బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే : సీపీఐ(ఎంఎల్‌) | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే : సీపీఐ(ఎంఎల్‌)

Published Thu, Nov 9 2023 1:18 AM

సమావేశంలో మాట్లాడుతున్న కేజీ రాంచందర్‌  - Sakshi

అమరచింత: పేదల అభ్యున్నతికి పాటుపడుతామన్న పార్టీల నేతలు నేడు సొంత ఆస్తుల సంరక్షణ, సంపాదనకే పరిమితమయ్యారని సీపీఐ (ఎంఎల్‌ )ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కేజీ రాంచందర్‌ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలోని మార్క్‌ భవనంలో నిర్వహించిన పార్టీ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒకేజాతి పక్షులని.. నిత్యం ప్రజల మధ్య మత విధ్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే.. కులాల ప్రాతిపదికన విభజించి సంక్షేమం పేరిట ప్రజల్లో విధ్వేషాలు నింపుతున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామని చెప్పారు. పేదలకు ఇచ్చే రాయితీ సరుకులు విడతల వారీగా ఎత్తేసి కేవలం బియ్యంతో సరిపెడుతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నా.. సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణగా తీర్చుదిద్దుతామని ప్రగాల్భాలు పలకడం వింతగా ఉందని తెలిపారు. వ్యవసాయ, కార్మిక చట్టాల రద్దు, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడంతో పాటు ఉపాధిహామీ పథకం నిధులు తగ్గించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానమన్నారు. ఎన్నికల్లో ప్రజలకు మేలు చేసే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని చెప్పారు. సమావేశంలో ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం, ఏఐపీకేఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, ప్రజాపంథా జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్‌, రాజన్న, హన్మంతు, రాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement