
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమైన దేవాలయాల్లో భద్రత వైపల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. ఏపీలోని పుణ్యక్షేత్రాల్లో పరిపాలనా లోపాలు, భద్రతా వైఫల్యాల వల్ల తరచూ జరుగుతున్న దుర్ఘటనలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు గురువారం లేఖ రాసినట్లు ఎంపీ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి.. ‘విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవాలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. గోడ నిర్మాణంలో సరైన ఇంజనీరింగ్ పద్ధతులు పాటించకపోవడం, నాణ్యత లేని మెటీరియల్ ఉపయోగించడమే ఈ దుర్ఘటనకు కారణం. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో భక్తులు పవిత్రంగా భావించే అరుదైన నక్షత్ర తాబేళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాయి. పోస్టుమార్టం చేయకుండానే వాటిని దహనం చేశారు.
తిరుమలలో భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. జనవరి 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ కౌంటర్ల క్యూ లైన్లలో తొక్కిసలాటి జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా టీటీడీ పరిపాలనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల మూడంచెల భద్రత వ్యవస్థను దాటి కొంతమంది భక్తులు పాదరక్షలతో తిరుమల శ్రీవారి ఆలయ సింహద్వారం వరకు వెళ్లారు. టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయి. గోశాల నిర్వహణలో నిర్లక్ష్యం, నాణ్యతలేని దాణా అందించడం, వైద్యసేవల లోపం వల్లే ఈ దారుణం జరిగింది.’ అని లేఖలో పేర్కొన్నారు.
