
కూవాగంలో ‘హిజ్రాల’ పండుగ
● కూత్తాండవర్ ఉత్సవాలకు శ్రీకారం
● 13న పెళ్లి సందడి
సాక్షి, చైన్నె: కూవాగంలో హిజ్రాల వసంతోత్సవ వేడుకకు ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం కూత్తాండవర్ ఆలయంలో ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వివరాలు.. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలందూరు పేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువు దీరిన కూత్తాండవర్ హిజ్రాలకు ఆరాధ్యుడు. ఈ ఆలయంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలు దేశ విదేశాల్లోని హిజ్రాలు తరలి వస్తుంటారు. ఇక్కడి వేడుకకు మహాభారత యుద్ధగాధ ముడి పడి ఉందని పురాణాలు చెబుతాయి. ఇతిహాసం మేరకు మోహినీ అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడిని వివాహమాడిన ఐరావంతుడిని తమ ఆరాధ్యుడిగా హిజ్రాలు కొలుస్తూ వస్తున్నారు. ఇక్కడ కొలువు దీరిన కూత్తాండవర్(ఐరావంతుడి) ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసంలో వేడుకల్ని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది ఉత్సవాలను అత్యంత వేడుకగా జరుపుకునేందుకు హిజ్రాలు సిద్ధం అవుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువ జాము వరకు కూత్తాండవర్ సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజాధి కార్యక్రమాలతో ధ్వజారోహణం వేడుక జరిగింది. ఆ పరిసర గ్రామాల్లోని ప్రజలు రాగి గంజిని తయారు చేసి కుండలు, బిందెల్లో పోసి ఊరేగించారు. స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. ఇక, ఉప వాస వ్రతంతో ఆలయ అర్చకులు రోజూ విశిష్ట పూజలు నిర్వహించనున్నారు. పది రోజుల పాటూ ఇక్కడ ఆ పరిసర గ్రామాల ప్రజలు ఆలయంలో వివిధ పూజలు, ఇతర వేడుకకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
13న పెళ్లి సందడి..
ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి. అత్యంత వేడుకగా జరిగే ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున హిజ్రాలు తరలి వస్తారు. ఈనెల 13వ తేదీన హిజ్రాల పెళ్లి సందడి కూవాగంలో నెలకొననున్నది. ఈ వేడుక నిమిత్తం హిజ్రాలు కూవాగంకు పోటెత్తనున్నారు. వీరి బస కోసం అక్కడి లాడ్జీలు, గెస్టు హౌస్‌లు, విడిదులు ముస్తాబు అవుతున్నాయి. ఇక అందగత్తెలకు తామేమీ తక్కువ కాదన్నట్టుగా సింగారించుకుని వచ్చే హి జ్రాలకు అందాల పోటీలు సైతం ఇక్కడ జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు 14వ తేది కూత్తాండవర్ రథోత్సవం, హిజ్రాలు తాళి బొట్టు తెంచి వితంతువుగా మారే విషాద కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు , స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో హిజ్రాల కోసం ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి.