
డిపో సీఐ దురుసు ప్రవర్తనపై నిరసన
ఏలూరు (టూటౌన్): ఏపీఎస్ ఆర్టీసీ ఏలూరు డిపో ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి డి.ఆంజనేయులుపై డిపో సీఐ దురుసు ప్రవర్తనకు నిరసనగా మంగళవారం స్థానిక ఆర్టీసీ గ్యారేజీ ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. యూనియన్ ఏలూరు డిపో గౌరవ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంజనేయులు పట్ల సీఐ అలా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. యూనియన్ నాయకులు, కమిటీ సభ్యుల పట్ల ఆర్టీసీ అధికారులు సూపర్వైజర్ చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. వెహికల్ కండిషన్ మెరుగుపరచాలని పదేపదే మేనేజ్మెంట్కు చెప్పినా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. డిపోలో కనీస మౌలిక వసతులు లేవని అన్నారు. ఆంజనేయులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని, బుధవారం నుంచి నాన్ కోపరేషన్ పాటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ డిపో నాయకులు వీఎస్ నారాయణ, ఎండి రమేష్, పీకేబీ రాజు, పి.శ్రీహరి పాల్గొన్నారు.
కూలీలు పస్తులుంటే.. యోగాలో నిమగ్నమా!
భీమవరం అర్బన్: గత రెండు నెలలుగా ఉపాధి హామీ కూలీలు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. అధికారులందరూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాలో నిమగ్నమైపోవడం దారుణమని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. భీమవరం మండలంలోని గూట్లపాడు, గొల్లవానితిప్ప గ్రామాల్లో మంగళవారం సీఐటీయూ సంఘం సభ్యులు పర్యటించి ఉపాధి హామీ కూలీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఎం.ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీ పనులు చేసిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించాలని చట్టంలో ఉన్నా రెండు నెలలు గడుస్తున్నా వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే యోగాసనాల్లో అధికారులు నిమగ్నమైపోవడం బాధాకరమన్నారు. ఉపాధి హామీ రోజు కూలీ రూ.600 చేసి ఏడాదికి 200 పనిదినాలకు పెంచాలని డిమాండ్ చేశారు.
కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య
భీమడోలు: దుద్దేపూడి పంచాయతీ పరిధిలోని అన్నేవారిగూడెం గ్రామానికి చెందిన అన్నేపు దుర్గాప్రసాద్ (35) కడుపు నొప్పి తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానినైన దుర్గాప్రసాద్ కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మంగళవారం ఒక్కసారిగా విపరీతంగా కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేక పురుగు మందును సేవించి మృతి చెందాడు. ఆతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు.

డిపో సీఐ దురుసు ప్రవర్తనపై నిరసన