
4 జంటలకు ఉచిత వివాహాలు
తిరుత్తణి: సుబ్రమణ్యస్వామి ఆలయంలో బుధవారం నాలుగు జంటలకు ఉచిత వివాహాలు జరిపి, బంగారంతోపాటు వివాహ కానుకలు పంపిణీ చేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు చెందిన యువతీ, యువకులకు రాష్ట్ర ప్రభుత్వ హిందు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కొండ ఆలయంలోని ఆర్సీ మండపంలో నాలుగు జంటలకు ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో వివాహాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ ప్రభుత్వం ద్వారా వధూవరులకు నాలుగు గ్రాముల బంగారంతోపాటు వివాహం పట్టు వస్త్రాలు, పువ్వుల మాలలు, బీరువా, మంచం, వెండి దీపం, సహా రూ.30 వేలు విలువైన ఇంటి సామగ్రిని పెండ్లి కానుకగా పంపిణీ చేసి, వధూవరులను ఆశీర్వదించారు. వివాహంలో పాల్గొన్న వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులకు ఆలయాధికారులకు భోజనాల ఏర్పాట్లు చేశారు. వివాహం చేసుకున్న కొత్త జంటలు నేరుగా స్వామివారి దర్శనానికి ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ డీఎంకే కన్వీనర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.