
మొక్కలు నాటేందుకు ముందుకు రావాలి
వేలూరు: ప్రతి గ్రామ పంచాయతీలోనూ మొక్కలు నాటేందుకు ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని అగరంజేరి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జూన్ 5వ తేదీ నుంచి ఇప్పటికే అన్ని తాలుకాలోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామని, మొత్తం 35 వేల మొక్కలను జిల్లాలోని రోడ్లకిరువైపులా నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ఇందుకు జిల్లాలోని విద్యార్థులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రస్తుతం నాటుతున్న మొక్కలను గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద ఒక సంవత్సరం వరకు సంరక్షించించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంబూరు ఎమ్మెల్యే విల్వనాథన్, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారి తిరుమాల్, మాదనూర్ యూనియన్ చైర్మన్ సురేష్‌కుమార్, సర్పంచ్ వత్సల, బీడీఓ శరవణన్, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.