
టొరంటో: కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ(Liberal Party of Canada) విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో మార్క్ కార్నీ(Mark Carney) మద్ధతుదారుల్ని ఉద్దేశిస్తూ విజయ ప్రసంగం చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.
‘‘కెనడా చరిత్రలో కీలకమైన క్షణం ఇది. అమెరికా(America)తో మన పాత ఏకీకరణ సంబంధం ఇప్పుడు ముగిసింది. ఇకపై అమెరికాను స్థిరమైన మిత్రదేశంగా నమ్మలేం. అమెరికా చేసిన ద్రోహం నుండి మనం తేరుకుంటున్నాం. నెలల తరబడి నుంచి నేను ఈ విషయంలో హెచ్చరిస్తూ వస్తున్నా. అమెరికా మన భూమిని, మన వనరులను, మన నీటిని, మన దేశాన్ని కోరుకుంటోంది. మనల్ని విచ్ఛిన్నం చేసి తద్వారా కెనడాను సొంతం చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. కానీ, అది ఎప్పటికీ జరగదు’’ అని కార్నీ అన్నారు.
అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెనడా పార్లమెంట్‌లో 343 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు 172 మెజారీటీ అవసరం. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. అయితే లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఆర్థిక వేత్త అయిన మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.
ఇదీ చదవండి: ట్రంప్‌తో కయ్యం.. ఎవరీ మార్క్ కార్నీ?