
అభిప్రాయం
ఇండియా అనే పేరు వెనుక చాలా చరిత్ర ఉంది. ఈ పదం ఇండస్ నుంచి వచ్చింది. ప్రాచీన పర్షియన్ పదం అయిన హిందుష్ నుంచి ఇండస్ ఆవిర్భవించింది. ఇది సంస్కృత పదం సింధుకు రూపాంతరం. అయితే, ప్రాచీన గ్రీకులు ఇండియన్స్‌ను ఇండోయి అని వ్యవహరించేవారు. ఇండోయి అంటే వారి భాషలో ఇండస్ ప్రజలు అని అర్థం. ఇండస్ రివర్ అంటే స్థానికులు ఎప్పటి నుంచో పిలుచుకునే సింధూ నదే.
మన దేశానికి భారత్ అనేది రాజ్యాంగ గుర్తింపు పొందిన అధికారిక నామం. ఈ భౌగోళిక పదం అనేక భారతీయ భాషల్లో కొద్ది మార్పులు చేర్పులతో వ్యవహారంలో ఉంది. హిందూ ధర్మ గ్రంథాలు చెప్పే పౌరాణిక చక్రవర్తి భరతుడి పేరు నుంచి భారత్ వచ్చింది.
అధికార భాషగా పర్షియన్
హిందుస్థాన్ వాస్తవంగా పర్షియన్ పదం. అంటే ‘హిందువుల భూమి’ అని అర్థం. 1947 వరకూ ఉత్తర భారతం, పాకిస్తాన్ వ్యాపించి ఉన్న ప్రాంతాన్ని ఈ పేరుతో పిలిచేవారు. ఇండియా మొత్తాన్నీ కలిపి చెప్పేందుకు కూడా అప్పుడప్పుడూ ఈ పదం ఇప్పటికీ వాడతారు.
ఢిల్లీ సుల్తానుల, మొఘలుల సామ్రాజ్యాల్లో, వారి వారసత్వపు రాజ్యాల్లో పర్షియన్ అధికారిక భాషగా ఉండేది. కవిత్వం, సాహిత్యం కూడా ఈ భాషలోనే ఉండేవి. చాలా మంది సుల్తానులు, నాటి కులీనులు పర్షియన్ ప్రభావిత తురుష్కులే. మధ్య ఆసియా నుంచి వచ్చిన వీరి మాతృభాషలు తురుష్క భాషలు. మొఘలులు కూడా పర్షియన్ ప్రభావిత మధ్య ఆసియా నుంచే వచ్చారు. కాకుంటే వీరు తొలినాళ్లలో ప్రధానంగా చగతాయి తురుష్క భాష మాట్లాడేవారు. తర్వాత్తర్వాత పర్షియన్‌కు పరివర్తనం చెందారు.
నార్త్ ఇండియాలోని ముస్లిం ఉన్నత వర్గాలకు పర్షియన్ ప్రాధాన్య భాష అయ్యింది. మొఘల్, ఇండో–పర్షియన్ చరిత్ర కారుడైన ప్రముఖ పండితుడు ముజఫర్ ఆలమ్ చెప్పే ప్రకారం, ఈ పర్షియన్ భాష అక్బర్ సామ్రాజ్యంలో సామాన్యుల భాషగా మారింది. ఎందుకంటే, అన్ని మతాల వారు దీన్ని మాట్లాడేవారు. భాష సరళంగా ఉండేది. దీంతో, పలు రాజకీయ సామాజిక ప్రయోజనాలు ఆశించి అక్బర్ దీన్ని విశేషంగా అభివృద్ధి చేశాడు. పరాయి భాషల భారతీయ అపభ్రంశాల కలయికతో నాడు ఏర్పడిన ఒక మాండలికమే ఇవ్వాళ్టి ఉర్దూ, హిందీ, హిందుస్థానీ భాషలకు మూలం.
బ్రిటిష్ వారి రాకతో...
మొఘలుల కాలం నుంచి బ్రిటిష్ పాలన వరకు పర్షియన్ భాష మనుగడలో ఉంది. ‘గొప్ప మొఘలుల’లో చిట్టచివరి వాడుగా చరిత్రకారులు భావించే ఔరంగజేబ్ చక్రవర్తి 1707లో చనిపోయే వరకు కూడా ఈ ప్రాభవం కొనసాగింది. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. 1739లో ఢిల్లీపై నాదిర్ షా దండ యాత్ర చేయడం, దక్షిణ ఆసియాలో క్రమేపీ యూరప్ పట్టు బిగియటం... ఈ పరిణామాల నేపథ్యంలో పర్షియన్ భాష,సంస్కృతి క్షీణదశలోకి ప్రవేశించాయి. ఏమైనప్పటికీ, ఆ తర్వాత కూడా సిక్కు మహారాజా రంజిత్ సింగ్ (పాలనా కాలం 1799– 1837) సహా దక్షిణ ఆసియాలోని అనేక మంది పాలకుల ప్రాంతీయ ‘సామ్రాజ్యాల్లో’ దీనికి రాజాదరణ లభించింది.
చిట్టచివరకు, 1839లో ఈ భాషకు మృత్యు ఘంటికలు మోగాయి. బ్రిటిష్ పాలకులు పర్షియన్ భాషను పరిపాలన, విద్యా బోధన వ్యవస్థల నుంచి తొలగించారు. నామమాత్రపు చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్‌ను బ్రిటిష్ వారు అధికారపీఠం నుంచి కూలదోశారు.
మూలాలు ఏవైనప్పటికీ ఆర్య ద్రావిడ కలయిక నుంచి పుట్టిన సంస్కృతం స్థానాన్ని అలా పర్షియన్ ఆక్రమించింది. ఇక్కడ విశేష మేమిటంటే, లేత వర్ణ చర్మం (లైట్ స్కిన్) కలిగిన ఒక ఉన్నత వర్గం భాషను మరో ‘లైట్ స్కిన్’ ఉన్నత వర్గం భాష తోసి రాజంది. ఉత్తర భారత దేశంలో ఈ కులీన భాషలు చివరకు ప్రాంతీయ మాండలీ కాలతో కలిసిపోయి హిందావి లేదా ఉర్దూ అనే ఒక సామాజిక భాషగా రూపొందాయి.
నిజానికి విభిన్న భాషలేనా?
హిందీ, ఉర్దూలు రెండు విభిన్న భాషలు అన్న భావనకు 19వ శతాబ్దపు ప్రథమార్ధంలో ఫోర్ట్ విలియం కాలేజ్ అధ్యయనాల్లో స్పష్టత వచ్చిందని ‘ఇండియాలో భాష గురించిన సత్యం’ (ట్రూత్ అబౌట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా) అనే వ్యాసం (ఈపీడబ్ల్యూ, డిసెంబర్ 14, 2002)లో సంతోష్ కుమార్ ఖారే పేర్కొన్నారు. పర్షియన్/అరబిక్ నుంచి ఉర్దూ... సంస్కృతం నుంచి హిందీ తమ భాషా సాహిత్యాలను అరువు తెచ్చుకున్నాయని హిందీ పుట్టుక గురించి వివరించారు. కొత్తగా పుట్టుకొచ్చిన మధ్యతరగతి పట్టణ హిందూ, ముస్లిం/కాయస్థ వర్గాల సంకుచిత ప్రయోజనాల పోటీని అవి ప్రతిబింబించాయి.
అసలైన బాధాకరమైన విషయం వ్యాసం ముగింపులో ఉంటుంది. అదేమిటంటే, ‘‘ఆధునిక హిందీ (లేదా ప్రామాణిక భాష) అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ సృష్టి. ఉర్దూ వ్యాకరణం,శైలిని పరిరక్షిస్తూనే దాన్ని విదేశీ పదాల నుంచి, గ్రామ్యాల నుంచి ప్రక్షాళన చేసి, వాటి స్థానంలో సంస్కృత సమానార్థకాలను చేర్చింది.’’
హిందీకి ప్రధాన ప్రచారకర్త పాత్ర పోషిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ నేడు ఇండియాలో ఇంగ్లిష్ మాట్లాడేవారిని ‘మెకాలే పిల్లలు’ అంటూ ఎగతాళి చేసి ఆనందం పొందుతోంది. ఇదొక విషాదం!
మోహన్ గురుస్వామి
వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత
mohanguru@gmail.com