
చెరువులో పడి వృద్ధుడు మృతి
బీబీనగర్: ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో శనివారం జరిగింది. సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్‌కు చెందిన బొంకేంపల్లి సాయిలు(70) భిక్షాటన చేస్తూ సంచార జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం అతడు బీబీనగర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు ఒడ్డున బట్టలు ఉతుక్కొని, స్నానం చేసేందుకు చెరువులోకి దిగగా.. ప్రమాదవశాత్తు జారి చెరువులో మునిగి మృతి చెందాడు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు జగన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
గడ్డిమందు తాగి..
పెన్‌పహాడ్: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం చీదెళ్ల గ్రామంలో శనివారం జరిగిది. ఏఎస్‌ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. చీదెళ్ల గ్రామానికి చెందిన వెన్న వెంకటరెడ్డి(58) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఆయన తన ఇంట్లో గడ్డి మందు తాగాడు. అనంతరం గడ్డి మందు తాగినట్లు బయట ఉన్న భార్య పద్మకు చెప్పడంతో చుట్టుపక్కల వారి సహాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు నవీన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
ఇంట్లో నగదు చోరీ
పెన్‌పహాడ్: గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి బీరువా పగులగొట్టి నగదు అపహరించారు. ఈ ఘటన శనివారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని దూపహాడ్ గ్రామంలో జరిగింది. హెడ్‌కానిస్టేబుల్ ఆంగోతు యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. దూపపహాడ్ గ్రామానికి చెందిన పత్తిపాక సైదులు శనివారం మధ్యాహ్నం తన ఇంటికి తలుపులు పెట్టి గాలిమిషన్ వద్దకు వెళ్లి తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళం పగులగొట్టి రూ.2వేలు ఎత్తుకెళ్లారు. సైదులు ఇంటికి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. గ్రామస్తులు దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
సమష్టి గెలుపునకు సాధనం సహకార వ్యవస్థ
నల్లగొండ టూటౌన్: విద్యార్థుల సమష్టి గెలుపునకు సాధనం సహకార వ్యవస్థ అని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని ఎంజీయూటీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోపరేటివ్ మేనేన్‌మెంట్ శనివారం ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జూలై మొదటి శనివారాన్ని సహకార దినోత్సవంగా పాటించాలన్నారు. సహకార వ్యవస్థ ద్వారా గ్రామాలు విజయపథంలో దూసుకెళ్లాని వివరించారు. విద్యార్థులకు సైతం సహకార సంఘాలు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐసీఎం డైరెక్టర్ డాక్టర్ ఆర్. గణేషన్, శార్దూల్ జాదవ్, పత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.