
బీమాతో మహిళలకు దీమా
ఆత్మకూరు(ఎం): సమభావన సంఘాల సభ్యులకు అమలవుతున్న కొత్త పథకాలతో మహిళలు దీమాగా ఉండవచ్చు. రాష్ట్రం ప్రభుత్వం సమభావన సంఘాల సభ్యులకు 2024 మార్చిలో లోన్ బీమా, ప్రమాద బీమా అనే పథకాలకు రూపకల్పన చేయగా.. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే అవి అమలవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 673 గ్రామ సంఘాలు ఉన్నాయి. 18,112 సమభావన సంఘాలు ఉండగా.. అందులో 2,02,393 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.
లోన్ బీమా..
లోన్ బీమా కింద 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలు సమభావన సంఘంలో సభ్యురాలిగా ఉండి బ్యాంక్ లింకేజీ కింద రుణం తీసుకుని ప్రమాదవశాత్తు మరణిస్తే తిరిగి రుణం చెల్లించనవసరం లేదు. ఈ రుణం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకం కింద యాదాద్రి భువనగిరి జిల్లాలో 72 మంది మహిళలు(సమభావన సంఘాల్లో సభ్యులు) రిజిస్ట్రేషన్ చేసుకోగా.. అందులో ఇప్పటివరకు మృతిచెందిన 21 మంది సభ్యులకు బీమా వర్తించింది.
ప్రమాద బీమా..
సమభావన సంఘంలో సభ్యురాలై ఉండి సీ్త్రనిధి రుణం తీసుకుని 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ప్రమాదవశాత్తు సభ్యురాలు మరణిస్తే రూ.10లక్షలు సభ్యురాలు సూచించిన నామినీకి అందజేస్తారు. వీఓ తీర్మానం, ఓబీ తీర్మానం, సెర్ప్ ఏపీఎం, సీసీల తీర్మానం మేరకు బాధితురాలికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద భువనగిరి జిల్లాలో ముగ్గురు సభ్యుల కుటుంబాలు లబ్ధి పొందగా.. వారికి త్వరలో రూ.10లక్షల చొప్పున జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సభ్యులు అందజేయనున్నారు.
అవగాహన కల్పించాలి
లోన్ బీమా, ప్రమాద బీమా పథకాలపై అధికారులు అవగాహన కల్పించాలి. ఈ రెండు పథకాలను సమభావన సంఘాల్లో సభ్యులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. సంఘాల్లోని ప్రతి సభ్యురాలికి అవగాహన కల్గించేలా చర్యలు తీసుకోవాలి.
– రచ్చ పల్లవి, జిల్లా మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి
సమభావన సంఘాల సభ్యులకు
లోన్ బీమా, ప్రమాద బీమా పథకాలు
అవగాహన లేక సద్వినియోగం
చేసుకోలేకపోతున్న మహిళలు
ఆర్థికంగా బలోపేతం కావాలి
ఈ రెండు బీమా పథకాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నాం. స్వయం ఉపాధి కోసం సమభావన సంఘాల్లోని మహిళలు సీ్త్రనిధి రుణాలు తీసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి. ఒకవేళ వారికి ఏమైనా అయితే బీమా వర్తిస్తుంది.
– టి. నాగిరెడ్డి, యాదాద్రి భువనగిరి
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి

బీమాతో మహిళలకు దీమా

బీమాతో మహిళలకు దీమా