స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత

Published Fri, May 10 2024 3:25 PM

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత

భీమవరం: పోలింగ్‌ ముగిసిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కేటాయించిన స్ట్రాంగ్‌రూమ్‌లకు ఎన్నికల నిబంధనలు, ప్రొటోకాల్‌ ప్రకారం పూర్తి భద్రతతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. గురువారం భీమవరంలోని సీతా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటుచేసే ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్‌రూమ్స్‌, కౌంటింగ్‌ కేంద్రాలు, రిసెప్షన్‌ సెంటర్లను ఆయన పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్స్‌ ఆయా నియోజకవర్గాల స్ట్రాంగ్‌రూమ్స్‌ తరలించేందుకు ముందుగానే రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌కు చేరుకోగానే ముందుగా రిసెప్షన్‌ సెంటరుకు అప్పజెప్పాలన్నారు. పోలింగ్‌ ఏజెంట్లు వచ్చే మార్గం, చట్టుపక్కల శాంతిభద్రతల పరిరక్షణపై ఆరా తీశారు. బస్‌ రూట్లు, వాహన పార్కింగ్‌, పోలింగ్‌ సామగ్రిని తీసుకునే స్టాల్స్‌, బ్యాలెట్‌ బాక్సులు, ఈవీఎంలు భద్రపరచు స్ట్రాంగ్‌రూమ్‌లు, మైక్రో అబ్జర్వర్లు వేచి ఉండే గదులు, భోజన స్టాల్స్‌ , కౌంటంగ్‌ హాలులో సీసీ కెమెరాల ఏర్పాట్లు, పోస్టల్‌ బ్యాలెట్స్‌ కౌంటింగ్‌ హాలు, ఫలితాల బోర్డు ఏర్పాటు, పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌ తదితర పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. ఆచంట నియోజకవర్గ ఆర్వో వి.స్వామినాయుడు, తహసీల్దార్‌ ఐపి శెట్టి ఆయన వెంట ఉన్నారు.

అధికారులూ.. అప్రమత్తంగా ఉండాలి

భీమవరం(ప్రకాశంచౌక్‌): ఎన్నికలకు మరో 72 గంటలు సమయం ఉన్నందున ఎన్నిక ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆర్వోలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి ఆయన గూగుల్‌ మీట్‌ ద్వారా సూచనలు జారీ చేశారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు 24 గంటలు అప్రమత్తంగా పనిచేయాలని, గ్రామాల్లో నగదు, మద్యం, బహుమతుల పంపిణీకి అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచార లోపం లేకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. డీఆర్వో జె.ఉదయ భాస్కరరావు, ఎన్నికల సూపరింటెండెంట్‌ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ అధికారులు జెడ్‌.వెంకటేశ్వరరావు, ఎం.మోహనరావు, యు.మంగపతిరావు, ఆర్‌.విక్టర్‌, కె.జాషువా పాల్గొన్నారు.

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

Advertisement
 
Advertisement