చింతలపూడి: జిల్లాలోని మెట్ట ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో భూసారం దెబ్బతినడంతో దిగుబడులు తగ్గి పోవడం, చీడ పీడల ఉధృతి పెరగడం వంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. రైతులు సరైన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చునని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సబ్ డివిజన్‌లో ఖరీఫ్ సీజన్‌లో 15,792 హెక్టార్లలో వరి పంట సాగు చేస్తున్నారు. ఇందులో చింతలపూడి మండలంలో అత్యధికంగా 7,603 హెక్టార్లు, లింగపాలెం మండలంలో 3,072 హెక్టార్లు, కామవరపుకోట మండలంలో 2,457 హెక్టార్లు, టి.నరసాపురం మండలంలో 2,661 హెక్టార్లల్లో వరి సాగు చేపట్టారు.
వేసవి దుక్కులతో చీడ పీడల నివారణ
వేసవి దుక్కులు పంటలకు ఎంతో ప్రయోజనకరం. సాధారణంగా రైతులు కోతలు పూర్తవగానే పొలాలను అలాగే వదిలేస్తారు. తొలకరి పలకరించగానే సాగుకు సిద్ధమవుతారు. చినుకులు పడగానే దుక్కులు దున్నడం ప్రారంభిస్తారు. అలా కాకుండా వేసవిలోనే దుక్కులు దున్నడంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.నాగకుమార్ సూచిస్తున్నారు. వేసవిలో భూమిని దుక్కి దున్నకుండా వదిలేస్తే కలుపు మొక్కలు పెరుగుతాయి. అవి భూమిలోని నీటిని, పోషక పదార్థాల్ని గ్రహించి పెరుగుతాయి. కారణంగా భూమి లోపలి పొరల్లో నీరు హరించుకుపోతుంది. భూసారం తగ్గి పోతుంది. రైతు వేసిన పంటకు పోషకాలు లభించవు. వేసవి దుక్కుల వల్ల భూమి లోపలి పొరల్లో దాగివున్న కీటకాల గుడ్లు, శిలీంధ్రాలు బయటకు వచ్చి ఎండ తీవ్రతకు నశిస్తాయి. దుక్కిలో బయటపడిన పురుగులను పక్షులు తినడం వల్ల పంటలకు చీడ పీడల బెడద తప్పుతుంది.
భూసారం పెంచడం ఎలా?
భూసారాన్ని పెంచుకోవడానికి రైతులు కనీసం రెండు పంటలు వేసిన తరువాత పచ్చి రొట్ట సాగు చేయాలి. దీనివల్ల భూసారం పెరగడమేకాక చీడ పీడల బెడద తప్పి దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. సేంద్రియ పదార్థాలను నేలకు అందించడం, కలుపు మొక్కలు నివారించడం, నేలలో నివశించే జీవరాశులకు ఆహారంగా, మొక్కలకు కావల్సిన అన్ని పోషక పదార్థాలను అందించే సాధనాలుగా ఈ పచ్చిరొట్ట పంటలు ఉపయోగపడతాయి.
నేల సారవంతం
భూమిని 25 నుండి 30 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కులు దున్నడం వల్ల నేలలో గాలి లభ్యత పెరిగి సూక్ష్మ జీవుల సాంద్రత పెరుగుతుంది. కర్బన పదార్థం లభ్యత పెరిగి నేల సారవంతమవుతుంది. భూమికి వాలుగా దుక్కి దున్నడంతో వర్షం కురిసినప్పుడు ఆ నీరు భూమి లోపలకు ఇంకుతుంది. భూమికి నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వాతావరణంలోని నత్రజని వర్షపు నీటితో కలిసి నేలకు చేరడంతో సారవంతంగా మారుతుంది.
బి నాగకుమార్ –ఏడీఏ–వ్యవసాయ సబ్‌డివిజన్
వేసవి దుక్కులతో లాభాలు
వేసవి దుక్కులతో లాభాలు