
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఇవాళ (ఏప్రిల్ 30) 38వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర క్రికెటర్లతో పాటు అభిమానులు సోషల్‌మీడియా వేదికగా రోహిత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
BIRTHDAY CELEBRATION OF INDIAN CAPTAIN ROHIT SHARMA ♥️ pic.twitter.com/cQQRzoRpCd
— Johns. (@CricCrazyJohns) April 30, 2025
ప్రస్తుతం ఐపీఎల్ 2025 ఆడుతున్న రోహిత్.. తన జట్టు సభ్యులు మరియు భార్య రితక సజ్దేతో కలిసి కేక్ కట్ చేశాడు. హిట్‌మ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా అతను సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.
THE BIRTHDAY CELEBRATIONS OF HITMAN ROHIT SHARMA. 🥹
- Moments of the Day. ❤️ pic.twitter.com/ZncZTNEVB6— Tanuj (@ImTanujSingh) April 30, 2025
2007లో టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. టీమిండియా తరఫున 67 టెస్ట్‌లు, 273 వన్డేలు, 159 టీ20లు ఆడిన హిట్‌మ్యాన్ మూడు ఫార్మాట్లలో కలిపి 19700 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్‌లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్ మొత్తం 266 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీల సాయంతో 6868 పరుగులు చేశాడు.
రోహిత్ తన సుదీర్ఘ కెరీర్‌లో భారత జట్టు, తన ఐపీఎల్ జట్లైన డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. వీటిలో మూడు రికార్డులు మాత్రం ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. అవేంటంటే..
వన్డేల్లో అత్యధిక స్కోర్ (264)
2014, నవంబర్ 13న రోహిత్ శర్మ శ్రీలంకపై 264 పరుగులు (173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు) చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఇదే అత్యుత్తమ స్కోర్‌గా చలామణి అవుతుంది. బహుశా మున్ముందు కూడా ఈ రికార్డు పదిలంగానే ఉండే అవకాశం ఉంది. వన్డేల్లో ఇంత భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలంటే చాలా సహనం కావాలి. నేటి తరం క్రికెటర్లలో ఇది కొరవడింది. కాబట్టి ఈ రికార్డు వన్డే క్రికెట్ చరిత్రలో చిరకాలం పదిలంగా ఉండే అవకాశం ఉంది.
సింగిల్ వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు (5)
2019 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ సెంచరీల సునామీ సృష్టించాడు. ఆ టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు (సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక) సాధించి చరిత్ర సృష్టించాడు. ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఓ ఆటగాడు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. ఈ టోర్నీలో హిట్‌మ్యాన్ ఉగ్రరూపం దాల్చి 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు బద్దలు కొట్టడం కూడా దాదాపుగా అసాధ్యమే.
వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు (3)
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ చేస్తేనే అత్యద్భుతం అనుకునే రోజుల్లో హిట్‌మ్యాన్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో రోహిత్ ఒక్కడే మూడు సాధించడమంటే మామూలు విషయం కాదు. 2013లో ఆస్ట్రేలియాపై తన తొలి డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన హిట్‌మ్యాన్ ఆతర్వాతి ఏడాదే (2014) శ్రీలంకపై వరల్డ్ రికార్డు డబుల్ సెంచరీ (264) సాధించాడు. 2017లో రోహిత్ మరోసారి శ్రీలంకపై డబుల్ సెంచరీ (208 నాటౌట్) చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ చాలా రికార్డులు నమోదు చేసినప్పటికీ ఈ రికార్డులను మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేదు.
ప్లేయర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ సాధించిన పలు ఘనతలు/రికార్డులు..
వరల్డ్‌కప్ సెంచరీలు- 7
కెప్టెన్‌గా 2 ఐసీసీ టైటిళ్లు (2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ)
ఆటగాడిగా 4 ఐసీసీ టైటిళ్లు
వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు
సింగిల్ వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు
వన్డేల్లో అత్యధిక స్కోర్
కెప్టెన్‌గా అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ (కనీసం 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు)
కెప్టెన్‌గా 5 ఐపీఎల్ టైటిళ్లు
ఆటగాడిగా 6 ఐపీఎల్ టైటిళ్లు