానమిచ్చారు. ఓ వలంటీర్‌ తన కుటుంబ సభ్యుల్ని 2 నిమిషాల ముందే ఆ లైన్‌లో చూశాననీ, ప్రమాదం జరిగిన తర్వాత వాళ్లు కనిపించడం లేదంటూ కన్నీటిపర్యంతమైనా.. తోటి వలంటీర్లు ఓదార్చి వారి జాడ కోసం ప్రత్యేక బృందంగా ఏర్పడి వెతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆంక్షలు.. ఆగ్రహావేశాలు చందనోత్సవ సమయంలో ఏర్పాట్ల విషయంలో విఫలమైన ప్రభుత్వం.. ఘోరం జరిగినా అంతే నిర్లక్ష్యంతో వ్యవహరించింది. అపశ్రుతి చోటుచేసుకుని ఏడుగురు మరణించారన్న విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా చేసేందుకు మంత్రులు, అధికారులు విశ్వ ప్రయత్నం చేశారు. హోం మంత్రి అనిత ఘటనాస్థలానికి వెళ్లే ప్రాంతంలో పహారా కాశారు. కనీసం మీడియా ప్రతినిధులు వెళ్లేందుకు కూడా వీల్లేదని హుకుం జారీ చేశారు. కొందరు వెళ్లేందుకు ప్రయత్నించినా హోంమంత్రి తన సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. అయినా ఈ విషయం అక్కడకు వచ్చిన భక్తులకు తెలిసిపోవడంతో హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత క్యూలైన్లలోనూ ఆంక్షలు విధించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేక అగచాట్లు మరోవైపు ప్రమాదం సంభవించిన తర్వాత ఘాట్‌రోడ్డు నుంచి భక్తుల్ని అనుమతించడం నిలిపేశారు. వేకువజామున 4 గంటల నుంచి 7 గంటల వరకూ బస్సుల్ని పైకి పంపించకపోవడంతో కొండ దిగువనే భక్తులు నిలిచిపోయి అవస్థలు పడ్డారు. మరోవైపు.. అర్ధరాత్రి నుంచి స్వామి దర్శనం కోసం కొండపైకి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేందుకు కూడా బస్సులు లేకపోవడంతో అగచాట్లు ఎదుర్కొన్నారు. ఉదయం 7 గంటల తర్వాత బస్సుల రాకపోకలు ప్రారంభించడంతో వాటిని అందుకునేందుకు యుద్ధాలే చేయాల్సిన దుస్థితి దాపురించింది. గోడ ఎలా కట్టారో మాకెలా తెలుస్తుంది? మృతదేహాల్ని కేజీహెచ్‌కు తరలించిన తర్వాత ప్రమాద స్థలాన్ని హోం మంత్రి అనిత పరిశీలించా­రు. ఆమె మాట్లాడుతూ..‘అక్క­డ గోడ ఉంది. అది పిల్లర్‌తో కట్టారా... సిమెంట్‌తో కట్టారా... ఇటుకల­తో కట్టారా... అనేది మేమె­వరం చూసుకోం..’ అని వ్యాఖ్యానించారు. ‘మే­మూ వర్షంలో తడుస్తూనే దర్శనం చేసుకున్నాం. అయినా.. ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు వచ్చాను’ అని హోం మంత్రి చెప్పడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గందరగోళ పరిస్థితులు ప్రమాదం తర్వాత రూ.300 క్యూలైన్లను పూర్తిగా నిలిపేశారు. దీంతో ఆ టికెట్లు తీసుకున్న వేలాది భక్తులు దర్శనానికి ఎటువెళ్లాలో తెలియక నిలిచిపోయారు. దీంతో ఆ ప్రాంతమంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకానొకదశలో అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటికప్పుడు రూ.1,000 టికెట్‌ క్యూలైన్లను రూ.300 టికెట్‌ క్యూలైన్లుగా మార్చేశారు. రూ.1,500 టికెట్, రూ.1,000 టికెట్‌ భక్తుల్ని ఒకే లైన్‌లో కలిపేశారు. గాలిగోపురం వద్ద ఆయా టికెట్ల వారిని వేరువేరుగా పంపించారు. దీంతో ఎవరు ఎటు వెళ్లాలో తెలీక లైన్లు కిక్కిరిసిపోవడంతో భక్తులు నరకయాతన అనుభవించారు. అనిత.. ఇదేనా మీ బాధ్యత! 27–04–2025 క్యూ లైన్‌లు, భక్తులకు ఇతర సౌకర్యాలపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఐదుగురు మంత్రులం ఏర్పాట్లపై సమీక్షించాం. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధ పెట్టి పర్యవేక్షిస్తున్నాం. 30–04–2024 ఈ ఘటన ఎంతో దురదృష్టకరం. మేం రెండు రోజుల క్రితం ఏర్పాట్ల పరిశీలనకు వచ్చాం. అయితే ప్రమాదానికి గురైన గోడ ఎలా నిర్మించారో మేం చూడలేదు. ఆ గోడ ఇటుకతో కట్టారా? పిల్లర్‌తో కట్టారా? అనేది మేం చూడలేదు. – ఇవీ హోంమంత్రి అనిత వ్యాఖ్యలు

Today is World Labor Day8
కష్ట జీవులకు ఝలక్‌!

సాక్షి, అమరావతి: భవన నిర్మాణ, ఇతర అంసఘటిత రంగ కార్మికులు, కూలీల జీవితాలు కొద్ది నెలలుగా దుర్భరంగా మారాయి. అరకొర పనులు, అప్పుల బాధలు, కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు సైతం డబ్బు పుట్టక బతుకు భారంగా ఈడుస్తున్నారు. కష్టాన్ని నమ్ముకున్న కోట్ల మంది అర్ధాకలితో అలమటిస్తున్నారు. సూపర్‌ సిక్స్, సెవెన్‌ అంటూ అలవిగాని హామీల వర్షం కురిపించి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. కొత్త పథకాలు అమలు చేయకపోగా, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలకు సైతం గండి కొట్టింది. కార్మిక శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.80 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. లెక్కల్లోకి రాని వారు మరికొన్ని లక్షల్లో ఉంటారు. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంపై ఆధారపడిన తాపీ మేస్త్రీలు, కూలీలు, రాడ్‌ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు ఉన్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలప్పుడు భవన నిర్మాణ బోర్డ్‌ను పునరుద్ధరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘డ్రైవర్‌ సాధికార సంస్థ ఏర్పాటు చేస్తాం. అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్‌ ఇన్సూరెన్స్, రుణాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డ్‌ ఏర్పాటు చేస్తాం’ అని కూడా హామీ ఇచ్చారు. నేటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సాయం ఇలా» వైఎస్సార్‌ కళ్యాణమస్తు కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష.. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, బీసీల కులాంతర వివాహాలకు రూ.75 వేలు, షాధీ తోఫా కింద ముస్లింలకు రూ.1 లక్ష.. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు చొప్పున అందించారు. » వైఎస్సార్‌ బీమా పథకం కింద ప్రమాద మరణాల్లో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, సహజ మరణాలకు రూ.లక్ష, వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. » రిజిస్టర్‌ అవ్వని కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యం సంభవిస్తే రూ.2.5 లక్షలు ఇచ్చారు. » జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఇంటర్మీడియట్‌ వరకూ రూ.15 వేలు ఇచ్చారు. ఆపై ఉన్నత విధ్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా మద్దతుగా నిలిచారు. వసతి దీవెన కింద ఇంజినీరింగ్, డిగ్రీ చదివే పిల్లలకు రూ.20 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున సాయం అందించారు.» అసంఘటిత రంగ కార్మిక కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యంబారిన సందర్భాల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందించారు. పేరు మార్పు తప్ప సాయం లేదు» అసంఘటిత రంగ కార్మికులు, ఇతర బలహీన వర్గాల కుటుంబాల్లోని వ్యక్తుల సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణానికి రూ.10 లక్షలు బీమా అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వంలో అమలైన వైఎస్సార్‌ బీమా పథకానికి చంద్రన్న బీమాగా పేరు మార్చారు. అంతకు మించి పథకం అమలుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.» దీంతో సంపాదించే వ్యక్తి మరణించిన, అంగ వైకల్యానికి గురైన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. గత ప్రభుత్వంలో వైఎస్సార్‌ బీమా పథకం కింద 81 వేల కుటుంబాలకు రూ.876 కోట్ల మేర సాయం అందింది. ఈ ప్రభుత్వంలో అది పూర్తిగా నిలిచిపోయింది. » చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే ఈ పథకాలన్ని ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి కనీస భరోసా కరువై కార్మికుల జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి. పిల్లల చదువులు, ఆడ బిడ్డల పెళ్లిళ్లు, అనారోగ్యం, ఇతర అవసరాలకు ప్రభుత్వం నుంచి సాయం లేక ఎన్నో అగచాట్లు పడుతున్నారు. » రాష్ట్రంలో భవన నిర్మాణ, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు పటిష్టమైన జీవన ప్రమాణాలు మెరుగు పరచడం కోసం గత వైఎస్‌ జగన్‌ ప్భుత్వం నిర్మాణాత్మక సంక్షేమాన్ని అందించింది. వారి బిడ్డల విద్యకు ఊతమిచ్చింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, ఈఎస్‌ఐ పథకాల కింద ఉచిత వైద్య సేవలతో ఆరోగ్యాలకు భరోసాగా నిలిచింది. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందినా, వైకల్యం పొందినా.. ఉపాధి కోల్పోయే ఆ కుటుంబానికి బీమా ద్వారా ధీమా కల్పించింది. అమ్మ ఒడి, నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు, వసతి దీవెన, విద్యా దీవెన, చేదోడు, భరోసా, వాహన మిత్ర ఇలా డీబీటీ, నాన్‌డీబీటీ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపింది. అరకొర పనులే కొన్నేళ్లుగా భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక అని ఆర్భాటం చేశారు. వాస్తవానికి ఇసుక ఉచితంగా దొరకడం లేదు. సిమెంట్, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్నాయి. దీంతో కొత్త నిర్మాణాలకు పెద్దగా మొగ్గు చూపడం లేదు. వారం అంతా పని దొరకడం గగనంగా మారింది. దీంతో కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. – టి.నాగబాబు, సంతజూటూరు, నంద్యాల జిల్లాఆగిన ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వంలో మా ఊర్లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున లేఅవుట్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో వేలల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో బయటకు ఎక్కడికి వెళ్లే పని లేకుండా ఊర్లోనే పనులు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నిలిచి­పోయాయి. పెయింటింగ్, ఉడ్‌వర్క్స్, ట్రాన్స్‌పోర్ట్‌ రంగ కార్మికులపై ఈ ప్రభావం పడుతోంది. వారాలు, నెలల తరబడి ఇంటి పట్టునే ఉంటే మా కుటుంబాలు ఎలా గడుస్తాయి? నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లడం కూడా కష్టమవుతోంది. – ఆదాం, పెయింటర్, కృష్ణా జిల్లాఆదుకునే పథకాలేవీ? రోజూ ఉదయాన్నే బెంజ్‌ సర్కిల్‌ అడ్డా మీదకు పని కోసం వస్తాను. వారంలో మూడు రోజులు పని దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. గతంలో ఈ పరిస్థితులు లేవు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో జీవనం సాగిస్తున్నాం. ముఖ్యంగా పిల్లల చదువులు భారంగా మారాయి. గతంలో అమ్మ ఒడి, వసతి దీవెన కింద సాయం అందేది. ఇప్పుడు ఆదుకునే ఆ పథకాలు కూడా లేకుండా పోయాయి. – వెంకటేశ్, తాపీ మేస్త్రీ, విజయవాడ

High Court on the evaluation of Group 1 Mains exam9
నిర్లక్ష్యం జరిగితే సహించం

సాక్షి, హైదరాబాద్‌: ‘గ్రూప్‌–1.. ఇది చాలా సీరియర్‌ అంశం. ఇప్పటికే రెండుసార్లు రద్దయింది. మళ్లీ నిర్వహిస్తున్నారు. వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఆస్తులు అమ్ముకుని కొందరు, కుదవపెట్టుకుని మరికొందరు ఏళ్లుగా శిక్షణ పొందుతున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా న్యాయస్థానం సహించదు’అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష ముల్యాంకనం చేసిన వారికి జవాబు పత్రాలు ఇచ్చారా?.. దిద్దిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వారెందరు?.. తెలుగులో రాసిన వారెందరు ఎంపికయ్యారు?.. దీనిపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ)ని ఆదేశించారు. గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లలో హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం విచారణ చేపట్టింది. గ్రూప్‌–1 పత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు సురేందర్, విద్యాసాగర్‌ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆ సెంటర్లను ఎలా ఎంపిక చేశారు.. ‘ప్రిలిమ్స్, మెయిన్స్‌కు హాల్‌ టికెట్లు మార్చారు. కొందరికి అనుకూలంగా సెంటర్లు వేయడం కోసమే ఇలా చేశారు. ఇది చట్టవిరుద్ధం. ఎక్కడ ఏ పరీక్ష నిర్వహించినా ఇలా హాల్‌టికెట్ల నంబర్లలో మార్పు ఉండదు. ఎంపిక చేసిన మహిళా అభ్యర్థులను సెంటర్‌ నంబర్‌ 18, 19లో వేశారు. ఈ రెండు సెంటర్లలో మహిళా అభ్యర్థులను ఎలా ఎంపిక చేసి, సెంటర్లు ఇచ్చారో చెప్పాలి. మరికొన్ని చోట్ల మహిళా కాలేజీల్లో సెంటర్లు కేటాయించినా అక్కడ పురుషులు, మహిళా అభ్యర్థులను వేశారు. మొత్తం పోస్టుల్లో 4 సెంటర్ల నుంచి ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించగా, కొన్ని సెంటర్ల నుంచి ఒకరిద్దరు కూడా అర్హత పొందలేదు. 16, 17, 18, 19లో పరీక్ష రాసిన వారు ఎక్కువ శాతం అర్హత సాధించారు. పక్కపక్కనే కూర్చున్న వందలాది మందికి ఒకేలా మార్కులొచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో మొత్తం మార్కుల జాబితా మార్చి 10న పెట్టగా.. పేపర్ల వారీగా మార్కులను మాత్రం వారం తర్వాత పెట్టారు. ఇదంతా అవకతవకలు జరిగాయని చెప్పడానికి ఆస్కారం ఇస్తోంది’అని పిటిషనర్ల న్యాయవాదులు పేర్కొన్నారు.జవాబు పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ.. మీడియం వారీగా దిద్దేవారికి జవాబు పత్రాలు ఇచ్చారా అని టీజీపీఎస్సీ కౌన్సెల్‌ రాజశేఖర్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. మెయిన్స్‌ వ్యాస రూపంలో జరుగుతుందని, ఈప్రశ్నలకు జవాబు పత్రాలు ఇవ్వడం సాధ్యంకాదని బదులిచ్చారు. సబ్జెక్టు నిపుణులే పేపర్లు దిద్దుతారని.. వారికి జవాబుపై పూర్తి అవగాహన ఉంటుందన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు గతంలో కంటే ఎక్కువ మందే అర్హులైతే అభినందించాలని ఆయన కోరగా.. న్యాయమూర్తి తప్పుకుండా అని సమాధానమిచ్చారు.పిటిషన్లు వేసిన వారు నిరుద్యోగులు కాదని, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులని రాజశేఖర్‌ చెప్పారు. కాగా, గ్రూప్‌–1 నియామకాలను నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ దాఖలుచేసిన అప్పీల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్‌ రేణుక యారా ధర్మాసనం తోసిపుచ్చింది.

Jewellery sales across the country on the occasion of Akshaya Tritiya10
అమ్మకాలు 'అక్షయం'!

న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రయాలు సానుకూలంగా నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ అక్షయ తృతీయ రోజున పసిడి కొంటే కలిసొస్తుందన్న విశ్వాసం అమ్మకాలకు అండగా నిలిచింది. విలువ పరంగా 35 శాతం అధిక అమ్మకాలు ఉంటాయని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రాజేష్‌ రోక్డే తెలిపారు. పరిమాణం పరంగా గతేడాది మాదిరే 20 టన్నులుగా ఉండొచ్చని పేర్కొన్నారు. మరోపక్క, బుధవారం బంగారం, వెండి ధరలు కాస్త శాంతించడం కూడా కలిసొచ్చింది. దక్షిణాదిన జ్యుయలరీ దుకాణాలకు ఉదయం నుంచే వినియోగదారులు క్యూకట్టారు. ఉత్తరాదిన మధ్యాహ్నం నుంచి వినియోగదారులు రావడం పెరిగింది. అయినప్పటికీ దక్షిణ భారత్‌లోనే కస్టమర్ల రాక అధికంగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా మంగళ సూత్రాలు, చైన్‌లు, వెండి ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగినట్టు వర్తకులు తెలిపారు. వివాహాల సీజన్‌ ఆరంభం కావడంతో మంగళసూత్రాల కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తి చూపించినట్టు చెప్పారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు ధోరణి సాధారణంగా దక్షిణాదిన కనిపించేది. క్రమంగా ఇది ఉత్తరాదికీ విస్తరించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 25–40 ఏళ్ల వయసులోని కస్టమర్లు సైతం బంగారం కొనుగోళ్లకు ముందుకొచ్చినట్టు రోక్డే తెలిపారు. ముఖ్యంగా ఆభరణాలు, కాయిన్లు, బార్లు కొనుగోలుకు ఆసక్తి చూపించినట్టు చెప్పారు. ‘‘ధరల పెరుగుదలతో కొనుగోలు శక్తిపై ప్రభావం పడింది. అయినప్పటికీ అక్షయ తృతీయ రోజున బలమైన కొనుగోళ్ల సెంటిమెంట్‌ ఉంది’’ అని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఇండియా సీఈవో సచిన్‌ జైన్‌ తెలిపారు. 2024 అక్షయ తృతీయ రోజున రూ.72,300గా ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర ఇటీవలే రూ. లక్ష స్థాయిని అధిగమించి... ప్రస్తుతం 99,000 స్థాయిలో ఉంది. అంటే దాదాపు 37 శాతం ఎగసింది. పాత ఆభరణాల మార్పిడి.. అక్షయ తృతీయ రోజున అమ్మకాల్లో 50 శాతం మేర పాత బంగారం మార్పిడితోనే ఉన్నట్టు పీఎన్‌జీ జ్యుయలర్స్‌ చైర్మన్‌ సౌరభ్‌ గాడ్గిల్‌ తెలిపారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు బడ్జెట్‌ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. మొత్తం మీద గతేడాది అక్షయ తృతీయతో పోల్చి చూస్తే అమ్మకాలు 10–15 శాతం పెరిగాయని కామా జ్యుయలర్స్‌ ఎండీ కొలిన్‌షా తెలిపారు. దేశవ్యాప్తంగా కీలక మార్కెట్లలో స్టడెడ్‌ జ్యుయలరీ అమ్మకాలు పెరిగినట్టు జీఎస్‌ఐ ఇండియా ఎండీ రమిత్‌ కపూర్‌ వెల్లడించారు.దిగొచ్చిన బంగారం ధర అక్షయ తృతీయ రోజున బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కలిసొచ్చింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.900 తగ్గి రూ.98,550 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు ఒకదశలో 43 డాలర్ల వరకు క్షీణించి 3,274 డాలర్లను తాకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆటో టారిఫ్‌ల ప్రభావం తగ్గించే దిశగా ఆదేశాలు జారీ చేయడం.. పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి చర్చల్లో పురోగతి ఉందని ప్రకటించడం బంగారం ధరలు తగ్గేందుకు కారణమైనట్టు కోటక్‌ సెక్యూరిటీస్‌ కమోడిటీ రీసెర్చ్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కేనత్‌ చైన్‌వాలా తెలిపారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement