చార్టర్డ్‌ ప్లేన్స్‌కు అనుమతివ్వండి

Telangana Govt Proposal To AAI Over Chartered Flight Service Permission - Sakshi

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన 

తొలుత తేలికపాటి ప్రైవేటు విమానాలు ప్రారంభించే యోచనలో యంత్రాంగం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తొలుత చార్టర్డ్‌ విమానాలను నడుపుకొనేందుకు వీలుగా అనుమతులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా అధికారులు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు ప్రతిపాదించారు. వాస్తవానికి ఏడాదిన్నర కిందటే ఈ అంశంపై ఏఏఐతో అధికారులు చర్చించారు. ఈ లోపు కన్సల్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఏఐ వాణిజ్య విభాగం.. టెక్నో ఫీజిబులిటీ సర్వే నిర్వహించేందుకు సిద్ధం కావటంతో ఆ అంశం మరుగున పడింది. దాదాపు రెండు నెలల కింద ఆ నివేదిక వచ్చింది.

దాని ప్రకారం విమానాశ్రయాల నిర్మాణానికి భారీగా ఖర్చు కానుందని స్పష్టం చేసింది. దీంతో వీలైనంత వరకు ఖర్చు తగ్గించేలా కొన్ని అడ్డంకులను దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మళ్లీ సర్వే చేయాల్సి రావటంతో కొత్త విమానాశ్రయాల అంశం కొలిక్కి రాలేదు. దీంతో భవిష్యత్తులో వాటిని పెద్ద విమానాలు నడుపుకొనేందుకు వీలుగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తూనే.. తొలుత చిన్నపాటి రన్‌వేలు నిర్మించి చార్టర్డ్‌ విమానాలను నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని తాజాగా కోరింది.  

వరంగల్‌ ఒక్కటే అనుకూలం.. 
నిజాం హయాంలో నిర్వహించిన వరంగల్‌ శివారులోని మామునూరులో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను తిరిగి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా యత్నిస్తోంది. దీంతోపాటు జక్రాన్‌పల్లి (నిజామాబాద్‌), పాల్వంచ (భద్రాచలం–కొత్తగూడెం), బసంత్‌నగర్‌ (పెద్దపల్లి), ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో కూడా కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని ప్రతిపాదించింది. తాజాగా ఏఏఐ అందించిన టెక్నో ఫీజిబిలిటీ నివేదిక ప్రకారం రూ.2,300 కోట్లకుపైగా ఖర్చు కానుంది. దీన్ని వీలైనంత తగ్గించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలను ఏఏఐ ముందుంచింది.

విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న అడ్డంకుల్లో కొన్నింటిని వదిలేస్తే ఖర్చు తగ్గుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం. అది సాధ్యమా కాదా అన్న విషయంలో ఏఏఐ తిరిగి నివేదిక అందించాల్సి ఉంది. ఆ తర్వాత తుది సర్వే చేయాలి. ఇదంతా జరిగేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున చార్టర్డ్‌ విమానాలను నడిపితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇవి సమయ పట్టిక ఆధారంగా ప్రయాణికుల కోసం నడిపే విమానాలు కాదు. ముందస్తుగా బుక్‌ చేసుకుంటే సంస్థలు వాటిని ప్రైవేటు అవసరాల కోసం నడుపుతాయి.

వీటిల్లో 19 సీట్ల వరకు ఉండే విమానాలకు మంచి డిమాండ్‌ ఉంది. కానీ ఈ ప్రైవేటు విమానాలకు మన వద్ద అంతగా వ్యాపారం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్‌ వేగంగా అభివృద్ధి చెందుతుండటం, అక్కడ పరిశ్రమలు భారీగా వస్తుండటం, సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో చార్టర్డ్‌ విమానాలకు కొంత డిమాండ్‌ మొదలవుతుందన్న అభిప్రాయంలో ఉంది. 

టేకాఫ్‌.. ల్యాండింగ్‌ ఒకవైపే.. 
సాధారణంగా రన్‌వేలకు టేకాఫ్, ల్యాండింగ్‌ వసతి రెండు వైపులా ఉండేలా ప్లాన్‌ చేస్తారు. మరోవైపు రెండు రన్‌వేలను నిర్మిస్తారు. రాష్ట్రంలో ప్రతిపాదిత ఆరు విమానాశ్రయాల ఖర్చు తగ్గించుకునే క్రమంలో తొలుత ల్యాండింగ్, టేకాఫ్‌ ఒకవైపే అయ్యేలా సాధారణ రన్‌వేతో ప్రారంభించాలని అధికారులు ఏఏఐకి ప్రతిపాదించారు. భవిష్యత్తులో వాటిని రెండు వైపులా విస్తరించటంతో పాటు రెండో రన్‌వేను కూడా నిర్మించుకోవచ్చని, తొలుత ఒకవైపే టేకాఫ్, ల్యాండింగ్‌ అయ్యేలా రన్‌వేకు అనుమతించాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top