
లోకాయుక్త ఆధ్వర్యంలో స్టోన్ క్రషర్ మిల్లుల పరిశీలన
బొమ్మలరామారం: మండలంలోని రామలింగంపల్లి, పెద్దపర్వతాపూర్, బొమ్మలరామారం గ్రామాల్లోని పలు స్టోన్ క్రషర్ మిల్లులను లోకాయుక్త అధికారులతో పాటు పలు శాఖల అధికారుల బృందం గురువారం పరిశీలించారు. మండలంలోని సామాజిక కార్యకర్త మైలారం జంగయ్య ఫిర్యాదు మేరకు అధికారుల బృందం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్టోన్ క్రషర్ మిల్లుల నిర్వహణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులపై ఆరా తీశారు. నిబంధనల మేరకే మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయా, ఎక్స్‌ప్లోజివ్ వినియోగం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనలు పాటిస్తున్నారా, సక్రమంగా రాయల్టీ చెల్లిస్తున్నారా లాంటి అంశాలను పరిశీలించారు. క్రషర్ మిల్లుల యాజమానులు వారి వద్ద ఉన్న అనుమతి పత్రాలను వారంలోగా తమకు సమర్పించాలన్నారు. ఏ క్రషర్ మిల్లు యజమాని ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని, వారి ఇష్టానుసారంగా క్రషర్ మిల్లులు నడిపిస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని లోకాయుక్త అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకాయుక్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంకట్‌రావ్, డీఎస్పీ విద్యాసాగర్‌రావు, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఓ వెంకన్న, జిల్లా మైనింగ్ అధికారి రాఘవరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసరావు, జిల్లా మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్, మైనింగ్ డిజిటల్ సర్వేయర్ సుజాత, భువనగిరి రూరల్ సీఐ చంద్రభాను, ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం, ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.