ఆకతాయి వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఆకతాయి వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య

Published Thu, Jan 11 2024 7:38 AM

మృతురాలి బంధువులతో మాట్లాడుతున్న డీఎస్పీ కోటారెడ్డి  - Sakshi

తిరుపతి: ఆకతాయి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. సైదాపురానికి చెందిన బండి శిరీష(16) గూడూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కోలా జస్వంత్‌ (20) అనే డ యువకుడు రోజూ వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో విద్యార్థిని తమ కుటుంబసభ్యులకు విషయం తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తమకు న్యాయం చేయడంలేదని భావించిన విద్యార్థిన హుటాహుటిన ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

కుటుంబీకులు వెంటనే గూడూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే శిరీష మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతురాలి బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పోలీస్‌స్టేషన్‌ ఎదుట మృతదేహాన్ని ఉంచి తమ బిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న డీఎస్పీ కోటారెడ్డి, సీఐ సుబ్రమణ్యం అక్కడకు చేరుకున్నారు.

మృతురాలి కుటుంబీకులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నిందితుడు జస్వంత్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.

Advertisement
Advertisement