
తాజాగా సీఎంఓలోకి జయేశ్‌రంజన్, కేఎస్ శ్రీనివాసరాజు
సీఎంఓ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష.. మార్పులకు శ్రీకారం
మరికొందరిని సీఎంఓలోకి తీసుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి తన కార్యాలయ (సీఎంఓ) ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు ఏడాదిన్నర పూర్తయిన నేపథ్యంలో తన కార్యాలయంలోని అధికారుల పనితీరును సమీక్షించి మార్పులు, చేర్పులకు నడుం బిగించారు. ఇటీవల ఆయన ఐఏఎస్ అధికారుల పనితీరు, వ్యవహారశైలి పట్ల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నెల 27న 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి, కీలక శాఖలకు కొత్త అధిపతులను నియమించారు.
జయేశ్‌రంజన్ ‘స్పీడ్’ పెంచుతారా?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎంకు సంయుక్త కార్యదర్శి గా పనిచేసిన ఎస్.సంగీత సత్యనారాయణను వైద్యారోగ్య శాఖ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈ ఓగా బదిలీ చేశారు. ఆమె సీఎంఓలో వైద్యారోగ్య, స్త్రీ, శిశు సంక్షేమం, ఎస్సీల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల వ్యవహారాలను పర్యవేక్షించేవారు.
ఇదే బదిలీల్లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ను సీఎంఓలోని ఇండస్ట్రీ ఇన్వెస్ట్‌మెంట్ సెల్‌తోపాటు స్మార్ట్ ప్రొ యాక్టివ్ ఎఫీషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ సీఈఓగా నియమించారు. రాష్ట్రంలో పెట్టుబడు లను రప్పించడానికి నేరుగా సీఎంఓ నుంచే ప్రయ త్నాలు చేసేందుకు జయేశ్‌రంజన్‌ను అక్కడకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది.
శ్రీనివాసరాజు ఇన్... చంద్రశేఖర్‌రెడ్డి, ఖాసిం ఔట్
సీఎం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఐఎఫ్‌ఎస్ అధికారి జి.చంద్రశేఖర్‌రెడ్డిని త్వరలో ప్రభుత్వం రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా నియమించనుంది. మరో మూడు నెలల్లో ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన సీఎంఓలో అట వీ, వ్యవసాయం, పశుసంవరక, పౌర సరఫరాలు, రవాణా, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖల వ్యవహారాలను చూస్తున్నారు.
» సీఎం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న షానవాజ్ ఖాసింను ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ మరో ఉత్తర్వులు జారీ చేశారు. ఆబ్కారీ శాఖ డైరెక్టర్‌గా ఆయనకు అద నపు బాధ్యతలు అప్పగించారు. షానవాజ్ సీఎంఓలో బీసీ, మైనారిటీల సంక్షేమం, విపత్తు ల నిర్వహణ, క్రీడలు, సీఎం భద్రతకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించారు.
» రిటైర్డ్ ఐఏఎస్ కేఎస్ శ్రీనివాసరాజును ముఖ్యమంత్రికి ముఖ్యకార్యదర్శిగా నియమి స్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వు లు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సీఎంఓ నుంచి వెళ్లిన సంగీత సత్యనారాయణ, షానవాజ్ ఖాసింల కు మంచి పోస్టింగ్స్ లభించగా, త్వరలో వెళ్లను న్న చంద్రశేఖర్‌రెడ్డికి సైతం కీలకమైన ప్రధాన సమాచార కమిషనర్ పోస్టు వరించనుంది. సీఎంఓలో వీరు పర్యవేక్షించిన శాఖల్లో కొన్నింటిని శ్రీనివాసరాజుకు కేటాయించనున్నారు. ఒకరిద్దరిని సీఎం కార్యదర్శులుగా సీఎంఓలోకి తీసుకునే అవకాశముంది.
సీఎంఓలో వీరే కీలకం
సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రిని కొనసాగించే అవకాశాలున్నాయి. ఆయన కీలకమైన సాధా రణ పరిపాలన, శాంతిభద్రతలు, హోం, ఆర్థిక, ప్రణాళిక, న్యాయ, శాసనసభ వ్యవహారాలు, రెవె న్యూ శాఖల వ్యవహారాలతో పాటు సీఎం కార్యా లయ ఓవరాల్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.
» సీఎం కార్యదర్శి కె.మాణిక్‌రాజ్ ఇంధన, నీటి పారుదల, విద్య, వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, గనుల శాఖల వ్యవహారాలను చూస్తున్నారు.
» ఐడీఈఎస్ అధికారి బి.అజిత్‌రెడ్డి సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి హోదాలో సీఎం అపాయింట్ మెంట్స్‌తోపాటు సీఎంఆర్‌ఎఫ్, పురపాలక, పరిశ్రమలు, ఐటీ, కార్మిక, ప్రజాసంబంధాల శాఖల వ్యవహారాలను చూస్తున్నారు. అజిత్‌రెడ్డి సీఎంకు సన్నిహితంగా ఉంటారని పేరుంది.
» సీఎం ఓఎస్డీ హోదాలో వేముల శ్రీనివాసులు దేవాదాయ, పర్యాటక శాఖలతోపాటు సీఎంకు వచ్చే విజ్ఞప్తులు, ప్రజావాణి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. వీరిని సీఎంఓలో కొనసాగించే అవకాశముంది.