
పరందు పో ఎవరినీ నిరాశ పరచదు
తమిళసినిమా: దర్శకుడు రామ్ చిత్రాలు కచ్చితంగా ఇతర చిత్రాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈయన చిత్రాల్లో మంచి సందేశం ఉంటుంది. ఇంతకు ముందు ఆయన తెరకెక్కించిన కట్రదు తమిళ్, తంగమీన్‌గళ్, తరమణి, పేరంబు వంటివన్నీ వైవిధ్యభరిత కథా చిత్రాలే. అంతే కాకుండా ప్రజాదరణతో పాటు పలు అవార్డులను తెచ్చిపెట్టాయి. కాగా రామ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం పరందు పో. జియో హర్ట్‌స్టార్, జీకేఎస్ ప్రొడక్షన్, సెవన్ సీన్ అండ్‌సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో నటుడు శివ గ్రేస్ ఆంటోని జంటగా నటించారు. మాస్టర్ మిఽథున్ ర్యాన్, అంజలి, అజు వర్గీస్,విజయ్ యేసుదాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్‌కే. ఏకాంబరం ఛాయాగ్రహణంను, సంతోష్ దయానిధి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్బంగా ఇందులో కథానాయకుడిగా నటించిన నటుడు శివ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఈ చిత్రంలో నటించడానికి దర్శకుడు రామ్ తనను పిలిచినప్పుడు తనకు చాలా ఆశ్యర్యం కలిగిందన్నారు. నటీనటుల నుంచి తనకు కావాల్సిన నటనను రాబట్టుకునే వరకూ వదలని దర్శకుడాయన అని పేర్కొన్నారు. కాగా ఆయన స్టైల్‌లోనే ఈ పరందు పో చిత్రం ఉంటుందని చెప్పారు. చిత్రం చూసిన ప్రేక్షకులు కచ్చితంగా చిరునవ్వులు చిందిస్తూ సంతృప్తిగా బయటకు వస్తారని అన్నారు. ఈ చిత్రం ఎవరిని నిరాశ పరచదనే నమ్మకాన్ని నటుడు శివ వ్యక్తం చేశారు.