
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్‌లో మహమ్మద్ అజహరుద్దీన్‌కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని సమాచారం. తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేర్లకు కేబినెట్ శనివారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ముహమ్మద్ అజహరుద్దీన్.. 2009 ఫిబ్రవరి 19వ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మురాదాబాద్ (ఉత్తరప్రదేశ్) లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టోంక్ (రాజస్థాన్) నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణకు తిరిగొచ్చిన ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2023లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తానే అభ్యర్థినంటూ మాజీ ఎంపీ అజహరుద్దీన్ ప్రకటిస్తూ వచ్చారు. మరోవైపు అధిష్టానం వద్ద మైనారిటీ విభాగం ఒత్తిడి నేపథ్యంలో ఆయనకే సీటు ఇవ్వడం ఖాయమని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ కట్టబెట్టాలని నిర్ణయించడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరై ఉంటారా? అనే సస్పెన్స్ కొనసాగనుంది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హఠాన్మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటు కోసం కాంగ్రెస్ నుంచి మైనార్టీ, కమ్మ, బీసీ సామాజిక వర్గాల నేతలు పోటీ పడుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్.. ఈసారి తానే పోటీ చేస్తానంటూ ప్రకటించుకుంటూ వచ్చారు. మరోవైపు.. అభ్యర్థి ఎంపిక అంత ఆషామాషీగా జరగదని.. రకరకాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అధిష్టానం తొలి నుంచే సంకేతాలు ఇస్తూ వచ్చింది.