
● ఎన్ని విమర్శలైనా చేసుకోండి ● నిజమైన భక్తుల ప్రయోజనాలే
సాక్షి, చైన్నె: రాజా అన్నామలైపురంలో హిందూ మతం, దేవాదాయ శాఖ నేతృత్వంలో 32 జంటలకు సామూహిక వివాహ వేడుక బుధవారం జరిగింది. ఏటా పేద జంటలకు ఈ వివాహలను జరిపిస్తున్నారు. 2022–2023లో 500, 2023–2024లో 600 , 2024–2025 లో 700 జంటలకు వివాహాలు జరిగాయి. 2025–2026లో 1000 జంటలకు వివాహాలు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ వివాహ నిమిత్తం 4 గ్రాముల బంగారు తాళి, రూ. 70 వేలు విలువైన అన్ని రకాల వస్తువులతో సారెను ఈ జంటలకు అందిస్తున్నారు. తాజాగా బుధవారం 32 జంటలకు వివాహం జరిగింది. జంటలకు తాళిబొట్టుతో సహా అన్ని రకాల సామాగ్రిని సీఎం చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, ఎంసుబ్రమణియన్, పికే శేఖర్‌బాబు, మైలం బొమ్మపురం ఆధీనం శివజ్ఞానపాళయం స్వామిగల్, తిరువణ్ణామలై మఠం అథీనంు ఆది శివలింగాచార్య గురు స్వామిగల్, మెట్రోపాలిటన్ చైన్నె కార్పొరేషన్ మేయర్ శ్రీమతి ఆర్. ప్రియ, ఎమ్మెల్యేలు టి.వేలు, తాయకం కవి, జోసెఫ్ శామ్యూల్, జె. కరుణానిధి, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎం. మహేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఆనందంగా కలిగిస్తోంది..
హిందూ మతం దేవాదాయ శాఖ ధార్మిక సంస్థ విభాగం ఈ వివాహాలను ఏటా నిర్వహిస్తుండటం ఆనందంగా ఉందని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వధూవరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ శాఖ మంత్రి శేఖర్‌బాబు కార్మికుడిగానే కాదు సైనికుడిగా కూడా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. ప్రభుత్వ రంగాల పరంగా ఆయన ఏ రంగంలో రాణించ గలరో అని గుర్తించే ఈ శాఖను అప్పగించామన్నారు. శేఖర్‌బాబు భక్తితో ఈ నాలుగు సంవత్సరాలు ఈ శాఖను విజయవంతంగా నడిపించారని అభినందించారు. గత ఏడాది వరకు 1,800 వివాహాలు జరగ్గా ఈ ఏడాది ఇప్పటి వరకు 576 వివాహాలను విజయవంతంగా పూర్తి చేశారని వివరించారు. ఆధ్యాత్మిక ప్రియుల భాషలో చెప్పాలనుకుంటే, శేఖర్ బాబు ఓ భక్తుడిగా మారి సేవలు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3177 ఆలయాలను అభివృద్ధి చేశామని, ఇది ఒక రికార్డుగా అభివర్ణించారు. 997 దేవాలయాలకు చెందిన 7 వేల 701 కోట్లు విలువ చేసే 7 వేల 655 ఎకరాల స్థలాలను స్వాధీనం చేసుకున్నామని, అదనంగా, 2 లక్షల 3 వేల 444 ఎకరాల భూమి రక్షించబడిందన్నారు. 12,876 దేవాలయాలకు పునరుద్ధరణలు, వెయ్యి సంవత్సరాల పురాతన దేవాలయాల పురాతనత చెక్కు చెదరకుండా రూ. 425 కోట్లను కేటాయించి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆది ద్రావిడలు నివసించే ప్రాంతంలో 5 వేల దేవాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5,000 దేవాలయాలు పునరుద్ధరణలకు తాజాగా ఆర్థిక సాయం అందజేసి ఉన్నామన్నారు. ఆడి నెలలో అమ్మన్ ఆలయాలు, పెరటాసి నెలలో వైష్ణవ ఆలయాలలో విశిష్ట పూజలు, రామేశ్వరం, కాశీ సందర్శనకు 60 నుంచి 70 ఏళ్లు పై బడ్డ వారికి ఆథ్యాత్మిక యాత్రకు సాయం అందిస్తున్నామని వివరించారు. ఆలయాల అభివృద్ధి కాదు, భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా విస్తృత ఏర్పాట్లు, నిర్మాణాలు జరుగుతూ వస్తున్నాయని వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా వివరించేందుకు అవకాశం ఉందని పేర్కొంటూ, అందరికీ సర్వస్వం లక్ష్యంగా ద్రావిడ మోడల్ పాలన రాష్ట్రంలో ఉందన్నారు. తనకు అందరూ సమానం, అని అందరికీ అన్ని దక్కాలన్నదే కాంక్షగా పేర్కొంటూ, అయితే, సమాజం, ద్వేషం అన్న విభజన కలిగి ఉన్న వాళ్లు చేస్తున్న చర్యలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు.
భక్తి పేరుతో..
కొందరు భక్తి పేరుతో వేస్తున్న పగటి వేషాలను చూస్తుంటే ఆందోళన తప్పడం లేదన్నారు. ఈ సందర్భంగా ఓ పత్రికలో వచ్చిన కార్టూన్ గురించి ప్రస్తావిస్తూ, దీన్ని బట్టి అర్థం చేసుకోండి, తాను కావడి తీసుకుంటున్నట్టు, మంత్రులతో కత్తితో నేల మీద దొర్లినట్టుగా ఉన్న ఆ కార్డూన్‌ను చూసి నవ్వు ఆపుకోలేక పోయినట్టు పేర్కొన్నారు. వారి లక్ష్యం భక్తి కంటే, ప్రభుత్వన్ని కించ పరచడమే థ్యేయం అన్నట్టుందన్నారు. వాస్తవానికి వారు ప్రభుత్వం అందించిన ఆథ్యాత్మిక ప్రయోజనాలను అభినందించి ఉంటే సంతోషించి ఉండే వాడ్ని అని, అయితే, కార్టూన్ రూపంలో సైతం వారిలో ఉన్న ద్వేషాన్ని వెల్లగక్కి ఉన్నారని విమర్శించారు. ఆధారం లేని ఆరోపణల గురించి తాను మాట్లాడ దలచుకోలేదన్నారు. నా పని నిత్యం ప్రజల సేవ మాత్రమే అని, ప్రజలకు ఏమి చేయాలి, మరింతగా ఎలాంటి పథకాలు అమలు చేయాలి, బృహత్తర ప్రాజెక్టులు ఎలా ఉండాలన్నదే కీలకంగా వివరించారు. ప్రజలే ముఖ్యం అని, తనను విమర్శించే వారి గురించి పట్టించుకోబోనని, విమర్శించే వాళ్లు విమర్శించుకోని అని హితవు పలికారు. నిజమైన భక్తుల ప్రయోజనం కోసం తాము శ్రమిస్తూనే ఉంటామని వివరిస్తూ, ఇక్కడ కొత్తగా వివాహలైన వధు వరులు పుట్టే బిడ్డలకు తమిళంలోనే పేర్లు పెట్టాలని , ఇంటికి ఒకరు స్వచ్ఛందంగా సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.