
పరిశ్రమల వద్ద వృథాగా ఉన్న భూముల లెక్కలు తీస్తున్న ప్రభుత్వం
సర్కారు ఇచ్చిన భూముల దుర్వినియోగంపై దృష్టి
లెక్కలు తేల్చేందుకు పరిశ్రమల శాఖ డైరెక్టర్ నేతృత్వంలో కమిటీ
వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
గతంలో 65 సంస్థల నుంచి 1,960 ఎకరాలు తిరిగి వెనక్కి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ సవాలుగా మారుతున్న నేపథ్యంలో.. గతంలో పరిశ్రమలకు కేటాయించిన భూములపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నిర్దేశించిన అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములు, ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా నిరుపయోగంగా ఉన్న ప్లాట్ల లెక్క తేల్చేందుకు సిద్ధమైంది. నిరుపయోగంగా ఉన్న భూములను అవసరమైతే స్వా«దీనం చేసుకుని.. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుచేసే సంస్థలకు కేటాయించాలని భావిస్తోంది.
ఇందుకోసం పరిశ్రమల శాఖ డైరెక్టర్ డాక్టర్ మల్సూర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కి చెందిన ఇద్దరు అధికారులను ఇందులో సభ్యులుగా నియమించింది. టీజీఐఐసీ ద్వారా పరిశ్రమలకు కేటాయించిన భూములను పరిశీలించి.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించింది. ఆ నివేదిక అధారంగా నిరుపయోగంగా ఉన్న భూములను వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేయనుంది. ఉచితంగా భూమి కేటాయించినా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టని 225 సంస్థల నుంచి 1,964 ఎకరాల భూమిని టీజీఐఐసీ గతంలో వెనక్కి తీసుకుంది. ఇందులో కొన్ని సంస్థలు కోర్టులను ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

కమిటీ పరిశీలించే అంశాలివే
⇒ గతంలో జరిపిన భూ కేటాయింపులపై పూర్తిస్థాయిలో ‘భూ తనిఖీ’(ల్యాండ్ ఆడిట్) చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు.
⇒ టీజీఐఐసీ భూ కేటాయింపులను రద్దు చేసినా, కొన్నిచోట్ల సదరు భూములు పారిశ్రామిక సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఆ భూములను దుర్వినియోగం చేస్తున్న సంస్థలపై జరిమానా కూడా విధించారు. ఇలాంటి అంశాలను పరిశీలించి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.
⇒ పారిశ్రామిక వాడల్లో విక్రయించగా మిగిలిన ప్లాట్లు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. వాటి సంఖ్య, విస్తీర్ణం తేల్చే బాధ్యతను కూడా ఈ కమిటీకి అప్పగించారు.
⇒ పరిశ్రమలకు కేటాయించిన భూములను ఇతరత్రా అవసరాలకు ఉపయోగిస్తున్నారా లేదా? అనే అంశాన్ని కమిటీ పరిశీలిస్తుంది.
దుర్వినియోగం కాకుండా పర్యవేక్షక వ్యవస్థ
టీజీఐఐసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 170కి పైగా పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. కొత్తగా మరో 35 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు 13,741 ఎకరాల భూమి అవసరమని టీజీఐఐసీ గుర్తించింది. ఇందులో 2,338 ఎకరాలు ప్రభుత్వ, 7,638 ఎకరాలు అసైన్డ్, 3,765 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటు కోసం గతంలో కేటాయించిన, ప్రస్తుతం సేకరిస్తున్న భూములతో కూడిన ల్యాండ్ బ్యాంక్ పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ల్యాండ్ బ్యాంక్ నిర్వహణ, కేటాయింపులను పర్యవేక్షించడంతో పాటు దుర్వినియోగం కాకుండా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.