
దేశంలో కోట్లాది మంది రైలు ప్రయాణికులను ప్రభావితం చేసే కొత్త రూల్‌ను భారతీయ రైల్వే ప్రవేశపెడుతోంది. రైళ్లలో ప్రయాణ సౌకర్యాన్ని పెంచడం, రిజర్వ్‌డ్ కోచ్‌లలో రద్దీని నివారించడం లక్ష్యంగా ఇండియన్ రైల్వే మే 1 నుండి కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ నిబంధన ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులను ఇకపై స్లీపర్, ఏసీ బోగీల్లో అనుమతించరు.
వీరిపైనే ప్రభావం
రైల్వే అమలు చేస్తున్న ఈ కొత్త మార్గదర్శకాలు ముఖ్యంగా రైల్వే కౌంటర్ల నుంచి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు బుక్ చేసుకునే వారిపై ప్రభావం చూపనున్నాయి. ఐఆర్‌సీటీసీ, ఇతర అధీకృత వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్ చేసుకున్న టికెట్లు కన్‌ఫర్మ్ కాకపోతే ఆటోమేటిక్ అవి రద్దవుతాయి. ఆఫ్‌లైన్‌లో రైల్వే కౌంటర్ల ద్వారా బుక్ చేసుకున్న టికెట్లు కన్‌ఫర్మ్ కాకపోయినప్పటికీ ప్రయాణికులు వాటితో రైలు ఎక్కే అవకాశం ఉండేది. అలా ఎక్కిన ప్రయాణికులు ఎక్కడైనా ఖాళీ ఉంటే టీటీఈ ద్వారా వాటిని పొందే వీలు ఉండేది. అయితే ఇలా ఎక్కువ మంది స్లీపర్ లేదా ఏసీ బోగీల్లోకి ప్రవేశించి అన్ రిజర్వ్ డ్ సీట్లను ఆక్రమించుకోవడం లేదా ఆయా కోచ్‌లలో రద్దీకి కారణమవుతున్నారు.
టీటీఈలకు అధికారాలు
కొత్త ఆదేశాల ప్రకారం.. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్లకు (టీటీఈ) భారతీయ రైల్వే కొన్ని అధికారాలు ఇచ్చింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో రిజర్వ్‌డ్ స్లీపర్ లేదా ఏసీ సీట్లను ఆక్రమించుకున్న ప్రయాణికులకు జరిమానా విధించవచ్చు. అలాగే అటువంటి ప్రయాణికులను అన్‌రిజర్వ్‌డ్ టికెట్ హోల్డర్లు ప్రయాణించే జనరల్ కోచ్‌కు పంపించే అధికారం టీటీఈలకు ఉంటుంది.
ఈ నిబంధన ఎందుకంటే..
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిబంధనను అమలు చేస్తున్నామని నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశికిరణ్ వివరించారు. వెయిటింగ్ టికెట్ హోల్డర్లు కోచ్‌లలోకి ప్రవేశించి రిజర్వ్‌డ్ సీట్లను బలవంతంగా ఆక్రమించుకుంటున్నారని, ప్రయాణికులు తిరిగేందుకు కూడా వీలులేకుండా మార్గాలను స్తంభింపజేస్తున్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కొత్త నిబంధనతో రైళ్లలో ఎక్కేందుకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై ఆధారపడే ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ఇకపై స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించాలంటే కన్ఫర్మ్ టికెట్ తప్పనిసరి. లేదంటే మీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవడమో లేదా జనరల్ అన్ రిజర్వ్‌డ్ క్లాస్ లో ట్రావెల్ చేయడమో చేయాల్సి ఉంటుంది.